భారత్‌‌కు బిగ్ షాక్.. డబ్ల్యూఎఫ్‌ఐ‌పై నిషేధం

by Vinod kumar |
భారత్‌‌కు బిగ్ షాక్.. డబ్ల్యూఎఫ్‌ఐ‌పై నిషేధం
X

న్యూఢిల్లీ : ప్రపంచ క్రీడా వేదికపై భారత్‌కు గట్టి షాక్ తగిలింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ)పై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(యూడబ్ల్యూడబ్ల్యూ) నిషేధం విధించింది. నిర్ణీత సమయంలో డబ్ల్యూఎఫ్‌ఐకి ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిరవధికంగా సస్పెండ్ చేసింది. ‘డబ్ల్యూఎఫ్‌ఐ ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి ఎన్నికలు నిర్వహించకపోవడంతో యూడబ్ల్యూడబ్ల్యూ భారత రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్ చేసింది. యూడబ్ల్యూడబ్ల్యూ ఈ విషయాన్ని డబ్ల్యూఎఫ్ఐ అడ్ హక్ కమిటీకి బుధవారం రాత్రి సమాచారం అందించింది’ అని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) వర్గాలు వెల్లడించాయి. డబ్ల్యూఎఫ్‌ఐపై వేటుతో భారత రెజ్లర్లు అంతర్జాతీయ టోర్నీలో దేశం తరఫున పాల్గొనే వీలుండదు. సెప్టెంబర్ 16 నుంచి వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ జరగనుంది. యూడబ్ల్యూడబ్ల్యూ నిర్ణయంతో ఈ టోర్నీలో భారత రెజ్లర్లు ‘తటస్థ అథ్లెట్లు’గా పోటీపడాల్సి ఉంటుంది. భారత జాతీయ పతాకం లేకుండానే పోటీపడనున్నారు.

కొంతకాలంగా డబ్ల్యూఎఫ్‌ఐ వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. వాస్తవానికి మేలోనే ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌‌పై లైంగిక ఆరోపణలు చేస్తూ అగ్రశ్రేణి రెజ్లర్లు నిరసనకు దిగడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత పలు రాష్ట్ర సంఘాలు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలు పోస్ట్‌పోన్ అవుతూ వచ్చాయి. తాజాగా ఈ నెల 12న ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. ఎన్నికలకు ఒక రోజు ముందుగానే పంజాబ్ హైకోర్టు స్టే విధించింది. దాంతో ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. ఎన్నికలను సకాలంలో నిర్వహించాలని, లేదంటే నిషేధం విధిస్తామని యూడబ్ల్యూడబ్ల్యూ ఏప్రిల్‌లోనే హెచ్చరించింది. అయితే, ఎన్నికల నిర్వహణలో డబ్ల్యూఎఫ్‌ఐ విఫలకావడంతో తాజాగా యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్ వేటు వేసింది. ప్రస్తుతం భారత రెజ్లింగ్ సమాఖ్య రోజు వారీ కార్యకలాపాలను ఐవోఏ ఏర్పాటు చేసిన అడ్ హక్ కమిటీ చూస్తోంది.

Advertisement

Next Story