ప్రైమార్క్ అక్రమ నిర్మాణాలనై హైడ్రా నజర్​

by Sridhar Babu |
ప్రైమార్క్ అక్రమ నిర్మాణాలనై హైడ్రా నజర్​
X

దిశ, దుండిగల్ : బబ్బాఖాన్ చెరువు నాలా కబ్జాపై హైడ్రా అధికారులు ఎట్టకేలకు నడుం బిగించారు. 2023 జూన్, సెప్టెంబర్ లో కట్టుకాలువ కనుమరుగు, బడా బిల్డర్ బరితెగింపు, కట్టుకాలువ కబ్జా అంటూ దిశ దిన పత్రికలో వరుస కథనాలు వెలువడడంతో స్పందించి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అప్పటి ఇరిగేషన్ డీఈ సురేష్, ఏఈ సారా, రెవెన్యూ ఆర్ఐ భారతి పర్యటించి ప్రైమార్క్ నిర్మాణ సంస్థ బబ్బాఖాన్ చెరువు నాలాను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు తేల్చారు. సదరు నిర్మాణ సంస్థకు నోటీస్ లు జారీ చేసిన అధికారాలు చర్యలు తీసుకోవడంలో వెనకడువేయడంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.

గ్రామ నక్ష ఆధారంగా విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రైమార్క్ నిర్మాణదారుడు బబ్బాఖాన్ చెరువు నాలాపై కబ్జా చేసినట్లు గుర్తించి సమస్యను పరిష్కరించాలంటూ 2025 ఫిబ్రవరి 5న హైడ్రా అధికారులకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల ఆధారంగా గురువారం బహదూరపల్లి బబ్బాజాన్ చెరువు పరిసరాలు, ప్రైమార్క్ నిర్మాణ సంస్థ చేపట్టిన కట్టుకాలువ కబ్జాను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్​ పరిశీలించారు. ఇరిగేషన్, రెవెన్యూ, గ్రామస్తుల ద్వారా వివరాలు సేకరించిన కమిషనర్ వారంలోగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్​ మాట్లాడుతూ అధికారుల సమన్వయ లోపంతో ఉద్దేశ పూర్వకంగా జరిగిన కబ్జా అన్నారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు, గ్రామస్తులు కలిసి మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. వారంలోగా సమస్య పరిష్కారం కాకపోతే గ్రామ నక్ష ఆధారంగా హైడ్రా పద్దతిలో సమస్యను పరిష్కరించాల్సి ఉంటుందని నిర్మాణదారులను హెచ్చరించారు.

మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ కబ్జాపై ఆరా

బబ్బాఖాన్ చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లను ఆక్రమించి సుమారు ఎకరం స్థలంలో మేకల వెంకటేశం ఫంక్షన్ హాల్ ను నిర్మించినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్​కు గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో కబ్జాలపై ఆరా తీశారు. కబ్జాపై నివేదిక తయారు చేయాలని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. బబ్బాఖాన్ చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు తేలితే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కమర్షియల్ స్పేస్ కబ్జా చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. దుండిగల్ మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్, ఇరిగేషన్ ఏఈ స్వప్న, సర్వేయర్ రూప, హైడ్రా అధికారులు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story