ఇండో-బెల్జియన్ లైఫ్ సైన్సెస్ సదస్సు ఓ మైలురాయి: మంత్రి శ్రీధర్ బాబు

by Mahesh |
ఇండో-బెల్జియన్ లైఫ్ సైన్సెస్ సదస్సు ఓ మైలురాయి: మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీకాలు, జనరిక్ ఔషధాలు, క్యాన్సర్, ఇతర సంక్లిష్ట వ్యాధుల నివారణకు అవసమైన బయోసిమిలర్స్ ఉత్పత్తిలో ప్రపంచ గమ్యస్థానంగా తెలంగాణ వృద్ధి చెందిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో మరింత ముందడుగు వేసే దిశగా ప్రస్థానం కొనసాగుతోందన్నారు. మాదాపూర్ లోని ఓ హోటల్ లో ఇండో-బెల్జియన్ లైఫ్ సైన్సెస్ సదస్సును మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా 33 శాతం వ్యాక్సిన్లు, జనరిక్ ఔషధాలు తెలంగాణ నుంచే సరఫరా అవుతాయన్నారు.

కొత్త అవకాశాలు, అనుకూల వాతావరణంతో బెల్జియం లైఫ్ సైన్సెస్ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నామన్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, మౌలిక వసుతులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. యూరోపియన్ యూనియన్‌లో రెండో అతిపెద్ద ఔషధ ఎగుమతిదారుగా ఉన్న బెల్జియం, ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన ఆవిష్కరణలతో ముందంజలో ఉందని వెల్లడించారు. బలమైన భాగస్వామ్యంతో రెండు దేశాలు పరస్పర ప్రయోజనం పొందగలవన్న విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఈ సదస్సు ప్రపంచ ఆరోగ్య సంరక్షణ రంగంలో నూతన మైలురాళ్లను చేరుకునే ఒక సహకార వేదికగా నిలవాలని ఆకాంక్షించారు.

బెల్జియంలోని ఫ్లాండర్స్ రాష్ట్రం, తెలంగాణ లైఫ్ సైన్సెస్‌ ల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం అమలులో ఉందన్నారు. ఈ సదస్సు ఏర్పర్చిన భూమికతో ఫ్లామిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ, వాక్సినోపొలిస్, యూనివర్శిటీ ఆఫ్ గెంట్ వంటి సంస్థలతో భాగస్వామ్య అవకాశాలను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. ప్రాణరక్షక ఆవిష్కరణలను అందరికీ చౌకగా అందించడం వంటి లక్ష్యాలను పాటించే దిశలో రెండు దేశాలు ముందుకు సాగాలని కోరారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24-26 ల మధ్య హైదరాబాద్ లో 22వ బయో ఏషియా సదస్సు జరుగుతుందని ప్రముఖులంతా పాల్గొనాలని ఆహ్వానించారు. ఇండో-బెల్జియన్ లైఫ్ సైన్సెస్ కాన్ఫరెన్స్ గ్లోబల్ సహకారాన్ని పెంపొందించడంలో మైలురాయిగా నిలుస్తుందని, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ ఇన్నోవేషన్‌లకు ప్రముఖ కేంద్రంగా హైదరాబాద్ స్థితిని బలోపేతం చేస్తుందన్నారు.

‘ఇండో-బెల్జియన్ లైఫ్ సైన్సెస్ కారిడార్‌ను బలపరచడం, ఆరోగ్య భవిష్యత్తును కలిసి ఆవిష్కరించడం’ అనే అంశంపై ఉపన్యాసాలు కొనసాగాయి. ఈ సదస్సులో బెల్జియం రాయబారి డిడియర్ వాండర్హాసెల్ట్ , ద్వైపాక్షిక వ్యవహారాల డైరెక్టర్ జనరల్ జీరోన్ కూర్మన్, డాక్టర్ రెడ్డీస్ మేనేజింగ్ డైరెక్టర్ జి.వి. ప్రసాద్, బయో ఏషియా అంతర్జాతీయ సలహా మండలి ఛైర్మన్ డా. అజిత్ శెట్టి, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ఆచార్యుడు డాక్టర్ పీటర్ పియోట్, ఎం.ఎస్. స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ డా. సౌమ్య స్వామినాథన్, ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయెన్స్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్ జైన్, పలువురు శాస్త్రవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed