Navneet Rana: బీజేపీ మాజీ ఎంపీ నవనీత్ రాణాపై దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం

by vinod kumar |
Navneet Rana: బీజేపీ మాజీ ఎంపీ నవనీత్ రాణాపై దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని అమరావతి(Amaravathi)లో బీజేపీ నేత, మాజీ ఎంపీ నవనీత్ రాణా(Navneet rana) నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. యువ స్వాభిమాన్ పార్టీ అభ్యర్థి రమేష్ బండిలే(Ramesh bandile)కు మద్దతుగా నవనీత్ రాణా దర్యాపూర్ అసెంబ్లీ నియోజక వర్గంలోని ఖల్లార్ గ్రామంలో బహిరంగ సభ నిర్వహించారు. సభ జరుగుతుండగానే ఇరు వర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. అయితే కొద్ది సేపటికే కొంత మంది నవీనీత్ రాణా వైపుగా కుర్చీలు విసిరారు. పలు కుర్చీలు ఆమెకు దగ్గర్లోనే పడటంతో ఆందోళన నెలకొంది. దీంతో ఆమె మద్దతు దారులు తనకు రక్షణగా నిలబడ్డారు. తీవ్ర గందగోళం నెలకొనడంతో ఈ ఘర్షణ నుంచి తప్పించుకున్న నవీనత్ రాణా నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఘటనపై ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రాణాపై దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే శాంతి యుతంగా ప్రచారం చేస్తున్న తమపై కొందరు దుండగులు దాడి చేశారని, ఆ టైంలో అల్లా హు అక్బర్ నినాదాలు చేశారని నవనీత్ రాణా ఆరోపించారు. అంతేగాక తనను అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. ఘటనలో పలువురు పార్టీ కార్యకర్తలకు గాయాలైనట్టు వెల్లడించారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఉండటంతో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. పుకార్లు వ్యాప్తి చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా, గత నెలలోనూ నవీనత్ రాణాలు బెదిరింపులు ఎదురయ్యాయి. రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిందితులు ఓ లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే మరోసారి దాడి జరగడం గమనార్హం.

Advertisement

Next Story