హిమ సాయి వెంచర్లో అనుమతులు లేని నిర్మాణాలు..

by Sumithra |
హిమ సాయి వెంచర్లో అనుమతులు లేని నిర్మాణాలు..
X

దిశ, అబ్దుల్లాపూర్మెట్ : పెద్ద అంబర్పేట మున్సిపాలిటీలో నూతనంగా విలీనమైన గ్రామపంచాయతీ పరిధిలోని పలువెంచర్లలో అనుమతులు లేని నిర్మాణాల జోరు ఎక్కువైంది. గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా మారుతున్న క్రమంలో గ్రామ పంచాయతీల అనుమతులు తీసుకున్నామన్న కారణాలతో అధికారుల అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టారు. ఇదేంటి అని ప్రశ్నించిన గ్రామస్థాయి అధికారులకు మున్సిపాలిటీ నుంచి అనుమతులు తీసుకుంటామని, మున్సిపాలిటీలో అధికారులు ప్రశ్నిస్తే గ్రామపంచాయతీ పరిధిలో అనుమతులు తీసుకున్నామని అధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తున్న వెంచర్ దారుల అనుమతులు లేని నిర్మాణాల పై దిశ ప్రత్యేక కథనం.

పెద్ద అంబర్పేట మున్సిపాలిటీలో ఇటీవల నాలుగు గ్రామాలను విలీనం చేశారు. ఇందులో భాగంగా కుత్బుల్లాపూర్, గౌరెల్లి, తారామతిపేట, బాచారం గ్రామాలు విలీనమయ్యాయి. విలీనమైన గ్రామాల్లోని కుత్బుల్లాపూర్ లో గల సర్వే నెంబర్ 60 లో హిమ సాయి వెంచర్ కు డీటీసీపీ, హెచ్ఎండీ అనుమతులు తీసుకున్నామని చుట్టూ ప్రహరీ నిర్మించి ఆర్చితో సహా పలు రోడ్లు వేశారు. ఇదిలా ఉంటే గ్రామపంచాయతీ నుంచి రెండు ఇళ్లకు అనుమతులు తీసుకుని 10 ఇండ్ల వరకు నిర్మాణాలు చేపట్టారు. ఇదేంటని గ్రామ పంచాయతీ అధికారులు ప్రశ్నిస్తే తొందర్లో మున్సిపాలిటీ నుంచి అనుమతులు తీసుకుంటామని మాట దాటవేస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు అడిగితే గ్రామ పంచాయతీ నుంచి ఇప్పటికే అనుమతులు పొందామని తీసుకున్న రెండు ఇళ్ల అనుమతుల పత్రాలు చూపించి అధికారులను సైతం బురిడీ కొట్టిస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం. ఇటీవలనే గ్రామాలు విలీనం కావడంతో వాటి పై పూర్తి అవగాహనకు రాని మున్సిపాలిటీ అధికారులు గ్రామస్థాయి అధికారుల మీదనే నడిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ హిమ సాయి వెంచర్లో చేపట్టిన అనుమతులు నిర్మాణాలకు అప్పటి గ్రామ కార్యదర్శి గత ఏప్రిల్ నెలలోనే నోటీసులు పంపించారు. అయినా కూడా నిర్మాణాలను మాత్రం సదరు వెంచర్ దారులు కొనసాగిస్తున్నారు. పైగా ఈ విధంగా తాము అధికారులను ఒప్పించి నిర్మాణాలు చేపడుతున్నారంటే వారి వెనక పెద్దల సహకారం ఉంటేనే చేస్తారు కదా అంటూ వెంచర్ లో ఓ వ్యక్తి ఇస్తున్న సమాధానం. అధికారుల నోటీసులు సైతం బేఖాతరు చేస్తున్న సదర్ హిమ సాయి వెంచర్ యజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకొని, అదే విధంగా అనుమతులు నిర్మాణాల పై కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇటువంటి అనుమతులు లేని వెంచర్ల పై చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వానికి రావలసిన ఆదాయాన్ని పెంచి గ్రామాలను అభివృద్ధి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story