- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రజాపాలన సైట్ అప్డేట్ ఎప్పుడు..?
దిశ ప్రతినిధి, వికారాబాద్ : అర్హత ఉన్నా కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని సబ్సిడీలు అందకా జిల్లాలో అనేక మంది లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. వరంగల్, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం 200 యూనిట్ల వరకు జీరో కరెంట్ బిల్లు, రూ.500 లకే గ్యాస్ సబ్సిడీ పథకాలను ప్రారంభించింది. ఈ సమయంలో మహబూబ్‌నగర్‌తో పాటు వికారాబాద్ జిల్లాలో కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున జిల్లాలో ఈ రెండు పథకాలు అమలుకు నోచుకోలేదు. ఆ తర్వాత వెంటనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ కొనసాగడంతో మరింత పెండింగ్ పడిన పరిస్థితి ఏర్పడింది. దీంతో జిల్లా ప్రజలు నిరాశకు గురయ్యారు. చివరికి ఎంపీ ఎన్నికలు కూడా పూర్తి కావడంతో, జిల్లాలో 200 యూనిట్ల వరకు జీరో కరెంట్ బిల్లు, రూ.500 లకే గ్యాస్ సబ్సిడీ పథకాలు ప్రారంభం అయ్యాయి. పథకాలు ప్రారంభం అయినా జిల్లాలో చాలామంది అర్హులకు ఈ పథకాలు చేరడం లేదు. ప్రజాపాలన సమయంలో అన్ని పథకాలకు దరఖాస్తు చేసుకున్న ఎందుకు రావడం లేదని కొందరు, ప్రజాపాలన సమయంలో సరైన వివరాలు లేక ఇప్పుడు అప్లై చేసుకుందామని బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
ఎక్కడికి వెళ్లినా సమస్యకు దొరకని పరిష్కారం..
200 యూనిట్ల వరకు జీరో కరెంట్ బిల్లు, రూ.500లకే గ్యాస్ సబ్సిడీ పథకాలు అమలు కావడం లేదు. మరికొందరేమో ప్రజాపాలన సమయంలో సరైన పత్రాలు లేక సరైన వివరాలు ఇవ్వలేదని, ఇప్పుడు ఇస్తామని గ్రామ పంచాయతీ కార్యదర్శిని అడిగితే ఈ సమస్య మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి అడగాలని అంటున్నారని వాపోతున్నారు. దాంతో ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్తే ‘నాట్ మ్యాచ్, నాట్ అప్లైడ్ అని చూపించడం, ఎడిట్ ఆప్షన్ రావడం లేదని, ప్రభుత్వం రెండోసారి ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించడం లేదా ఎడిట్ ఆప్షన్ ఇస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది’ అని అంటున్నారు. ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్ చేసే సమయంలో ఆపరేటర్లు చేసిన తప్పిదమే పేదలకు శాపంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో వికారాబాద్, పరిగి, తాండూర్, కొడంగల్ ఏ నియోజకవర్గానికి వెళ్లినా ఈ సమస్య ఉన్నది. దాదాపు చాలా మండలాల్లో 30 నుంచి 40 శాతం లబ్ధిదారులకు ఈ సమస్య ఉన్నట్లు తెలుస్తోంది.
దరఖాస్తుదారు భార్య పేరుంటే భర్త పేరు, ఆధార్ కార్డు నెంబర్ ఒకరిది ఒకరికి కొట్టడం, 200 యూనిట్ల వరకు వినియోగించిన విద్యుత్ బిల్లులో యూనిట్లు నమోదు చేయకుండా కేవలం సున్నా ఎంటర్ చేయడం, గ్యాస్ నెంబర్ మ్యాచ్ కాకపోవడం తదితర తప్పిదాలతో తమకు లబ్ధి చేకూరడం లేదని వాపోతున్నారు. అద్దె ఇళ్లలో ఉంటున్న వారికి అయితే జీరో బిల్లు వర్తించడం లేదు. మ్యాచ్ అవుతున్నా కొందరి దరఖాస్తులు ఎడిట్ చేస్తున్నా, ఎక్కువ మట్టుకు ఎడిట్ ఆప్షన్ లేకపోవడంతో వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉంటున్నాయంటున్నారు. గృహ జ్యోతి దరఖాస్తుల్లో కొన్నింటిని పరిష్కరించినా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయంటూ అధికారుల దృష్టిలో సైతం ఉన్నది. కానీ సైట్ అప్డేట్ కాకపోవడం, ఎడిట్ అప్షన్ కొన్ని దరఖాస్తులకే పనిచేయడంతో వారు కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.
ఎడిట్ ఆప్షన్ రాగానే పరిష్కరిస్తాం..
ప్రజాపాలన దరఖాస్తు సమయంలో కొందరు తమ వివరాలను సరిగా నమోదు చేసుకోకపోవడం, ఇతర కారణాలతో కొందరు లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అమలు జరగడం లేదు. అలాంటివారి వివరాలు ఎడిట్ చేద్దాం అంటే ప్రజాపాలన సైట్‌లో నాట్ మ్యాచ్ అని వస్తుంది. దానివల్ల మేము కూడా ఏమీ చేయలేక పోతున్నాం. ప్రభుత్వం రెండోసారి ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించడం లేదా అందరికీ ఎడిట్ ఆప్షన్ ఇస్తేనే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఈ సమస్యలను ఇప్పటికే పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం.:-వినయ్ కుమార్, ఎంపీడీవో, వికారాబాద్