సౌర వెలుగులు..విద్యుత్ వినియోగం పెరగడంతో సర్కారు నిర్ణయం

by Aamani |
సౌర వెలుగులు..విద్యుత్ వినియోగం పెరగడంతో సర్కారు నిర్ణయం
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తిని స్వయంగా పెంచుకోవడంతో పాటు భవిష్యత్తు విద్యుత్ అవసరాలను తీర్చేందుకు సోలార్ పవర్ను విస్తృతంగా ఉత్పత్తి చేయాలని అధికార యంత్రాంగం ఆలోచిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు స్వయంగా సోలార్ పవర్ ను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రతి మండల కేంద్రంలో ఒక సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అధికారులు ఆలోచన చేస్తున్నారు.

విద్యుత్ సబ్ స్టేషన్ కు సమీపంలో..

ప్రతి మండల కేంద్రంలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ కు సమీపంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు తయారు చేస్తున్నారు కనీసం ఐదు ఎకరాల్లో ఒక్కో ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఓకే మండలం లో ఒకటి కన్నా ఎక్కువ విద్యుత్ సబ్ స్టేషన్ లు ఉంటే అక్కడి అవసరాలను బట్టి అదనంగా మరో విద్యుత్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సూచనప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. విద్యుత్ సబ్ స్టేషన్ కు సమీపంలో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని తొలుత గుర్తిస్తారు. ఒకవేళ అందుబాటులో లేకపోతే కొంచెం దూరంలో నైనా వ్యవసాయ అవసరాలకు పనికిరాకుండా ఉండే రాళ్లు రప్పల భూములను గుర్తించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీని వినియోగించి మండల కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లు ఈ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

మూడు ప్రభుత్వ శాఖలకు బాధ్యతలు...

మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్ల కు సంబంధించి ప్రభుత్వ స్థలాలతో పాటు ఇతర వినియోగంలో లేని భూములను గుర్తించేందుకు మూడు ప్రభుత్వ శాఖలకు బాధ్యతలు అప్పగించారు. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయం చేసుకొని భూములను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. సౌర శక్తి వినియోగం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ప్రోత్సాహకాలు ఇస్తుండడంతో పాటు... ప్లాంట్ ఏర్పాటు అనంతరం సబ్సిడీ కూడా పెద్ద మొత్తంలో ఇస్తున్న నేపథ్యంలో ప్రతి మండల కేంద్రంలో ఈ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అన్ని జిల్లాల కన్నా ముందుగా నిర్మల్ జిల్లా లో ఉన్న అన్ని మండల కేంద్రాల్లో భూముల సేకరణకు సంబంధించి మూడు ప్రభుత్వ శాఖల అధికారులు సోలార్ ప్రాంతంలో ఏర్పాటు కోసం భూసేకరణకు చర్యలు తీసుకోనున్నారు. భూముల సేకరణ పూర్తయిన వెంటనే ప్రభుత్వం సూచన మేరకు జిల్లా కలెక్టర్ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత సంబంధిత సోలార్ కంపెనీలు ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారు.

వెంటనే భూములు గుర్తించండి : నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్

అన్ని మండల కేంద్రాల్లో విద్యుత్ సబ్స్టేషన్లకు సమీపంలో ప్రభుత్వ భూములను గుర్తించేందుకు వెంటనే చర్యలు తీసుకోండి. రెవెన్యూ పంచాయతీ రాజ్ విద్యుత్ శాఖలు సమన్వయంగా అధికారులు భూముల సర్వేను చేపట్టి వెంటనే సమాచారం ఇవ్వండి సౌరశక్తి వినియోగం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు సబ్సిడీలు ఇస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో సాధ్యమైనంత తొందరగా సోలార్ విద్యుత్ ప్లాంట్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.

Advertisement

Next Story