కమ్యూనికేషన్ రంగంలో భారత్ కీలక భాగస్వామి : ప్రధాని మోడీ

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-15 07:55:39.0  )
కమ్యూనికేషన్ రంగంలో భారత్ కీలక భాగస్వామి : ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ కమ్యూనికేషన్ రంగంలో భారత్ కీలక భాగస్వామిగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో మంగళవారం ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ (ITU-WTSA) 8వ ఎడిషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారతదేశం, ఆసియా-పసిఫిక్ ప్రాంతం ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను నిర్వహించడం ఇదే మొదటిసారి. అసెంబ్లీకి సంబంధించిన డిజిటల్ ఫలకాన్ని ఆవిష్కరించిన తర్వాత, కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి మోదీ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోడీ మొబైల్ తయారీలో భారతదేశం సాధించిన గణనీయమైన పురోగతిని వివరించారు. దేశంలో ఇప్పుడు 200 స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. "2014లో కేవలం రెండు మొబైల్ తయారీ యూనిట్లు మాత్రమే ఉండేవని, నేడు 200కు పైగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇంతకుముందు విదేశాల నుంచి స్మార్ట్‌ఫోన్‌లను దిగుమతి చేసుకునేవాళ్లమని, ఇప్పుడు భారత్‌లో ఆరు రెట్లు ఎక్కువ మొబైల్ ఫోన్‌లను తయారుచేస్తున్నామని ప్రధాని చెప్పారు. చిప్ నుంచి ఉత్పత్తి వరకు 'మేడ్-ఇన్-ఇండియా' స్మార్ట్‌ఫోన్‌లను ఉత్పత్తి చేయడానికి దేశం అంకితాభావంతో ముందుకెలుతుందన్నారు. సెమీకండక్టర్ రంగంలో భారతదేశం భారీ లక్ష్యాలను నిర్ధేశించుకుందని తెలిపారు.

చిప్‌ల నుంచి తుది ఉత్పత్తి వరకు, మేము ప్రపంచానికి మేడ్-ఇన్-ఇండియా ఫోన్‌ను అందించాలని చూస్తున్నామని, మేము సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌లో కూడా పెట్టుబడులు పెడుతున్నామని ప్రధాని మోడీ వెల్లడించారు. భారతదేశం యొక్క డిజిటల్ పురోగతిలో ఒక దశాబ్దం క్రితం తాను ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా నాలుగు స్తంభాల ప్రభావాన్ని గుర్తు చేశారు. సరసమైన పరికరాలు, సమగ్ర డిజిటల్ కనెక్టివిటీ, యాక్సెస్ చేయగల డేటా, 'డిజిటల్-ఫస్ట్' మైండ్‌సెట్ అంశాల పాత్రను వివరించారు. టెలికాం రంగం భారతదేశంలో ఈక్విటీ అవకాశాలను ఎలా నడిపిస్తుందో, కేవలం కనెక్టివిటీకి మించి ఎలా ఉందో ఆయన నొక్కి చెప్పారు. సెబర్ సెక్యురిటీకి సంబంధించి పరస్పర సహకారంతో ముందుకెళ్ళాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞాన వినియోగం విషయంలో నియమ, నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

భారతదేశంలో 120 కోట్ల మొబైల్​, 95 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారని, ప్రపంచంలోనే 40 శాతానికి పైగా డిజిటల్ లావాదేవీలు భారతదేశంలో జరుగుతున్నాయన్నారు. డిజిటల్ పబ్లిక్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను విజయంవంతంగా నిర్మించడంలో భారతదేశం తన అనుభవాన్ని ఇతర దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. కేవలం పదేళ్లలోనే ఏర్పాటు చేసిన ఆప్టికల్ ఫైబర్-​ భూమి, చంద్రుని మధ్య దూరం కంటే ఎనిమిది రెట్లు ఎక్కువన్నారు. రెండు సంవత్సరాల క్రితం మొబైల్​ కాంగ్రెస్​లోనే 5జీ సేవలను ప్రారంభించామని, దేశంలోని ప్రతి జిల్లాను 5జీ సేవలతో అనుసంధానం చేశామని, ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5జీ మార్కెట్​గా భారతదేశం అవతరించిందని, ప్రస్తుతం 6జీ టెక్నాలజీ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నామని మోడీ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed