Trudeau: ఆ ఒక్క పని చేయలేదని బాధగా ఉంది- రాజీనామా తర్వాత ట్రూడో కీలక కామెంట్స్

by Shamantha N |
Trudeau: ఆ ఒక్క పని చేయలేదని బాధగా ఉంది- రాజీనామా తర్వాత ట్రూడో కీలక కామెంట్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: కెనడా 23వ ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. తొమ్మిదేళ్లు పదవిలో కొనసాగిన ఆయన.. రాజీనామా తర్వాత మీడియాతో మాట్లాడారు. త్వరలో ఎన్నికలకు వెళ్తున్న వేళ.. తనకు మాత్రం ఒక్క విషయంలో మాత్రం పశ్చాత్తాపం ఉందని చెప్పుకొచ్చారు. చాలా అంశాలు తన మనసులో ఉన్నాయని.. కానీ, అందులో ఒకటి మాత్రం ముఖ్యమైందన్నారు. ఓకే బ్యాలెట్‌ సాయంతో ప్రజలు తమ పాలకుల్లో రెండో, మూడో ఛాయిస్‌లు కూడా ఎంచుకొనేలా చేయాలని భావించానన్నారు. కానీ, అది నెరవేరలేదని ట్రూడో పేర్కొన్నారు. ఆ ఒక్క పని చేయలేదని బాధగా ఉందన్నారు. పార్టీలో నెలకొన్న అంతర్గత పోరాటాలతో వచ్చే ఎన్నికల్లో తాను ఉత్తమ ఎంపిక కాకపోవచ్చని అన్నారు. అందుకే పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో దేశానికి అర్హుడైన వ్యక్తిని ఎన్నుకునే అవకాశం వస్తుందన్నారు. ఒకవేళ అంతర్గత పోరుతో తాను పోరాడవలసి వస్తే రానున్న ఎన్నికల్లో తాను ఉత్తమంగా పోరాడలేనని స్పష్టమైందన్నారు.

ఆ కారణంగానే రాజీనామా

ట్రూడో పాలనపై కొంతకాలంగా కెనడా వాసుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాజకీయంగానూ ఆయన ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. రాజీనామా చేయాలని సొంత పార్టీ ఎంపీల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. దేశీయంగానే కాదు.. అంతర్జాతీయంగానూ ట్రూడో అపఖ్యాతి పాలయ్యారు. డ్రగ్స్, అక్రమ వలసలను కెనడా కట్టడి చేయకపోతే.. ఆ దేశంపై 25 శాతం పన్ను విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీంతో ట్రూడోపై ఒత్తిడి మరింత పెరిగింది. ఇటీవల ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి పదవికి క్రిస్టియా ఫ్రీలాండ్‌ రాజీనామా చేశారు. ఆమె ట్రూడో ఆర్థిక విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల జరిగిన సర్వేల్లోనూ ట్రూడో జనాదరణ భారీగా తగ్గింది. ప్రతిపక్ష కన్సర్వేటివ్‌ పార్టీవైపు 47 శాతం మొగ్గితే.. 21 శాతం మందే లిబరల్‌ పార్టీకి అనుకూలంగా స్పందించారు. ఇకపోతే, లిబరల్‌ పార్టీతోపాటు ప్రధాని బాధ్యతలను మార్క్‌ కార్నీ, లీ బ్లాంక్‌లలో ఒకరు చేపట్టే అవకాశముంది. కార్నీ గతంలో బ్యాంక్‌ ఆఫ్‌ కెనడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ సారథ్య బాధ్యతలను నిర్వహించారు. లీ బ్లాంక్‌ న్యాయవాదిగా పని చేశారు. ఎంపీగా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed