- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Spare parts:స్పేర్ పార్ట్స్ దందా..మార్కెట్‌ను ముంచెత్తుతున్న నకిలీలు..!
దిశ,వరంగల్ బ్యూరో:వాహనాల నకిలీ విడి పరికరాల దందా హన్మకొండ, వరంగల్ నగరాల్లో దర్జాగా సాగుతోంది. మూతపడిన కార్ల, బైక్ కంపెనీల స్పేర్ పార్ట్స్ నకిలీవి అడ్డగోలుగా పుట్టుకొస్తున్నాయి. నాణ్యత లేనివి, ఆల్ట్రనేషన్ చేసిన లోకల్ మేడ్ విడి పరికరాలను అధిక ధరలకు అమ్మేస్తున్నారు. ఓరిజినల్ కాదు కానీ, ఓరిజినల్ లాంటిదేనంటూ అంటగట్టేస్తున్నారు. ఇలా కొనుగోలు చేస్తున్న వాహన పరికరాల పరిస్థితి కూడా మున్నాళ్ల ముచ్చటగానే ముగుస్తోంది. కొన్ని కంపెనీల వాహనాలకు సంబంధించిన విడి పరికరాల కొరత తీవ్రంగా ఉండటం, హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సర్వీసు సెంటర్లు ఉండటం నకిలీ పరికరాల తయారీదారులకు బాగా కలిసివస్తోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆటోమొబైల్ రంగానికి అడ్డాగా ఉన్న అలంకార్, ఆటోనగర్ ప్రాంతాల్లో వెలిసిన కొన్ని ఆటో మొబైల్ షాపులు కేంద్రంగా ఈ దందా జరుగుతోంది. స్పేర్ పార్ట్స్ కొరత ఉన్న వాహనదారులు, హైదరాబాద్‌లాంటి దూరప్రాంతాలకు వెళ్లలేక అత్యవసరమని భావించిన వాళ్లు ఓరిజినల్ లాంటివిగా దుకాణాదారులు చెబుతున్నవాటిని తప్పనిసరి పరిస్థితిలో కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన విడి పరికరాల్లో ఎలక్ట్రికల్ సహా సున్నితమైన కొన్ని పరికరాలు త్వరగా పాడైపోతుండటం గమనార్హం. డబ్బులు పోతుండటంతో పాటు వాహనాలు తరుచూ మెకానిక్ షెడ్డులకు చేరుకోవాల్సి వస్తుండటంతో తలలు పట్టుకుంటున్నారు.
రశీదు ఉండదు..!
వాహనాల పరికరాల కొనుగోలుకు సంబంధించి, అమ్మకాలకు సంబంధించిన బిల్లులు ఇవ్వడం లేదు. ఇష్టముంటే కొనండి లేదంటే వెళ్లిపోండి..కానీ బిల్లు ఇవ్వడం కుదరదంటూ తెగేసి చెబుతుండటం గమనార్హం. సామాన్యంగా ఏ వినియోగదారుడైనా ఏ వస్తువు కొనుగోలు చేసిన రసీదు పొందడం చట్ట పరంగా వినియోగదారుని యొక్క హక్కు. అంతేకాకుండా వ్యాపారం చేసుకునే వారు కూడా వస్తువులను కొనుగోలు చేస్తారు కాబట్టి వ్యాపారస్తులు కూడా కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్ వద్ద వినియోగదారు కిందే వస్తారు. కానీ ఆ విషయాన్ని మర్చిపోయి కొంతమంది ఆటో మొబైల్ షాపుల నిర్వాహకులు అమ్మిన పరికరాలకు సంబంధించిన బిల్లులు ఇవ్వడం లేదు. వ్యాపారులు ఏ వస్తువు అమ్మినా.. కొన్నా చట్ట పరంగా ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ, కొంతమంది జీరో దందా నిర్వహిస్తున్నారు. నాణ్యతలేని స్పేర్ పార్ట్స్ అమ్మకాలు సాగిస్తున్న కొన్ని దుకాణాల టర్నోవర్ నిత్యం లక్షల్లో ఉంటోందంటే అతిశేయోక్తి కాదు. నాణ్యత లేని వస్తువుల అమ్మకాలతో రిపేర్ మెకానిక్స్‌తో కస్టమర్లకు గొడవలకు దారి తీస్తున్నాయి.
తనిఖీలకు దూరంగా తూనికలు కొలతల శాఖ..
ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతతో పాటు వాహనదారులను నిలువునా మోసం చేస్తున్న ఆటో మొబైల్ షాపుల్లో తనిఖీలకు తూనికలు కొలతల శాఖ అధికారుల దూరంగా ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. తూనికలు, కొలతల శాఖ సిబ్బంది ప్రతి వారం అన్ని దుకాణాల్లో తనిఖీలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సిబ్బంది నెలల తరబడి దాడులు చేయకపోవడంతో వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా మోసాలకు పాల్పడుతూ వినియోగదారులను దారుణంగా దోపిడీకి గురి చేస్తున్నారు. తనిఖీలకు దూరంగా ఉంటున్న అధికారులు మామూలుగానే వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదు వస్తేనే స్పందిస్తామనే వైఖరితో అధికారులు ఉండటం గమనార్హం. ఇప్పటికైనా ఆటో మోబైల్ షాపుల్లో జరుగుతున్న దందాను అరికట్టడానికి సంబంధిత శాఖ అధికారులు దుకాణాల్లో తనిఖీలు చేపడుతారో లేదో వేచి చూడాలి.