PAN Card: ఇప్పటికే పాన్‌కార్డు ఉన్నవారు పాన్ 2.0కు అప్లై చేయనవవసరం లేదు: పన్ను శాఖ

by S Gopi |   ( Updated:2024-11-26 17:59:55.0  )
PAN Card: ఇప్పటికే పాన్‌కార్డు ఉన్నవారు పాన్ 2.0కు అప్లై చేయనవవసరం లేదు: పన్ను శాఖ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం ఉన్న శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కార్డ్ హోల్డర్లు అప్‌గ్రేడ్ చేసిన పాన్ 2.0 సిస్టమ్ కింద కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, ఇది ప్రధానంగా వ్యాపార సంబంధిత కార్యకలాపాలన్నింటికీ 'కామన్ ఐడెంటిఫైయర్'ని ప్రవేశపెట్టే లక్ష్యంతో తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అని ఆదాయపు పన్ను శాఖ మంగళవారం తెలిపింది. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ పాన్ కార్డు అప్‌గ్రేడ్ కోసం రూ. 1,435 కోట్లతో పాన్ 2.0 ప్రాజెక్ట్‌ను ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రకటన తర్వాత కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలనే సందేహం చాలామందిలో కలిగింది. దీనిపై స్పష్టత ఇస్తూ ఆదాయపు పన్ను శాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. 'ఇప్పటికే ఉన్న పాన్ కార్డ్ హోల్డర్లు అప్‌గ్రేడ్ చేసిన సిస్టమ్ (పాన్ 2.0) కింద కొత్త పాన్ కోసం దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు. పాన్ హోల్డర్‌లు ఏదైనా అప్‌డేషన్/కరెక్షన్ చేయాలనుకుంటే తప్ప పాన్ కార్డ్ మార్చుకోవాల్సిన పనిలేదు. ఇప్పటికే చెల్లుబాటు అయ్యే పాన్ కార్డ్‌లు పాన్ 2.0 కింద చెల్లుబాటు అవుతాయని ' ఆదాయపు పన్ను విభాగం స్పష్టం చేసింది. అయితే, క్యూఆర్ కోడ్ లేకుండా పాత పాన్ కార్డు ఉన్నవారు అదే నంబర్‌తో క్యూఆర్ కోడ్ కలిగిన కొత్త పాన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) పేర్కొంది.

Advertisement

Next Story