స్మార్ట్ కార్డు దందా.. ఆర్టీఏలో యథేచ్ఛగా తతంగం

by Anjali |
స్మార్ట్ కార్డు దందా.. ఆర్టీఏలో యథేచ్ఛగా తతంగం
X

దిశ, తెలంగాణ బ్యూరో: వాహనదారులకు ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించిన స్మార్ట్ కార్డులను అందజేసేందుకు రాష్ట్రంలోని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్పీడ్ పోస్టు ద్వారా వినియోగదారుల ఇంటికే నేరుగా పంపాల్సిన డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలను ఏజెంట్లకు అప్పగిస్తున్నట్లు సమాచారం. ఒక్కో కార్డుపై రూ.200 నుంచి రూ.300 వరకు కొన్ని కార్యాలయాల్లో విక్రయిస్తున్నట్లు తెలిసింది.

డీబీఏ, క్లర్కులది కీలక పాత్ర?

వాహనాల ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చిన వారికి టెస్టు పూర్తయిన తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్ అవుతుంది. సంబంధిత వాహనం గానీ, డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చిన వారి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు అవుతాయి. వారికి వారం పది రోజుల్లోనే స్మార్ట్ కార్డు ఇంటికి రావాల్సి ఉంటుంది. అంతేకాదు ఆ కార్డును కంప్యూటర్ ఆపరేటర్ ప్రింట్ చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడే అసలు కథ స్టార్ట్ అవుతుంది. డీబీఏ (డేటాబేస్ అసిస్టెంట్), క్లర్కు ఇద్దరూ కలిసి స్మార్ట్ కార్డు దందాలో కీలక భూమిక పోషిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరు ప్రైవేటు ఏజెన్సీలతో అవుట్ సోర్సింగ్ పరిధిలో పనిచేస్తుండటం, ఏజెంట్లతో వీరు కుమ్మక్కు అవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోస్టు ద్వారా కార్డులను పంపిణీ చేయాల్సి ఉన్నా రికార్డుల్లో మాత్రమే నమోదు చేసి ఏజెంట్ల ద్వారా అమ్మకాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కార్డుకు రూ.300 వరకు తీసుకొని ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

చార్జీలు చెల్లించినా తప్పని తిప్పలు

వాహనదారుడు వాహన ఆర్సీ, లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ద్విచక్రవాహనానికి అయితే పోస్టల్ చార్జీ రూ.35, స్మార్ట్ కార్డు ఫీజు 200, సర్వీసు చార్జీ 200 చెల్లిస్తున్నాడు. అయినా స్పీడ్ పోస్టు ద్వారా కార్డులు సకాలంలో వాహనదారుడికి చేరడం లేదు. కొన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో స్పీడ్ పోస్టు బిల్లులను సకాలంలో చెల్లించడంలేదని తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజూ 5వేలకు పైగా కార్డులు ప్రింటింగ్ అవుతున్నట్లు సమాచారం. దీనికి తోడు వాహనాల విక్రయ, విక్రయాలతో ఒకరి నుంచి మరొకరికి వందల సంఖ్యలో బదిలీ అవుతుంటాయి. రెన్యువల్ కోసం వచ్చే వాటి సంఖ్య వందల్లో ఉంటోంది. దీంతో వేలల్లో కార్డులు పెండింగ్‌లో ఉంటున్నట్లు సమాచారం. కార్డులు అందని వారు డూప్లికేట్ కోసం మళ్లీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతో పెనుభారంగా మారుతోంది. ఎఫ్ఐఆర్ కాపీ, ఫైనాన్స్ తీసుకుంటే దాని క్లియరెన్స్ తదితర తెచ్చుకోవాలంటే వేలల్లో అదనపు భారం పడుతోంది.

సెంట్రలైజ్డ్ కార్డు ప్రింటింగ్ లేకపోవడం

ఆర్సీ, లైసెన్స్ కార్డుల ప్రింటింగ్ సెంట్రలైజ్డ్ లేదు. ఆధార్, పాన్ కార్డు తదితర కార్డుల కోసం కేంద్రప్రభుత్వం సెంట్రలైజ్డ్ ప్రింటింగ్ ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న నెంబర్ అప్‌లోడ్ చేస్తే వెంటనే కార్డును ప్రింటింగ్ తీసుకోవచ్చు. కానీ ఆర్టీఏలో ఆ విధానం లేకపోవడంతో కొంతమంది సిబ్బందికి వరంగా మారింది. అయితే కార్డులు పెండింగ్‌లో ఉన్నాయా లేదా అనేది పోలీస్ విజిలెన్స్ తనిఖీ చేస్తే రికార్డులు స్పష్టం చేస్తాయనేది ఓ ద్వితీయశ్రేణి అధికారి తెలిపారు. మరోవైపు ఏజెంట్ డబ్బాల్లో సైతం తనిఖీ చేస్తే ఆర్టీఏలో ఏం జరుగుతుందనేది స్పష్టం అవుతుంది. మండలానికి ఒక ఎంవీఐని ఇన్‌చార్జిగా నియమిస్తే కార్డుల పెండింగ్ సమస్య ఉత్పన్నం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కార్డుల పెండింగ్ అవాస్తవం

డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ కార్డులు ఎప్పటికప్పుడు పంపిణీ చేసి పెండింగ్‌లో లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి రోజూ ఎన్ని కార్డులు ప్రింట్ అవుతున్నాయి, ఎన్ని స్పీడ్ పోస్టు ద్వారా పంపిణీ జరుగుతున్నాయని రికార్డులు మెయింటెన్స్ చేస్తున్నాం. కార్డుల పెండింగ్ అనేది అవాస్తవం. సిబ్బంది ఎవరైనా ఏజెంట్లతో కుమ్మక్కు అయినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటాం.

Advertisement

Next Story

Most Viewed