హర్ రోజ్ తీన్‌బార్..! శానిటేషన్ వర్కర్ల అటెండెన్స్‌పై నజర్

by Shiva Kumar |
హర్ రోజ్ తీన్‌బార్..! శానిటేషన్ వర్కర్ల అటెండెన్స్‌పై నజర్
X

దిశ, సిటీ బ్యూరో: మహా నగరవాసులు నిద్ర మేల్కొనే సరికి మెయిన్ రోడ్లన్నింటినీ క్లీన్ చేసే శానిటేషన్ వర్కర్ల అటెండెన్స్ విధానంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఇటీవలే ఫేషియల్ రికగ్నేజ్డ్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్)‌ను అమల్లోకి తీసుకొచ్చారు. అయితే, ఆ స్టిస్టమ్‌లోనూ కొందరు అవకతవకలకు పాల్పడేందుకు యత్నించినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. గత నెల 14, 15 తేదీల్లో ఫేషియల్ రికగ్నేజ్డ్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) అమల్లో స్వల్పంగా సాంకేతిక లోపాలు తలెత్తటంతో ఫేక్ అటెండెన్స్ నమోదుకు 15 మంది 80 సార్లు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. సదరు వ్యక్తులపై విచారణకు సైతం ఆదేశించినట్లు సమాచారం.

ఇంతకు ముందు అమలు చేసిన బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్‌లో తరుచూ అక్రమాలు బయట పడుతుండటం, అంబర్‌పేట, గోషామహాల్ సర్కిళ్లలో ఏకంగా నకిలీ ఫింగర్ ప్రింట్లు పట్టుబడటంతో స్వీపర్ల అటెండెన్స్‌లో పారదర్శకత కోసం అధికారులు ఈ ఫేషియల్ రికగ్నేజ్డ్ సిస్టమ్‌ను అమలు చేయటం ప్రారంభించారు. పైగా బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ మెయింటనెన్స్ కోసం సంవత్సరానికి రూ.1.92 కోట్లు ఖర్చవుతుండగా, దాన్ని తగ్గించుకోవటంతో పాటు అటెండెన్స్ మరింత పారదర్శకంగా నమోదయ్యేందుకు ఏటా కేవలం రూ. 67లక్షల మెయింటనెన్స్ వ్యయం కలిగిన ఫేషియల్ రికగ్నేజ్డ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. దీన్ని తొలుత కార్వాన్ సర్కిల్‌లో పైలట్ ప్రాజెక్టుగా పరిచయం చేసిన అధికారులు జూన్ ప్రారంభం నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చారు. ఇందులోనూ అక్రమాలకు తెర తీస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు గాను ఎఫ్ఆర్ఎస్‌లోనూ ఇప్పటి వరకు కార్మికులకు రెండు సార్లుగా ఉన్న అటెండెన్స్‌ను ఇకపై నుంచి మూడుసార్లకు పెంచారు. ఉదయం 5 నుంచి 6గంటల వరకు ఎఫ్ఆర్ఎస్‌తో డ్యూటీలోకి ఎంట్రీ, ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి 2గంటల వరకు డ్యూటీ నుంచి ఎగ్జిట్ చేయాల్సి ఉండేది. కానీ ఎఫ్ఆర్ఎస్ అమలు చేసిన నెలరోజుల్లో కొందరు ఉదయాన్నే అటెండెన్స్ వేసుకుని వెళ్లిపోయి, మళ్లీ ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య డ్యూటీ నుంచి ఎగ్జిట్ కొడుతున్నట్లు గుర్తించిన అధికారులు ఇకపై డ్యూటీలోకి ఎంట్రీ, ఎగ్జిట్ మధ్య ఉదయం 10నుంచి 10.30గంటల మధ్య మరోసారి, అదేవిధంగా తదుపరి షిఫ్టులో వచ్చే కార్మికులకు సైతం ఎంట్రీ, ఎగ్జిట్‌ల మధ్య ఫేషియల్ రికగ్నేజ్డ్ సిస్టమ్‌లో అటెండెన్స్‌ను నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. ఈ మూడు సార్లు అటెండెన్స్ విధానంతోనైనా అక్రమాలకు, అవకతవకలకు బ్రేక్ పడుతుందా.. లేదా వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed