- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BRS: జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం.. బీసీ మహాసభలో ఎమ్మెల్సీ కవిత
దిశ, తెలంగాణ బ్యూరో : రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయని.. బీసీలంటే ఎందుకు చులకన అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ(BRS MLC) కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) నిలదీశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government), కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం(BJP Government) బీసీల హక్కులను కాలరాస్తున్నాయని మండిపడ్డారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ బీసీలకు తీరని అన్యాయం చేస్తున్న ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా కామారెడ్డి డిక్లరేషన్ ను యధాతథంగా అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కారును డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద శుక్రవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ మహాసభ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని, కామారెడ్డి డిక్లరేషన్ ను యధాతథంగా అమలు చేయాలని, జనగణనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని, అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాన్న నాలుగు తీర్మానాలను బీసీ మహాసభ ఆమోదించింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో బీసీల అభివృద్ధి, ఏడాది కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధమా? అని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విసిరిన సవాల్ ను స్వీకరించారు. ‘ఎక్కడైనా ఎప్పుడైనా.. ఏ గల్లీలోనైనా.. ఏ సెంటర్లో నైనా చర్చకు నేను సిద్ధం... తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో మొదటి 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏంది, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది ఏమిటి అన్న దానిపై చర్చించడానికి ఎక్కడికైనా వస్తాను’ అని ప్రకటించారు.
‘నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని రాజీవ్ గాంధీ అన్నారని ప్రస్తావించారు. 2011 కులగణన చేసిన నివేదికను అప్పటి యూపీఏ ప్రభుత్వం బహీర్గతం చేయలేదని, ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా నివేదిక బయటపెట్టలేదని ఎత్తిచూపారు... కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసిందని గుర్తు చేశారు... తాను చెప్పిన ఈ విషయాలు తప్పయితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. బీసీలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి విస్మరించారన్నారు. కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీ వర్గాల్లో ఉన్న 130 కులాలకు ఒక్కో కులానికి ఒక్కో సమస్య ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వాటిని పరిష్కారం చేయడానికి మాత్రం ముఖ్యమంత్రికి మనసొప్పడం లేదని విమర్శించారు. కుల వృత్తుల వారికి కేసీఆర్ అమలు చేసిన పథకాలను నిలిపివేయడం దారుణమని, కొత్త పథకాలను అమలు చేయకున్నా కనీసం పాత పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి ఉద్యమం చేయడం, హైకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు రేవంత్ ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ వేయలేదని తెలిపారు. బీసీల లెక్కలు ఒక కమిషన్ తీస్తుంటే... మరో కమిషన్ నివేదిక ఇస్తుందని, ఇలా చేస్తే కోర్టుల్లో నిలబడుతుందా? అని నిలదీశారు. బీసీల జనాభా ఎంత ఉంటే అంత వాటా ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. దొంగ లెక్కలు, కాకిలెక్కలు కాకుండా వాస్తవ లెక్కలు తీయాలని డిమాండ్ చేశారు. మాయదారి మాటలతో, మోసపూరిత పనులతో ప్రజలను మభ్య పెట్టవద్దని సూచించారు. రాజ్యాంగం రచించినప్పుడే బీసీలకు రాజ్యంగపరమైన రక్షణ కల్పించి ఉంటే అభివృద్ధిలో దేశం అమెరికాను దాటేసేదని ఎఅభిప్రాయపడ్డారు. బీసీలకు రాజ్యంగ రక్షణను సాధించడమే అంతిమ లక్ష్యమని, అందు కోసం రాజ్యంగ సవరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, దాన్ని దీర్ఘకాలిక లక్ష్యంగా పెట్టుకొని పోరాటం చేద్దామన్నారు. జనగణనలో కేంద్ర ప్రభుత్వం కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీసీలకు న్యాయం చేశాయన్నారు. కేసీఆర్, ఎన్టీఆర్ వంటి ప్రాంతీయ పార్టీల నాయకులు మాత్రమే బీసీలకు న్యాయం చేశారని తెలిపారు. బీసీ సంఘాలతో కలిసి తాము చేసిన ఉద్యమాల వల్లే సావిత్రీబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తమ ఉద్యమాలతో జంగుపట్టిన ప్రభుత్వ రథచక్రాలు కదులుతున్నాయని అన్నారు. సావిత్రీబాయి పూలే ఆడబిడ్డ కాదు... పులిబిడ్డ అని కొనియాడారు. మహిళా విద్యాకు ఎంతగానో కృషి చేశారని, ఎంతో మంది మహిళలకు చదువును నేర్పించిన వ్యక్తి సావిత్రీబాయి అని కీర్తించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సమాజ వికాసం కోసం పని చేశారని చెప్పారు. ఈ మహాసభలో శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమా, కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీంద్ర సింగ్, సుమిత్రా తానోబా, రూప్ సింగ్, ముఠా జైసింహా, పల్లె రవి కుమార్ గౌడ్, మఠం భిక్షపతి, కిశోర్ గౌడ్, ఉపేందర్, నవీన్ ఆచారి, వరలక్ష్మీ, గోవర్ధన్ యాదవ్, పద్మా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.