బీఆర్ఎస్ నేత భూ దాహం.. ఆరు ఎకరాలు ఆక్రమించి వెంచర్ వేసిన సర్పంచ్

by Aamani |
బీఆర్ఎస్ నేత భూ దాహం.. ఆరు ఎకరాలు ఆక్రమించి వెంచర్ వేసిన సర్పంచ్
X

దిశ, ఎల్లారెడ్డిపేట : కాయ్ రాజా కాయ్.. అందినకాడికి దోచేయ్.. అన్నట్లు అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అధికారంలో ఉన్న సర్పంచ్ భర్త ఎకరాల కొద్ది భూమిని అప్పనంగా కొట్టేశాడు. అంతేనా.. ఏకంగా వెంచర్ చేసి ప్రజాప్రతినిధులుకు, అధికారులకు అమ్మేసుకున్నాడు. అధికారం చేతిలో ఉంది కదా అని.. అక్రమంగా ఇంటి నంబర్లూ కేటాయించుకున్నాడు. కేటీఆర్ పుణ్యామా అని కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు. ఎల్లారెడ్డి పేట మండలంలో ఓ సర్పంచ్ భర్త భూ దాహం ఇది. ప్రభుత్వ భూమిని తన కుటుంబం పేర అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసించుకున్న ఈ లీడర్.. ప్రజలకు సేవ ఏమో గానీ సర్కార్ సొమ్మును మాత్రం కోట్లలో మింగేశాడు. వెంకటాపూర్ గ్రామ మాజీ సర్పంచ్, అతడి కుటుంబ సభ్యులు చేసిన లావణి పట్టా భూముల వ్యవహారం ఎట్టకేలకు ‘దిశ’ చేతికి చిక్కింది. లావణి పట్టా భూములు అమ్మినా, కొన్న నేరమని తెలిసినా క్రయవిక్రయాలు జోరుగా జరిగాయి. అయినా అధికారులు మాత్రం మిన్నకుండిపోయారు.

రెవెన్యూ రికార్డుల్లో లావణి పట్టా భూములు..

ఎల్లారెడ్డి పేట మండలంలోని వెంకటాపూర్ తాజా మాజీ సర్పంచ్ కోల అంజవ్వ కూతురు కోల సిందూజ పేరిట 247/11 సర్వే నంబర్‌లో 1.20 గుంటల భూమి లావణి పట్టా ఖాతా నెంబరు 60030 375/9 లో 0.3000 ఎకరాలు ఖాతా నెంబరు 60030 ల్యాండ్ టైప్ ఆప్షన్ లో అసైన్డ్ భూమిగా నమోదై ఉంది. 375/10 సర్వే నంబర్‌లో 0.3000 ఖాతా నెంబర్ 60030 గుంటలు ఏకంగా సర్పంచ్ కోల ఆంజవ్వ పేరిట 247/19 సర్వే నంబర్‌లో ఖాతా నెంబరు 1454 నందు 34 గుంటల భూమి లావణి పట్టా భూమి ల్యాండ్ టైప్ ఆప్షన్ లో అసైన్డ్ భూమిగా అప్పట్లో రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. దాదాపు ఇలా చాలా సర్వే నంబర్లు కూడా వాళ్ళ కుటుంబ ఖాతాల్లోకి లావణి పట్టా, అసైన్డ్ భూములు చేరాయి. ఈ భూములు వెంకటాపూర్ నుంచి సిరిసిల్లకు వెళ్లే బైపాస్ రహదారిపై ఉన్నాయి. అప్పట్లో మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పట్టణంలో భారీ వాహనాలు రాకపోకలు తగ్గించాలనే ఉద్దేశ్యంలో వెంకటాపూర్ నుంచి సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం మీదుగా సిరిసిల్ల అర్బన్ రగుడు గ్రామం వయాగా బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. ఈ నేపధ్యంలోనే ఈ ప్రాంతంలో వెంకటాపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ కుటుంబీకులకు భూములు పెద్ద ఎత్తున రాబడిని తెచ్చిపెట్టుతున్నాయి. ఈ ఏరియాలో గతంలో గుంటల్లో ధరలు పలికిన భూములు ప్రస్తుతం గజాల్లో ధరలు పలుకుతున్నాయి.

వెంచర్‌గా మార్చి అమ్మకాలు..?

ప్రభుత్వం నుంచి నియమ నిబంధనల ప్రకారం లావణి, అసైన్డ్ భూములు అమ్మినా, కొనుగోలు చేసిన నేరమని తెలిసినా అధికార బలంతో వెంకటాపూర్ మాజీ సర్పంచ్ కోల అంజవ్వ భర్త కోల నర్సయ్య ఏకంగా ఆరు ఎకరాల లావణి అసైన్డ్ భూములను ప్లాట్లుగా మార్చి అమ్మకాలు చేపట్టారు. వెంచర్‌గా మార్చడానికి నిబంధనల ప్రకారం డీటీపీసీ ఆమోదం, గ్రామ పంచాయతీ పాలక వర్గం నుంచి అనుమతి తీసుకోవలసి ఉంటుంది. ఇవేవి పట్టించుకోకుండా అధికార బలంతో ఏకంగా భారీగా వెంచర్ చేసి కోట్లాది రూపాయలను సంపాదించుకున్నారు. ఇక్కడే అధునాతన ఫాం హౌస్ కూడా నిర్మాణం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇండ్ల నిర్మాణనికి సైతం అనుమతి..?

నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ ఏర్పాటు చేయడమే కాకుండా ఇంటి నంబర్లను కేటాయించి అక్రమాలకు పాల్పడ్డారు. గ్రామంలో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని వర్షాలకు కూలిపోయిన ఇంటి నెంబర్లను వెంచర్‌లో ఇండ్ల నిర్మాణం కోసం కేటాయించి అనుమతులు మంజూరు చేసినట్లు సమాచారం.

ప్రజాప్రతినిధులకు సైతం అమ్మకాలు..?

తన కుటుంబం పేరిట ఉన్న లావణి అసైన్డ్ భూమిలో ఎల్లారెడ్డి పేట మండలానికి చెందిన ఓ సింగిల్ విండో డైరెక్టర్‌కు గుంట భూమి రూ.5 లక్షల చొప్పున 10 గుంటల భూమిని సర్పంచ్ కుటుంబీకులు అమ్ముకున్నారని సమాచారం. ఇద్దరూ ప్రజాప్రతినిధులే కావడం.. మమ్మల్ని ఏ అధికారి ప్రశ్నిస్తాడనే రాజకీయ దర్పం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. దీంతోనే ఏకంగా క్రయవిక్రయాలు జరపరాదని తెలిసి కూడా అప్పటి రెవెన్యూ అధికారుల అండదండలతో అక్రమాలకు తెరలేపినట్లు ప్రచారం జరుగుతోంది.

రికార్డుల్లో పేర్ల మార్పిడి..?

అయితే ఈ భూ ఆక్రమణలో రెవెన్యూ అధికారుల పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. వెంకటాపూర్ సర్పంచ్ కుటుంబ సభ్యుల పేరిట రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించి ఏకంగా డిజిటల్ సంతకాలు చేసి పాస్ బుక్కులు జారీ చేయడం గమనార్హం. ఇంతేకాక సర్పంచ్ కుటుంబ సభ్యులు కోల సింధుజ, కోల అంజవ్వ పేరిట ఉన్న లావణి భూమిని గ్రామంలోని కొంతమంది వ్యక్తులు కొనుగోలు చేశారు. వారి పేర్లను సైతం రెవెన్యూ అధికారులు ఆ భూములను అధికారికంగా కొనుగోలు చేసినట్లు రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించడం కొసమెరుపు.

రిటైర్డ్ రెవెన్యూ అధికారి సైతం కొనుగోలు..?

సర్పంచ్ కుటుంబీకులు గ్రామంలోని ఓ వ్యక్తికి లావణి పట్టా భూమిని అమ్మగా.. అతడి నుంచి సిరిసిల్ల మండల తహశీల్దార్ కార్యాలయంలో పని చేసి రిటైర్డ్ అయిన రెవెన్యూ అధికారి కొనుగోలు చేశాడు. అంతే కాదు.. ఆయన కూడా కొంత లావణి పట్టా భూమిని ఆక్రమించుకున్నట్లు తెలిసింది. ఆ భూమిలో ఇల్లు కట్టుకోవడం కోసం సదరు తాజా మాజీ సర్పంచ్ ఇంటి నెంబర్ కూడా కేటాయించినట్లు సమాచారం. అయితే ఈ భూ ఆక్రమణలపై మాజీ సర్పంచ్ కోల అంజవ్వ కుటుంబీకులను ‘దిశ’ వివరణ కోరగా.. పొంతన లేని సమాధానాలు చెప్పడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed