CM Revanth Reddy: డీలిమిటేషన్ పై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. డీఎంకే నేతల భేటీ తర్వాత కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |
CM Revanth Reddy: డీలిమిటేషన్ పై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. డీఎంకే నేతల భేటీ తర్వాత కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పగబట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ధ్వజమెత్తారు. డీలిమిటేషన్‌తో సౌత్ స్టేట్స్ కు తీవ్ర నష్టం జరుగనుందని ఆరోపించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని ఇవాళ తమిళనాడు మంత్రి కేన్ నెహ్రూ, డీఎంకే ఎంపీ కనిమొళి, డీఎంకే (DMK) నేతలు భేటీ అయ్యారు. డీలిమిటేషన్, త్రిభాషా అంశాలపై కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 22న చెన్నైలో డీఎంకే నిర్వహించ తలపెట్టిన జేఏసీ సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. జేఏసీ సమావేశానికి ఆహ్వానం అందిందని తన పార్టీ అనుమతితో ఈ మీటింగ్ కు హాజరు కానున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడం, 2029 ఎన్నికల వరకు జరగబోయే పరిణామాలను ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

కిషన్ రెడ్డి స్పందించాలి:

చెన్నై మీటింగ్ కంటే ముందే తెలంగాణ ప్రభుత్వం పరంగా కూడా రాష్ట్రంలోని అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుంటామన్నారు. బీజేపీ పార్టీ నేతలను కూడా అఖిలపక్షానికి ఆహ్వానిస్తామన్నారు. ఇది ఒక రాజకీయ పార్టీకి చెందిన సమస్య కాదని మొత్తం దక్షిణ భారతదేశానికి నష్టం జరగబోయే అంశం అన్నారు. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అందువల్ల తెలంగాణతో సహా దక్షిణ భారతదేశానికి నష్టం కలిగించే డీలిమిటేషన్ (Delimitation) పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పందించాలన్నారు. స్టాలిన్‌ (MK Stalin) తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నామన్నారు. ఈ విషయంలో స్టాలిన్ ను ప్రోత్సహిస్తామన్నారు. దక్షిణ భారత దేశం దేశ అభివృద్ధి కోసం అన్ని విధాల కృషి చేస్తున్నదని కేవలం బీజేపీని దక్షిణ భారతదేశంలోకి ప్రజలు రానివ్వడం లేదనే కక్ష్య సాధింపులకు పాల్పడుతున్నదన్నారని మండిపడ్డారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsapp channel
👉 Follow us on Share chat

Next Story