ఆ వర్సిటీని దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలి: మంత్రి తుమ్మల

by srinivas |
ఆ వర్సిటీని దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలి: మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి అందరూ కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. డిసెంబర్‌లో జరగనున్న విశ్వవిద్యాలయం వజ్రోత్సవ ఉత్సవాలు (డైమండ్ జూబ్లీ) ఫ్లయర్, లోగోలను సైఫాబాద్‌లో ఉన్న విశ్వవిద్యాలయం కమ్యూనిటీ సైన్స్ కళాశాలలో మంగళవారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో విశ్వవిద్యాలయం నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. చాలా ఏళ్ల తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి నియామకం జరిగిందనన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దాలని సూచించారు.

ఏడాదిగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం, రైతుల సంక్షేమానికి అనేక చర్యలు చేపడుతున్నదని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి అన్నారు. ఈ సమయంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం డైమండ్ జూబ్లీ ఉత్సవాలు జరగడం సంతోషదాయకమన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో 1964లో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారని పిజేటిఎయూ ఉపకులపతి ప్రొఫెసర్ అల్థాస్ జానయ్య అన్నారు. 1964లో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి విశ్వవిద్యాలయాన్ని, 1966లో పరిపాలన భవనాన్ని ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యూజీసి చైర్మన్, ఐసిఏఆర్ డిజీ, ఇక్రిశాట్ డిజీ ఇంకా అనేక మంది ప్రముఖులు, మాజీ ఉపకులపతులు, వ్యవసాయ మంత్రులని ఈ వేడుకలకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) చైర్మన్ శ్రీనివాసులు శెట్టి కూడా ఈ వేడుకలకు హాజరవుతారని వీసీ జానయ్య అన్నారు.

Advertisement

Next Story

Most Viewed