ఈనెల 20వ తేదీలోపు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తాం

by Sridhar Babu |
ఈనెల 20వ తేదీలోపు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తాం
X

దిశ, లోకేశ్వరం : ఈనెల 20వ తేదీలోపు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని, ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాణాల మేరకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ధాన్యంలో తేమ శాతాన్ని స్వయంగా పరిశీలించారు.

కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తీసుకెళ్లిన సమయంలో మిల్లర్లు ఇబ్బంది పెడితే తమకు తెలపాలని సూచించారు. ఈనెల 20వ తేదీలోపు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తాం అన్నారు. ఈనెల 18 సాయంత్రంలోపు కొనుగోలు కేంద్రాలకు గన్నీ బ్యాగులను సరఫరా చేస్తామని తెలిపారు. అలాగే 20వ తేదీలోపు కొనుగోళ్లు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈరోజు సాయంత్రం ట్రాన్స్​పోర్టర్లతో సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వాతావరణంలో మార్పులు వస్తున్నందున ధాన్యం తడిచిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

గ్రామకంఠం ఏర్పాటు చేయండి...

తమ గ్రామానికి అధికారులు ఇంతవరకు గ్రామ కంఠం ఏర్పాటు చేయలేదని, దీంతో ప్రభుత్వ అవసరాల కోసం భూమి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కొనుగోలు కేంద్రాలు, తదితర అవసరాల కోసం గ్రామస్తులు డబ్బులు పోగు చేసి భూమిని కొనుగోలు చేసినట్టు వివరించారు.

వీలైనంత త్వరలో సర్వే చేయించి సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అలాగే గతంలో చేసిన సర్వే వివరాలు రేపటిలోగా అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్, పౌర సరఫరాల శాఖ మేనేజర్ గోపాల్, తహసీల్దార్ మోతిరామ్, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story