హామీలపై స్పెషల్ ఫోకస్.. కాంగ్రెస్, బీజేపీ స్కెచ్ ఇదేనా!

by Sathputhe Rajesh |
హామీలపై స్పెషల్ ఫోకస్.. కాంగ్రెస్, బీజేపీ స్కెచ్ ఇదేనా!
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ఫుల్ జోష్‌లో ఉన్న కాంగ్రెస్ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. కర్ణాటకలో కలిసొచ్చిన అంశాల్లో కీలక అంశాలను తెలంగాణలోనూ మేనిఫెస్టోలో పెట్టి మధ్య తరగతి ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. కర్ణాటకలో ప్రధానంగా ఐదు హామీలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాయి. అయితే అప్పటికే బీజేపీ అవినీతి ఆరోపణలతో కూరుకుపోవడంతో వ్యతిరేక ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. బీపీఎల్ కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంట్, కుటుంబంలో పెద్దగా ఉన్న మహిళకు ప్రతి నెలా రూ.2వేల ఆర్థిక సాయం, నిరుద్యోగులకు రూ.3వేల భృతి, డిప్లొమా చేసిన నిరుద్యోగులకు రూ.1500 భృతి వంటి హామీలు అక్కడ హస్తం పార్టీకి కలిసొచ్చాయి. కుటుంబంలో ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ హామీ సైతం అక్కడ వర్క్ అవుట్ అయింది.

ఇలాంటి పథకాలనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కర్ణాటకలో చక్రం తిప్పినట్లే ఇక్కడ కూడా కీలకంగా వ్యవహరిస్తారని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న కరెంట్ బిల్లులు సామాన్యులకు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో ఉచిత కరెంట్ హామీ ఇక్కడ సతత్ఫలితాలు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆసరా పింఛన్లను ఇప్పటికే ప్రభుత్వం అందిస్తున్నందున ఇచ్చే మొత్తాన్ని పెంచితే ఎలా ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. 2018లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ ఇప్పటికి బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చేలేదు. దీంతో నిరుద్యోగ భృతి అంశాన్ని కాంగ్రెస్ ప్రధానంగా వాడుకునే ఛాన్స్ ఉంది. రైతు రుణమాఫీతో వైఎస్‌ఆర్ రెండు తెలుగు రాష్ట్రాల రైతుల గుండేల్లో నిలిచిపోయారు. అయితే ఇదే రుణమాఫీ అంశంపై కాంగ్రెస్ కీలక హామీ ఇచ్చే అవకాశం ఉంది.

ఓ వైపు బీజేపీ పథకాల గాలం..

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతుకున్న కాషాయ నేతలు అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామంటున్నారు. 2లక్షల ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని బీజేపీ అంటోంది. రాష్ట్రంలోని బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా, విదేశాల్లో చదివే బీసీ విద్యార్థులకు స్టాచురేషన్ పద్ధతిలో ఆర్థిక సాయం చేస్తామంటోంది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు న్యాయం చేస్తామని చెబుతోంది. బీసీ డిక్లరేషన్‌ను బీజేపీ ఇటీవల ప్రకటించింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయిస్తామని కాషాయం పార్టీ అంటోంది. పంట నష్ట పరిహారానికి ఫసల్ భీమా పథకం అమలు చేస్తామని బీజేపీ హామీ ఇస్తోంది. ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలో అమలు చేస్తామని చెబుతోంది. కేంద్రం నిధులను తెలంగాణ సర్కారు దారి మళ్లిస్తొందని డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పడితే అభివృద్ధి వేగం పుంజుకుంటుందని బీజేపీ బహిరంగ సభల్లో చెబుతూ వస్తోంది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల హామీలపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఈ దఫాలో కేసీఆర్ సర్కారును ఎలాగైనా గద్దె దించాలని కాంగ్రెస్, బీజేపీలు ఫిక్ష్ అయ్యాయి. అందుకు అనుగుణంగానే హామీల అమలు విషయంలో ఉన్న సాధ్యాసాధ్యలను పరిశీలిస్తున్నాయి. పొలిటికల్ ఎనలిస్ట్ లతో ఇప్పటికే ఆయా పార్టీలు కసరత్తులు ప్రారంభించారు. అయితే సీఎం కేసీఆర్ కు మాత్రం ఇచ్చిన హామీలకు నిధుల కేటాయింపు సవాల్ గా మారింది. దళిత బంధు, రైతు రుణమాఫీ వంటి పథకాలు అటకెక్కాయి. మరి రానున్న ఎన్నికల్లో గులాబీ బాస్ ను నిలవరించేందుకు కాంగ్రెస్, బీజేపీ వేస్తున్న వ్యూహాలు ఏ మేరకు సఫలం అవుతాయన్నది చూడాల్సి ఉంది.

Advertisement

Next Story