పూజ చేస్తుండగా మహిళ మెడలో నుంచి చైన్ స్నాచింగ్..

by Sumithra |
పూజ చేస్తుండగా మహిళ మెడలో నుంచి చైన్ స్నాచింగ్..
X

దిశ, పటాన్ చెరు : ఆదివారం తెల్లవారుజామునే పటాన్ చెరు పట్టణంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఉదయం ఇంటి ఆవరణలో తులసి చెట్టుకు పూజ చేస్తుండగా మహిళ మెడలో నుంచి పుస్తెలతాడును తెంపుకొని పరారయ్యారు. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం పటాన్ చెరు పట్టణంలోని శాంతినగర్ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ చారి తల్లి శ్రీపాద సోమ లక్ష్మి (80) ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో తన ఇంటి ఆవరణలో తులసి చెట్టుకు పూజ నిర్వహిస్తుంది. అదే సమయానికి బైక్ పై ఇద్దరు దుండగులు వచ్చి చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు.

ఇంటి ఆవరణలో మహిళా పూజ నిర్వహించడం చూసి రెక్కీ నిర్వహించిన ఇద్దరు అదును చూసి ఆమె మెడలో నుంచి పుస్తెల తాడును తెంపుకొని జంపయ్యారు. దుండగుల్లో ఒకరు హెల్మెట్ ధరించగా మరొకరు మాస్కు ధరించి బైక్ పై పరారయ్యారు. తెల్లవారుజామున దట్టంగా పొగమంచు కమ్ముకుని ఉండడంతో సులువుగా అక్కడ నుంచి పరారయ్యారు. ఈ ఘటన తెలుసుకున్న పటాన్ చెరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. చైన్ స్నాచింగ్ కు సంబంధించిన దృశ్యాలు కాలనీలోని సీసీ కెమెరాలో రికార్డు కావడంతో వాటి ఆధారంగా గొలుసు దొంగల పని పట్టేందుకు పటాన్ చెరు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Next Story