మీడియా అక్రిడిటేషన్లు తగ్గిస్తే ఊరుకునేది లేదు : అల్లం నారాయణ

by Kalyani |
మీడియా అక్రిడిటేషన్లు తగ్గిస్తే ఊరుకునేది లేదు : అల్లం నారాయణ
X

దిశ, గజ్వేల్ రూరల్ : జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని, వర్కింగ్ జర్నలిస్టుల మీడియా అక్రిడేషన్లు తగ్గిస్తే ఊరుకునేది లేదని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతామని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ తొలి ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఆదివారం గజ్వేల్ పట్టణంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల ఆరోగ్యం కోసం రూ.42 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులను కేటాయించడం జరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ. కోటి ఉన్న బడ్జెట్ ను వంద కోట్లకు తీసుకువెళ్ళిన ఘనత నాటి ప్రభుత్వానిదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పది వేల మంది జర్నలిస్టులకు శిక్షణ శిబిరాలతో వృత్తి నైపుణ్యాన్ని పెంచడం జరిగిందన్నారు. కరోనా కష్ట కాలంలో 450 మంది జర్నలిస్టులకు 20 వేల చొప్పున వైద్య ఖర్చుల నిమిత్తం ఇవ్వడం జరిగిందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 12 వేలు ఉన్న అక్రిడిటేషన్ కార్డులను 23 వేలకు పెంచడం జరిగిందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని అల్లం నారాయణ అన్నారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ మాట్లాడుతూ…. సంస్థను నిర్మాణాత్మకంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో జర్నలిస్టుల వ్యతిరేక చర్యలకు ఈ ప్రభుత్వం పాల్పడితే పోరాటం కోసం సిద్దమవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం గజ్వేల్ నియోజకవర్గ టీయూడబ్లూజే కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా గరిదాస్ నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా మహిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా బాలరాజ్, కోశాధికారిగా రమేష్ లు ఎన్నిక కాగా, టెంజూ అధ్యక్షునిగా మీర్జా అహ్మద్ బేగ్, కార్యదర్శిగా సాయిబాబాలు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షులు హజారే, రాష్ట్ర కోశాధికారి యోగి, ఎంజేయు అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి జనరల్ సెక్రటరీ రమణ, సుమారు 100 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.

Advertisement

Next Story