- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘దిశ’ కథనంతో కదలిక.. అయినా బరితెగిస్తున్న కబ్జాకోరులు
ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు.. ఆక్రమించే కబ్జారాయుళ్లు.. మరింత ముదిరిపోయారు. రాజకీయ అండదండలున్నాయని, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని చెబుతూ హద్దులు బాదిన భూములను సైతం ఆక్రమించుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించి ఈ భూమి తమదే అంటూ దర్పం చాటుకుంటున్నారు. ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెం పరిధిలోని సర్వే నెంబర్ 257లో ఎకరా 13గుంటల ఎన్నెస్పీ భూమిని ఇదే విధంగా అక్రమార్కులు ఆక్రమించుకున్నా.. ఎన్నెస్పీ అధికారులు చోద్యం చూస్తున్నారు.
దిశ బ్యూరో, ఖమ్మం: ఖమ్మం రూరల్ మండలం పరిధిలోని గొల్లగూడెం పంచాయతీలోని అనేక సర్వే నెంబర్లలోని కోట్లాది రూపాయల విలువ చేసే ఎకరాల కొద్ది ఎన్నెస్పీ భూమి అక్రమార్కుల పాలు అవుతోంది. ఎన్నెస్పీ భూములను పరిరక్షించి కబ్జాకోరుల నుంచి కాపాడాల్సిన ఆ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కోట్లాది రూపాయల విలువచేసే భూములు అన్యాక్రాంతమవుతున్నా అధికారులు చోద్యం చూస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము లోకాయుక్తాను ఆశ్రయిస్తామని చెబుతున్నారు.
‘దిశ’ కథనంతో..
గొల్లగూడెం పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 257లో ఎకరా 13 గుంటల విలువైన ఎన్నెస్పీభూమి ఆక్రమణకు గురైందని గతంలోనే ‘దిశ’లో కథనం ప్రచురితమైంది. దీంతో కలెక్టర్ స్పందించి స్థానిక అధికారులకు సమాచారం అందించడంతో సర్వే చేశారు. ఆక్రమణ నిజమేనని తేల్చి హద్దులు ఏర్పాటు చేశారు. ‘ఇది ఎన్నెస్పీ భూమి.. ఆక్రమించుకుంటే శిక్షార్హులు’ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన మూడు రోజుల్లోనే దానిని తొలగించి, ఈ భూమి తామదేనంటూ అక్రమార్కులు తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వెరసి అధికారులు ప్రభుత్వ భూమంటూ హద్దులు బాది, ఫ్లెక్సీ ఏర్పాటు చేసినా.. తిరిగి అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు విలువచేసే భూములు కబ్జాకోరులు ఆక్రమించుకున్నా.. అధికారులు ప్రభుత్వ భూమేనని తేల్చినా ఫెన్సింగ్ ఏర్పాటు చేయకుండా, ప్రభుత్వ భూములు కాపాడకుండా ఎన్నెస్పీ అధికారులు మిన్నకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నెస్పీ అధికారుల తీరును నిరసిస్తూ లోకాయుక్తాను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
రాజకీయ అండ ఉందంటూ..
ఎన్నెస్పీ భూములను కబ్జాచేసి విక్రయించిన కబ్జాదారులు కొత్తపుంతల్లో వింత వాదన తెరమీదకు తెస్తున్నారు. ఆక్రమించుకున్న భూములు ప్రభుత్వానికి సంబంధించినా సరే.. తమకు రాజకీయ అండ ఉందని, తమను ఎవరూ ఏమి చేయలేరనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో దిశలో కథనం రాగానే అధికారులు స్పందించి హద్దులుబాది, ఫ్లెక్సీ ఏర్పాటు చేసినా మూడు రోజుల్లోనే అక్రమార్కులు తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పత్రికల్లో కథనాలు వచ్చినా.. అధికారులు స్పందించి చర్యలు తీసుకున్నా.. భూమి మాత్రం తామదేనంటూ మొండికేశారు. రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నాయకులను సంప్రదించి భూమిని దక్కించుకునేందుకు పావులు కదిపారు. ఇదే విషయాన్ని భూమిని విక్రయించినవారు.. కొనుగోలు చేసినవారు స్పష్టం చేయడం విశేషం.
ఉన్నతాధికారులు పట్టించుకోవాలి..
గొల్లగూడెం పరిధిలోని ఎకరాల కొద్ది ఎన్నెస్పీ భూమి అక్రమార్కుల చెరలో ఉన్నా.. ఎన్నెస్పీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమార్కుల చెర నుంచి కోట్లాది రూపాయల విలువ చేసే కెనాల్ భూములు కాపాడాల్సిన అధికారులు ఏ మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా స్పందించి ఉన్నతాధికారులు పట్టించుకోవాలని, ఎన్నెస్పీ, ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడున్నాయో గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.