బాలికలకు భద్రతేది.. ?

by Sumithra |
బాలికలకు భద్రతేది.. ?
X

జిల్లాలో విద్యార్ధినులపై రోజురోజుకూ అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన విద్యార్ధినులపై కన్నేస్తున్న కొంత మంది ఉపాధ్యాయులు వారిని లొంగతీసుకునేందుకు యత్నిస్తుండటం సమాజానికే మాయని మచ్చగా తయారవుతుంది. జిల్లాలో ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో అధికమయ్యాయి. ఉపాధ్యాయుల రూపంలో కీచకుల మధ్యలో అన్నెం పున్నెం ఎరుగని విద్యార్థినుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని తల్లిదండ్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండడం పై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా వారికి మాత్రం రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికేడాది లైంగిక వేధింపులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదని అంటున్నారు. తాజాగా నిజాంసాగర్ మండల కేంద్రంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో కూడా విద్యార్థినులపై లైంగిక వేధింపులు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాలలో ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ వేధింపుల గురించి పాఠశాల విద్యార్థులు కొద్ది రోజుల క్రితం పూర్వ విద్యార్థుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఘటనపై కామారెడ్డి జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : చదువు నేర్పే గురువులను బ్రహ్మతో, విష్ణువుతో, మహేశ్వరుడితో పోల్చుతారు.. విలువలు నేర్పే గురువుకు సమాజంలో ఎంతో గౌరవ మర్యాదలు లభిస్తాయి. విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు సభ్యత, సంస్కారం, సంప్రదాయం, నైతిక విలువలు నేర్పే మహోన్నత వ్యక్తిగా చూస్తారు. అలాంటి గురువులు నీతి తప్పుతున్నారు. వారిలో నిద్రాణమై ఉన్న కామ పిశాచిని నిద్రలేపుతున్నారు. తమ సంరక్షణలో ఉండి చదువుకునే విద్యార్థినులను కన్న బిడ్డల్లా చూడాల్సి ఉన్నా, వారిలో ఆడతనాన్ని ఆశగా చూస్తున్నారు. ఆశపడుతున్నారు. వంకర బుద్ధులను ప్రదర్శిస్తున్నారు. విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నారు. ఉపాధ్యాయుల రూపంలో కీచకుల మధ్యలో అన్నెం పున్నెం ఎరుగని విద్యార్థినుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. తరచూ అక్కడక్కడా ఉపాధ్యాయులు విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు గతంలో కూడా జరిగాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే కాదు.. ఇతర జిల్లాలోనూ ఈ విధమైన వేధింపుల ఘటనలు అక్కడక్కడా జరిగిన దాఖలాలున్నాయి. బాన్సువాడ నియోజకవర్గంలోని దేశాయిపేట్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఓ ప్రధానోపాధ్యాయుడు లైంగికంగా వేధించడంతో పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, విద్యాశాఖలు ఈ అంశంపై విచారణలు చేపట్టి పలువురు టీచర్లపై చర్యలు తీసుకున్న ఘటన కూడా చోటు చేసుకుంది. బయటకు పొక్కకుండా లోలోపలే దాచేసే ప్రయత్నాలు జరిగినా పేరెంట్స్ గట్టిగా ఫైట్ చేయడంతో పోలీస్ కేసుల వరకు వెళ్లింది. కొద్ది నెలల క్రితం జీవదాన్ స్కూల్ లో జరిగిన ఓ ఘటనలో కూడా పాఠశాలకు చెందిన ఓ విద్యార్థినిని పీఈటీ అభ్యంతరకరంగా ప్రైవేట్ పార్ట్స్ పై తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనతో పాఠశాలలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాసంస్థ పై దాడి జరపడంతో ఏర్పడిన ఉద్రిక్త వాతావరణంలో పోలీసులు కూడా గాయపడ్డారు.

ఈ సంఘటన గురించి జిల్లా ప్రజలు ఇంకా మరిచిపోకముందే తాజాగా నిజాంసాగర్ మండల కేంద్రంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో కూడా విద్యార్థినులపై లైంగిక వేధింపులు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాలలో ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ వేధింపుల గురించి పాఠశాల విద్యార్థులు కొద్ది రోజుల క్రితం పూర్వ విద్యార్థుల దృష్టికి తీసుకొచ్చారు. పాఠశాలలో కొద్ది రోజుల క్రితం జరిగిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థుల దృష్టికి తమపై పాఠశాలలో పలువురు టీచర్లు పాల్పడుతున్న లైంగిక వేధింపుల గురించి చెప్పడంతో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కామారెడ్డి జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. విచారణలో అధికారులు పాఠశాలలో విద్యార్థినులపై జరిగిన వేధింపుల గురించి తెలుసుకున్న విషయాలను బహిర్గతం చేయకపోయినా విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడిని ఉన్నతాధికారులు కర్నాటక రాష్ట్రానికి అటాచ్ చేసినట్లు తెలిసింది. మరో ముగ్గురు ఉపాధ్యాయులను కూడా పూర్తి స్థాయి విచారణ కోసం పాఠశాల నుండి వారిని తీసుకెళ్లినట్లు తెలిసింది.

జవహర్ నవోదయ విద్యాలయ వీపీ మనుజే యోహనన్ వివరణ..

జవహర్ నవోదయ విద్యాలయ (జెఎన్వీ) లో జరిగిన ఘటన పై విద్యాలయ వైస్ ప్రిన్సిపాల్ మనుజే యోహనన్ ను దిశ ప్రతినిధి ఫోన్ లో సంప్రదించగా, ఘటన పై విద్యార్థులు తమకు ఇచ్చిన ఫిర్యాదు పై విద్యాలయ చైర్మన్ జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారని తెలిపారు. మా విద్యాలయలో ఓ విద్యార్థినిని ఉపాధ్యాయుడు వేధింపులకు గురి చేసినట్లు వచ్చిన అభియోగం పై విద్యాలయం రీజినల్ కార్యాలయానికి సమాచారం అందినట్లు పేర్కొన్నారు. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు విచారణ జరిపి సదరు ఉపాధ్యాయునికి కర్నాటక రాష్ట్రానికి అటాచ్ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ విచారణ చేపట్టారని ఈ వివరాలు కాన్ఫిడెన్షియల్ గా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. కానీ భయపడాల్సినంత పరిస్థితి మాత్రం లేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed