సవాళ్లను స్వీకరించలేని ప్రశాంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి

by Sridhar Babu |
సవాళ్లను స్వీకరించలేని ప్రశాంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి
X

దిశ, ఆర్మూర్ : కర్ణాటకలో పథకాలు అమలు కావట్లేదని బాల్కొండ నియోజకవర్గంలో తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రశాంత్ రెడ్డి కర్ణాటక ఎమ్మెల్యే ఇక్కడ బాల్కొండకు వచ్చి సవాలు విసిరితే దానిని స్వీకరించలేక పారిపోయాడని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ప్రశాంత్ రెడ్డి కి దమ్ము ఉంటే కర్ణాటక వెళ్లి అక్కడ కాంగ్రెస్ గ్యారంటీలు అమలు అవుతున్నాయో లేదో తెలుసుకోవాలని సూచించారు. బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండలం ఇత్వార్ పేట్ , జలాల్ పూర్, నాగాపూర్ గ్రామాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ శుక్రవారం ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఐదు పథకాలను అమలు చేస్తుందని డిసెంబర్ 3న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో గెలుస్తుందని,

తరువాత 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ, మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని, రైతు భరోసా ద్వారా ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు ఎకరానికి 15 వేల పెట్టుబడి సాయం, రైతు కూలీలకు 12000 సాయం ప్రతి సంవత్సరం అందిస్తామని తెలిపారు. పసుపు పంటకు 12,000 మద్దతు ధర, వరి పంటకు క్వింటాలుకు 500 బోనస్, ప్రతి పంటకు మద్దతు ధరలు కల్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆడ పిల్లలకు 500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళా ఖాతాలో ప్రతినెలా 2500 రూపాయలు జమ చేస్తామన్నారు. చేయూత పథకం ద్వారా వృద్ధాప్య పింఛను 4000, వికలాంగ పింఛను 6000 అందిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రశాంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed