జీహెచ్ఎంసీ నూతన కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి ఇలంబర్తి

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-17 07:21:13.0  )
జీహెచ్ఎంసీ నూతన కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి ఇలంబర్తి
X

దిశ, వెబ్ డెస్క్ : జీహెచ్ఎంసీ నూతన కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి ఇలంబర్తి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళిన నేపథ్యంలో ఆ స్థానాన్ని రవాణా శాఖ కమిషనర్‌గా ఉన్న ఇలంబర్తితో భర్తీ చేశారు. ఆయన కమిషనర్ గా తన బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులు, సిబ్బంది పుష్పగుచ్చాలతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లోనే రిపోర్ట్‌ చేయాలని పలువురు ఐఏఎస్ అధికారులకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగం (డీఓపీటీ) ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే డీవోపీటీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని.. ప్రస్తుతం తాము ఎక్కడ పనిచేస్తున్నామో అక్కడే ఉంచాలని కోరుతూ పలువురు ఐఏఎస్‌ అధికారులు క్యాట్‌, హైకోర్టును ఆశ్రయించినా వారికి అక్కడ ఎదురుదెబ్బే తగిలింది.

దీంతో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిన ఐఏఎస్‌లు ఆమ్రపాలి, వాణి ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్ రిలీవ్ అయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీవ్‌ అయిన ఐఏఎస్‌లు సృజన, హరికిరణ్, శివశంకర్‌లు తెలంగాణ సీఎస్‌ శాంతి కుమారికి రిపోర్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఖాళీ అయిన స్థానాల్లో తాత్కాలికంగా ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శిగా ఎన్. శ్రీధర్‌కు బాధ్యతలు అప్పగించారు. విద్యుత్‌శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా.. మహిళా సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా టీకే శ్రీదేవి.. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సీఈవోగా ఆర్వీ కర్ణన్‌.. ఆయుష్‌ డైరెక్టర్‌గా క్రిస్ట్రినాకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

Advertisement

Next Story