- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దర్జాగా కబ్జా.. ఆర్మూర్‌లో రూ.కోట్ల విలువైన స్థలానికి ఎసరు..
దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో గల కోటార్‌మూర్ ఏరియాలోని 63వ నంబర్ జాతీయ రహదారికి అనుకుని రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ నిజాంసాగర్ కాలువ స్థలాన్ని కొందరు రియల్ వ్యాపారులు కబ్జా చేశారు. ఈ స్థలం ఇరిగేషన్ శాఖకు చెందిన స్థలమని రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారుల జాయింట్ సర్వేలో అధికారులు గతంలో ధ్రువీకరించారు. అప్పటి జిల్లా కలెక్టర్‌కు నివేదిక సైతం ఇచ్చారు. సర్వే జరిగి రెండేళ్లు గడిచినా అధికారులు నిజాంసాగర్ ఇరిగేషన్ కెనాల్ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇప్పటి వరకు ఎలాంటి సమీక్షలు చేయలేదు. గతంలో ప్రభుత్వ స్థలాన్ని కాపాడేందుకు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేసి నిజాం సాగర్ కెనాల్ ప్రభుత్వ స్థలంగా గుర్తించి హద్దులు పాతారు. ఈ రెండు శాఖల ప్రభుత్వాధికారులు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి హద్దులు పాతినా స్వాధీనం చేసుకోకుండా అలాగే వదిలి వేయడంతో రూ.కోట్ల విలువైన స్థలం రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబంధ హస్తాల్లోనే ఉంది.
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోటార్మూర్‌లోని 63వ నంబర్ జాతీయ రహదారి పక్కన నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ నంబర్ 82/2/1/2 కాలువ స్థలం గ్రామ రెవెన్యూ ప్రకారం ఉండగా, చాలా ఏళ్లుగా నిజాంసాగర్ కాలువ ఆనవాళ్లు సైతం కనబడకుండా రియాల్టర్లు వెంచర్ వేసి అమాయకులైన పేద ప్రజలకు అమ్ముకుని రూ.కోట్లు గడించారు. చాలా ఏళ్లుగా నిజాంసాగర్ చివరి ఆయకట్టుకు సాగర్ నీరు రాకపోవడంతో కాలువ స్థలాన్ని దర్జాగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వారి లే ఔట్లలో కలుపుకుని దర్జాగా అమ్ముకుంటూ రూ.కోట్లకు పడగలెత్తారు. కోటార్‌మూర్‌లో 63వ నంబర్ జాతీయ రహదారి పక్కన అర కిలోమీటర్‌కు పైగా నిజాంసాగర్ నీటిపారుదల శాఖకు చెందిన రూ.కోట్ల విలువగల ప్రభుత్వ కెనాల్ స్థలాన్ని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్నేసి కబ్జా చేసి లే అవుట్లలో కలుపుకుని అమ్మకాలు జరుపుతున్నారు. అధికారులను మామూళ్ల మత్తులో ఉంచి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మున్సిపల్ అనుమతి లేకుండా గతంలో అక్రమ నిర్మాణాలు చేపట్టడానికి యత్నించారు. ఈ విషయం పత్రికల్లో రావడంతో అప్పటి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి స్పందించి అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా పర్యవేక్షణలో సర్వేకు ఆదేశించారు. అప్పటి సర్వే ల్యాండ్ అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా పర్యవేక్షణలో నీటిపారుదల, రెవెన్యూ, మున్సిపల్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సర్వే చేశారు. నిజాం కాలం నాటి డాక్యుమెంట్లను వెలికి తీసి అధికారులు సర్వే చేసి జాతీయ రహదారికి అనుకొని ఉన్న డిస్ట్రిబ్యూటరీ 82/2/1/2కు చెందిన స్థలం నిజాంసాగర్ కాల్వ స్థలమని నిర్ధారించారు. ఈ నివేదికను అధికారులు నాడు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి నివేదిక రూపంలో అందజేశారు.
కంచెను ధ్వంసం చేసిన రియల్టర్లు..
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోటార్మూర్‌లో 63వ నంబర్ జాతీయ రహదారి పక్కన గల రూ.కోట్ల విలువైన ప్రభుత్వ నిజాంసాగర్ కాలువ స్థలాన్ని ఇరిగేషన్, రెవెన్యూ శాఖలో జాయింట్ సర్వే ద్వారా అప్పటి కలెక్టర్ నారాయణరెడ్డి గుర్తించారు. అప్పటి ఆర్డీఓ శ్రీనివాసులు, నీటిపారుదలశాఖ డీఈ కృష్ణమూర్తి, ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించి నీటిపారుదల శాఖ స్థలం కబ్జా కాకుండా ఉండేందుకు అప్పటి కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఈ స్థలం కబ్జాకు గురి కాకుండా ప్రభుత్వ కెనాల్ స్థలానికి రెండువైపులా ఇనుప కంచెను వేయించారు. ఇనుప చువ్వలతో కంచె ఏర్పాటు కోసం అప్పటి కలెక్టర్ రూ.5 లక్షలు మంజూరు చేసి ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు పర్యవేక్షణలో కాంట్రాక్టర్‌తో కాలువ స్థలం చుట్టూ కంచెను ఏర్పాటు చేయించారు. ఆ ఏరియాలో ప్రభుత్వ నిజాం సాగర్ కెనాల్ స్థలాన్ని కబ్జా చేసిన బోగడ మీది బాజన్న అనే రియాల్టర్ ఇనుప చువ్వల కంచెను జేసీబీ సహాయంతో ధ్వంసం చేసి వాటిని ఎత్తుకెళ్లారు. అప్పట్లో కంచెను ధ్వంసం చేసిన ఆ రియాల్టర్ పై నీటిపారుదల శాఖ అధికారులు ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసునమోదు చేశారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన ఆ రియల్టర్ ఇనుప కంచెను ధ్వంసం చేసిన తర్వాత అధికారులు తిరిగి ఆ ప్రభుత్వ స్థలాన్ని రక్షించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం విడ్డూరం. ఆ ఏరియాలోని రియల్ ఎస్టేట్ లో వ్యాపారులు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తూ కోర్టు మెట్లు ఎక్కి అధికారులకు నోటీసులను అందించి దర్జాగా ప్రభుత్వ స్థలంలో వ్యాపారాలు చేస్తున్నారు.
అధికారులు నోటీసులను సాకుగా చూపి చర్యలు తీసుకునేందుకు జంకుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆర్మూర్ మున్సిపల్ అనుమతి తీసుకోకుండా దర్జాగా విద్యుత్ కలెక్షన్లు తీసుకుంటూ అక్రమ పద్ధతిలో షెడ్ల నిర్మాణాలు చేస్తున్నారు. ఒక కులానికి సంబంధించిన విగ్రహాలను ఈ ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన రియల్ వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్లను నిర్మాణాలు చేసి ఆ విగ్రహాల తయారీదారులకు లీజుకు ఇచ్చి డబ్బులు దండుకుంటున్నారు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మతపరమైన విగ్రహాలను ఈ ఇల్లీగల్ స్థలాల్లో తయారు చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరో కొత్త పన్నాగానికి కుట్ర లేపారు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారుల పన్నాగాలు తెలిసిన రెవెన్యూ, నీటిపారుదల, మున్సిపల్ శాఖల అధికారులు చర్యలు తీసుకోవడంలో మీనమేషాలను లెక్కిస్తున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చొరవ తీసుకొని ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ పర్యవేక్షణలో రూ.కోట్ల విలువ గల నిజాంసాగర్ కాలువ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
హైడ్రా రావాలి...
హైదరాబాద్ తరహాలో హైడ్రా వ్యవస్థ ఆర్మూర్ ప్రాంతంలో కూడా ప్రభుత్వ కెనాల్, చెరువుల పై అధికారులు దృష్టి పెట్టి రూ.కోట్ల విలువ గల ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోటార్‌మూర్ లో జాతీయ రహదారి పక్కన రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొట్టాల గంగాధర్, గుండు సాయన్న, బొగడ మీది బాజన్న కబ్జా చేసిన రూ.కోట్ల విలువైన నిజాంసాగర్ ప్రభుత్వ స్థలాన్ని రక్షించి ప్రజా అవసరాల కోసం ఉపయోగించాలని ఆర్మూర్ మున్సిపల్ ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ కెనాల్ స్థలాన్ని కబ్జా చేసిన ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి నిజాం సాగర్ కెనాల్ ప్రభుత్వ స్థలాన్ని మూడు శాఖల ప్రభుత్వాధికారులు ఏ తీరుగా రక్షిస్తారోనని ఆర్మూర్ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.