Onion Bombs: ఏలూరులో దారుణం.. పేలిన ఉల్లిపాయ బాంబుల బస్తా.. ముక్కలైన శరీరం

by Rani Yarlagadda |
Onion Bombs: ఏలూరులో దారుణం.. పేలిన ఉల్లిపాయ బాంబుల బస్తా.. ముక్కలైన శరీరం
X

దిశ, వెబ్ డెస్క్: దీపావళి పండుగ వేళ ఏలూరు (Eluru Bomb Blast) నగరంలోని తూర్పు వీధిలో దారుణ ఘటన జరిగింది. స్కూటీపై ఇద్దరు వ్యక్తులు బాంబులు తీసుకెళ్తుండగా.. భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రుల్ని ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. మృతుడిని సుధాకర్ గా గుర్తించారు. పేలుడు ధాటికి అతని శరీర భాగాలు ఛిద్రమై.. చుట్టుపక్కల ఉన్న ఇళ్లవద్ద పడటంతో ఆ ప్రాంతవాసులు భయభ్రాంతులకు గురయ్యారు.

పరిసరాల్లో ఉన్న టూ వీలర్లు ధ్వంసమయ్యాయి. ఇళ్లలో ఉన్న కిటికీల అద్దాలు విరిగిపోయాయి. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొందరు బాంబు పేలుళ్ల శబ్ధం విని పరుగులు తీశారు. ఈ దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సుధాకర్ అనే వ్యక్తి మరో వ్యక్తితో కలిసి బైక్ పై ఉల్లిపాయ బాంబుల బస్తా తీసుకెళ్తున్నాడు. తూర్పు వీధిలో గంగానమ్మ ఆలయం సమీపంలో రోడ్డుపై ఉన్న గుంత చూసుకోకుండా వెళ్లడంతో.. చేతిలో ఉన్న బాంబుల బస్తా కిందపడింది. దాంతో పెద్దఎత్తున పేలుడు సంభవించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story