LIC: మణిపాల్ సిగ్నాలో వాటాను కొనుగోలు చేయనున్న ఎల్ఐసీ

by S Gopi |
LIC: మణిపాల్ సిగ్నాలో వాటాను కొనుగోలు చేయనున్న ఎల్ఐసీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ ఆరోగ్య బీమా రంగంలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నెల ప్రారంభంలో ఎల్ఐసీ సీఈఓ సిద్ధార్థ మహంతి సైతం ఈ విషయాన్ని ధృవీకరించారు. ఓ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో వాటా కొనుగోలుకు చర్చలు జరుగుతున్నాయని, నెలాఖరున నిర్ణయ ప్రకటన వస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ సంస్థ ప్రముఖ మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్‌లో వాటాను కొనేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. రంజన్ పాయ్ నేతృత్వంలోని మణిపాల్ సిగ్నా కంపెనీలో 40-49 శాతం వాటాను కొనాలని ఎల్ఐసీ భావిస్తోందని, దీని విలువ రూ.3,500-3,750 కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతానికి చర్చలు తుది దశలో ఉన్నాయని సంబంధిత వర్గాలు చెప్పినట్టు ఎకనమిక్ టైమ్స్ పేర్కొంది. ప్రస్తుతం ఈ కంపెనీలో మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ (51 శాతం), అమెరికాకు చెందిన సిగ్నా కార్పొరేషన్ (49 శాతం) సంయుక్తంగా యాజమాన్య వాటాను కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఎల్ఐసీ ఇందులో వాటా కొనుగోలు చేస్తే మూడు సంస్థలు యాజమాన్య భాగస్వామ్యాన్ని కొనసాగిస్తాయి. మణిపాల్ సిగ్నాలో మైనారిటీ వాటా కొనేందుకు ఎల్ఐసీ బోర్డు కూడా సూత్రప్రాయంగా ఆమోదించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించి ఎల్ఐసీ సంస్థ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Next Story