హత్రాస్‌ ఘటనలో దోషులను విడిచిపెట్టం: ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్

by Harish |
హత్రాస్‌ ఘటనలో దోషులను విడిచిపెట్టం: ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం హత్రాస్‌‌లో భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమంలో తొక్కిసలాట కారణంగా 121 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులైన ఎవ్వరిని కూడా విడిచిపెట్టబోమని తాజాగా ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ విలేకరుల సమావేశంలో చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. త్వరలో నివేదిక వస్తుంది, దీనిలో తొక్కిసలాటకు దారితీసిన అంశాలు, దానికి గల బాధ్యులు ఎవరు తదితర అన్ని విషయాలు పూర్తిగా తెలుస్తాయి. దోషులు ఎవ్వరినీ విడిచిపెట్టబోమని, వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు.

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 118 మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించామని, ఇంకా ఐదుగురిని గుర్తించాల్సి ఉందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. పోస్టుమార్టం పూర్తయిన అనంతరం మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించాం, ప్రస్తుతం ఇరవై మంది క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమానికి 80,000 మంది వరకు హాజరయ్యేందుకు పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ దాదాపు 2.5 లక్షల మంది రావడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. బాధ్యులను వెంటనే శిక్షించాలని, ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Next Story