- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ విజయాలను చాటి చెప్పేందుకే ఉత్సవాలు
దిశ, మంథని : రాష్ట్రంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం గత సంవత్సర కాలంలో సాధించిన విజయాలను చాటి చెప్పే దిశగా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మంత్రి శ్రీధర్ బాబు మంథని శివ కిరణ్ గార్డెన్స్ లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమం ప్రారంభానికి ముందు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమం, విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ష్యూలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత సంవత్సరం డిసెంబర్ 7న ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటలలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని అన్నారు. గడిచిన సంవత్సర కాలంలో మహిళలు రూపాయి ఖర్చు పెట్టకుండా బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తున్నందుకు విజయోత్సవాలు జరుపుతున్నామని తెలిపారు.
పేదలకు ఇచ్చిన మాట ప్రకారం 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా, ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు కార్పొరేట్ ఆసుపత్రులో ఉచిత వైద్యం వంటి పథకాలను అమలు చేస్తున్నందుకు విజయోత్సవాలు జరుపుతున్నామని తెలిపారు. గత పది సంవత్సరాల్లో ఉద్యోగాలు లేక చాలా కష్టాలు పడ్డ నిరుద్యోగ యువతకు 10 నెలల కాలంలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ విద్యార్థులు ఒకే చోట చదువుకునే విధంగా అడవి సోమనపల్లి ప్రాంతంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా సమీకృత గురుకులం నిర్మాణ పనులు చేపట్టామని మంత్రి గుర్తు చేశారు. రూ.రెండు లక్షల వరకు రుణాలు ఉన్న 22 లక్షల రైతులకు రూ.18 వేల కోట్ల రుణ మాఫీ పూర్తి చేశామని, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ అందిస్తున్నామని, పెద్దపల్లి జిల్లాలో బోనస్ కింద ఇప్పటివరకు రూ.20 కోట్లకు పైగా నిధులు రైతుల ఖాతాలలో జమ చేశామని అన్నారు. గతంలో తరుగు పేరిట రైతులు పడిన బాధను శాశ్వతంగా పరిష్కరిస్తూ మద్దతు ధరపై ఎటువంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు 17 వేల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రూ.236 కోట్లు వారి ఖాతాలలో జమ చేశామని అన్నారు.
గత ప్రభుత్వం మాదిరిగా గుట్టలకు, రోడ్లకు కాకుండా అసలైన రైతులకు, కౌలు రైతులకు లబ్ధి చేకూర్చేలా త్వరలో రైతు భరోసా పథకం అమలు చేస్తామని మంత్రి తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంథనిలో స్పష్టమైన మార్పు కనిపించే విధంగా రాబోయే నాలుగు సంవత్సరాలు పని చేస్తానని పేర్కొన్నారు. వాణిజ్య వ్యాపారాలు విస్తరించే విధంగా మంథని మంచిర్యాలను కలుపుతూ గోదావరి నది పై బ్రిడ్జి నిర్మాణానికి రూ.120 కోట్లు మంజూరు చేసామని, త్వరలోనే శంకుస్థాపన చేస్తామని అన్నారు. మంథని పట్టణానికి బైపాస్ రోడ్డు, 13 వార్డులలో సిమెంట్ రోడ్డులు డ్రైనేజీ మొదలైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. మంథని పట్టణంలో 40 మంది యువకులకు ఉపాధి కల్పిస్తూ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించామని, భవిష్యత్లో మరిన్ని కంపెనీలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. రామగిరి క్షేత్రాన్ని రూ.5 కోట్లతో అభివృద్ధి చేస్తామని, మంథని పట్టణం సమీపంలో గల గోదావరి నది పుష్కరాలు నిర్వహణకు రెండు కోట్లతో అభివృద్ధి జరుపుతున్నామని అన్నారు.
మంథని పట్టణ సమీపంలో 150 మంది మహిళ సంఘాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతూ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని, దీనికి అరమైన స్థలాలను ఎంపిక చేయాల్సిందిగా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. బహుళ జాతి కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలు యువతకు అందించే దిశగా నైపుణ్య కేంద్రాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని, వీటి ద్వారా యువకులకు మంచి శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ఇందిరమ్మ పథకం ప్రారంభమవుతుందని, మొదటి విడతలో భూమి ఉండి, ఇండ్లు లేని వారిని ఎంపిక చేసి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు. భవిష్యత్తులో అనువైన భూమిని ఎంపిక చేసి పేదలకు ఇండ్లు నేర్పిస్తామని మంత్రి తెలిపారు. మంథని పట్టణంలో అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలను నిర్మాణం చేస్తామని అన్నారు. అనంతరం అంతడుపుల నాగరాజు సారథ్యంలోని కళా బృందం ప్రదర్శించిన కార్యక్రమాలు వీక్షకులను ఆకర్షించాయి.
రూ.7 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణం
మండలంలోని ఖానాపూర్ నుంచి ఎల్ మడుగు వరకు డబుల్ రోడ్డు నిర్మిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మంథనిలో పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశామని అన్నారు.
మంథని పట్టణానికి త్వరలోనే బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తామని అన్నారు. రూ.7 కోట్లతో ఖానాపూర్ నుంచి ఎల్ మడుగు డబుల్ రోడ్డు నిర్మాణం పనులు నిర్ణీత సమయంలో జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. మండలంలోని నాగారం గ్రామంలో 20 లక్షల రూపాయలతో చేపట్టిన హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ రమాదేవి, వైస్ చైర్మన్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.