పర్యావరణ ప్రేమికులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక పిలుపు

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-15 10:15:38.0  )
పర్యావరణ ప్రేమికులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: పర్యావరణ ప్రేమికుల(environment lovers)కు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక సూచనలు చేశారు. దేశం, దేశ ప్రజలు సురక్షితంగా ఉంటేనే పర్యావరణ రక్షణ గురించి ఆలోచించగలుగుతాని అన్నారు. దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్ట్‌ను వివాదాస్పదం చేయడం సమంజసం కాదని అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా పూడూర్‌లో భారత నౌకాదళానికి సంబంధించిన ‘వెరీ లో ఫ్రీక్వెన్సీ’ (వీఎల్‌ఎఫ్‌) కమ్యూనికేషన్‌ ట్రాన్స్‌మిషన్‌ స్టేషన్‌ రాడార్‌ కేంద్రానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాల గురించి ఆలోచించాలని అన్నారు. దేశ రక్షణ విషయంలో అందరూ కలిసికట్టుగా ముందుకెళ్లాలని చెప్పారు. దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక అడుగు ముందుకు వేయబోతోందని అన్నారు.

దేశ రక్షణకు సంబంధించి కీలకమైన డిఫెన్స్, ఎన్ఎఫ్‌సీ లాంటి కేంద్రాలకు హైదరాబాద్ గుర్తింపు పొందిందని తెలిపారు. కొందరు వీఎల్ఎఫ్‌ను వివాదం చేసే ప్రయత్నం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. వీఎల్ఎఫ్‌తో ప్రజలకు అన్యాయం జరుగుతుందని అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడులోనూ 1990లో ఇలాంటిదే ప్రారంభించారు. అక్కడి ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు. దేశంలో రెండో వీఎల్ఎఫ్ మన ప్రాంతంలో రావడం గర్వకారణమని అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను తెలంగాణ సమాజం గుర్తించాలని కోరారు. వివాదాలకు తెరలేపుతున్నవారు దేశ రక్షణ గురించి ఆలోచన చేయాలని రిక్వెస్ట్ చేశారు.

‘ప్రాజెక్టును ప్రారంభించాలని రాజ్‌నాథ్ సింగ్ అడగగానే మేం కొనసాగించాం. దేశ రక్షణ విషయంలో రాజీ పడొద్దనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించాం. వీఎల్ఎఫ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుంది’ అని సీఎం రేవంత్ అన్నారు. ‘ఇక్కడ ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చేవారిని అనుమతించాలని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆలయానికి ఇబ్బందులు కలిగించొద్దని కోరుతున్నా.. ప్రజల సెంటిమెంట్, విశ్వాసాన్ని గౌరవించి ఆలయానికి వెళ్లేందుకు దారి ఇవ్వాలని కోరుతున్నా.. ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే విద్యా సంస్థల్లో ఈ ప్రాంత ప్రజలకు 1/3వ వంతు సీట్లు కేటాయించాలని కోరుతున్నా’ అని కీలక డిమాండ్లను రాజ్‌నాథ్ సింగ్ ఎదుట సీఎం రేవంత్ రెడ్డి పెట్టారు.

Next Story