గ్రామీణ నియోజకవర్గాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్

by Naveena |
గ్రామీణ నియోజకవర్గాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా గ్రామీణ నియోజకవర్గాలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను (ఏటీసీ) ఏర్పాటు చేయాలని సంకల్పించిందని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్ వెల్లడించారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్లతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్రంలో 70 ఏటీసీ కేంద్రాల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. ఇదే తరహాలో ఐటిఐ, ఏటీసీ సెంటర్లు లేని ప్రతి గ్రామీణ ప్రాంత అసెంబ్లీ సెగ్మెంట్ లో కనీసం ఒకటి చొప్పున అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఏటీసీ సెంటర్ల నిర్మాణానికి అనువైన ప్రదేశం, స్థలాన్ని గుర్తిస్తూ సమగ్ర వివరాలతో కూడిన నివేదికలను త్వరితగతిన సమర్పించాలని కలెక్టర్లకు సూచించారు.

రాష్ట్రంలో సుమారు 45 ఏటీసీ కేంద్రాలను గ్రామీణ ప్రాంత నియోజకవర్గాలలో నెలకొల్పాలని ప్రభుత్వం నిర్దేశించిందని అన్నారు. రోడ్డు, రవాణా వసతితో పాటు సమీపంలో పరిశ్రమలు ఉన్న స్థలాలను ఎంపిక చేస్తే ఏటీసీ కేంద్రాలలో విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు, ఇన్ స్ట్రక్టర్లు సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుంటుందని సూచించారు. అంతేకాకుండా స్థానిక పరిశ్రమలకు చేరువలో ఏటీసీలను ఏర్పాటు చేసినట్లయితే, సంబంధిత పారిశ్రామిక అంశాలతో కూడిన ట్రేడ్లలో యువతకు శిక్షణ అందించేలా ప్రణాళికలు చేపట్టవచ్చని అన్నారు. తద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న వెంటనే యువతకు స్థానిక పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు లభించేందుకు దోహదపడినట్లు అవుతుందన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటూ అనువైన ప్రదేశాలలో అందుబాటులో ఉన్న స్థలాల వివరాలతో కూడిన నివేదికలను వెంటనే పంపాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ సూచించారు.

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. జిల్లాలోని ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏ.టీ.సీ కేంద్రాల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను సోమవారం లోపు పంపిస్తామని తెలిపారు. జిల్లాలో వ్యవసాయ ఆధారిత, విత్తన శుద్ధి పరిశ్రమలకు అనుగుణంగా ఏటీసీ కేంద్రాలలో కోర్సులను ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. జూమ్ మీటింగ్ లో సంబంధిత శాఖల అధికారులు, ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed