గురుకులాల ప్రైవేటు భవనాలకు అద్దె చెల్లించడం లేదని తాళం..

by Sumithra |
గురుకులాల ప్రైవేటు భవనాలకు అద్దె చెల్లించడం లేదని తాళం..
X

దిశ, హుజూర్ నగర్ : గత ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్యనందించాలనే ఉద్దేశంతో బీసీ, ముస్లిం మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, ఎంజేపీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. గురుకుల పాఠశాల ఏర్పాటుకు సొంత భవనాలు లేకపోవడంతో అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 అద్దె భవనాలను తీసుకుని అందులోనే పాఠశాలను కొనసాగిస్తున్నారు. కానీ 13 నెలలుగా అద్దెకు తీసుకున్న భవనాలకు కిరాయి ఇవ్వడం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గురుకుల విద్యాలయ ప్రైవేట్ భవన యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భవన యజమానులు పాఠశాలకు తాళం వేస్తున్నారు. అదే క్రమంలో ఫ్లెక్సీ పెట్టి ప్రిన్సిపల్ కి వినతి పత్రం అందించి తమ బాధలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాల భవన యజమాని కూడా మెయిన్ గేట్ కి తాళం వేసి ఫ్లెక్సీ పెట్టి నిరసన వ్యక్తం చేశారు.

గేటుకు ఫ్లెక్సీ ఏర్పాటు.. ఫ్లెక్సీ లో ఏముందంటే..

గౌరవ పోషకులకు, విద్యార్థులకు, రాష్ట్ర ప్రజలకు తెలియజేయునది..

మార్చి నెల నుండి గురుకుల భవనాలకు నెలవారీ అద్దె చెల్లించినందున 30 నెలలకు పైగా ఉన్న బకాయిల విషయంలో అనేక సార్లు కమిషనర్ స్థాయిలో వినతి పత్రాలు ఇచ్చాం. అయినా ఏ విధమైన స్పందన లేనందున ఇప్పటికే ఇచ్చిన నోటీసులు ఆధారంగా నేడు 15-10-2024 మా భవనాలకు తాళాలు వేసుకుంటున్నాం. బకాయిలు చెల్లించిన పిదప తిరిగి తాళం తీస్తామని, అసౌకర్యానికి చింతిస్తూ మా బాధను అర్థం చేసుకోవాల్సిందిగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇట్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గురుకుల విద్యాలయ ప్రైవేట్ భవన యాజమాన్య సంఘం.. అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

దసరా సెలవులు తర్వాత స్కూల్ నేటి నుండే ప్రారంభం..

దసరా సందర్భంగా స్కూల్లో చదివే విద్యార్థులకు ఈ నెల ఒకటో తారీకు నుండి ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో విద్యార్థులంతా తమ ఇండ్లకు వెళ్లారు. తిరిగి ఈ రోజు నుండి పాఠశాల మళ్లీ రీ ఓపెనింగ్ కానుంది. ప్రస్తుతం విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో భవనానికి తాళం వేశారు. పాఠశాల ఈ రోజు నుండి రీఓపెనింగ్ కావడంతో పాఠశాలకు వచ్చిన టీచర్లు గేటుకు తాళం వేసి ఉండడం చూసి గేటు ముందు ఉన్న చెట్ల కింద నిలబడాల్సి వచ్చింది.

గేటుకు తాళం వేసి ప్రిన్సిపాల్ వినతి పత్రం అందించిన యజమాని మధు..

భవన యజమాని మధు మాట్లాడుతూ సెప్టెంబర్ 21న హైదరాబాదులోని మాసబ్ ట్యాంకులో గల గురుకుల భవనాల సంక్షేమ ఆఫీసుకు గురుకుల విద్యాలయాల ప్రైవేట్ భవన యాజమాన్య సంఘం నాయకులతో కలిసి బీసీ, ముస్లిం మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, ఎంజేపీ స్కూల్ కు సంబంధించిన కార్యదర్శులను కలిసి తమకు రావాల్సిన కిరాయిలను చెల్లించాలని వినతి పత్రం అందించినట్లు తెలిపారు. 13 నెలలుగా కిరాయి రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విన్నవించుకున్నామని అన్నారు. బిల్డింగులకు మేము బ్యాంకు లోన్ తీసుకుని నిర్మించామని ఇప్పుడు నెల నెల కట్టే ఈఎంఐ కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.

అందరినీ కలిసి తమ బాధను తెలిపినా ఎలాంటి స్పందన రాలేదన్నారు. మా సమస్య సీఎం దృష్టికి వెళ్లాలని మా సంఘం ఆధ్వర్యంలో మా సంఘం అధ్యక్షులు దేవి రెడ్డి హైదరాబాదులోని సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తమ బాధను వ్యక్తం చేసి సీఎం దృష్టికి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేశామన్నారు. అయినా ప్రయోజనం లేదన్నారు. అక్టోబర్ 14 లోపు కిరాయి చెల్లించకుంటే తమ భవనాలకు తాళాలు వేద్దామని నిర్ణయించుకున్నారు. అందుకే ఈ రోజు మా సంఘం నిర్ణయించిన విధంగా గేటుకు తాళం వేసి ప్రిన్సిపల్ రెహనా బేగంకు వినతి పత్రం అందించి తమ భవనాలకు అద్దె చెల్లించాలని అందుకే తాళం వేసినట్లు వివరించినట్టు తెలిపారు.

Next Story