Kollam MP : యువత రాజకీయాల్లోకి రావాలి..

by Kalyani |
Kollam MP : యువత రాజకీయాల్లోకి రావాలి..
X

దిశ,పటాన్ చెరు : జాతి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని, రాజకీయాలను యువత సీరియస్ గా తీసుకోవాలని కొల్లం లోక్ సభ సభ్యుడు, రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి ఎన్.కె. ప్రేమచంద్రన్ పిలుపునిచ్చారు. చేంజ్-మేకర్స్ పేరిట గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో గురువారం ఆయన అతిథిగా పాల్గొన్నారు. పరివర్తన కార్యక్రమాలపై దృష్టి సారించి, నాయకత్వం, భారతదేశ భవిష్యత్తు పై తనకున్న లోతైన అవగాహనను గీతం విద్యార్థులతో పంచుకున్నారు. జాతి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని, రాజకీయ వ్యవహారాల పట్ల యువత విముఖత చూపడం సరికాదన్నారు. రాజకీయ, పార్లమెంటరీ విషయాలలో వారికి అవగాహన కల్పించడం అవశ్యమని, అటువంటి చొరవ అద్భుత ఫలితాలను ఇస్తుందని, అంతిమంగా జాతి శ్రేయస్సు కోసం పార్లమెంటరీ, రాజకీయ వ్యవస్థలను బలోపేతం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

చర్చల ఆధారంగా పార్లమెంటులో ప్రైవేటు సభ్యుల తీర్మానం ప్రభుత్వ విధానాన్ని ఎలా ప్రభావితం చేసిందో వివరిస్తూ, తన స్వీయ అనుభవాన్ని ప్రేమచంద్రన్ పంచుకున్నారు. రాజకీయ సంకల్పం, పట్టుదల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, పార్టీ బలంతో సంబంధం లేకుండా ప్రభావవంతమైన మార్పును సాధించవచ్చని పేర్కొన్నారు. వార్డు సభ్యుని స్థాయి నుంచి, ఎమ్మెల్యే, మంత్రిగా, ఐదుసార్లు ఎంపీగా తన మూడు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని ప్రతిబింబిస్తూ, ప్రేమచంద్రన్ తన విజయానికి కృషి, అంకితభావమే కారణమన్నారు. ప్రజలతో సన్నిహితంగా ఉండటం, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఉండటం తప్పనిసరని, ఇది వారి గుర్తింపు, మద్దతును సంపాదించడానికి కీలకమన్నారు. పార్లమెంటు సభ్యునిగా తన రోజువారీ కార్యకలాపాలపై మాట్లాడుతూ… పార్లమెంటరీ ప్రసంగాల కోసం సమగ్ర పరిశోధన, వాటి తయారీ ప్రాముఖ్యతను వివరించారు. రాజకీయాలను సీరియస్ గా తీసుకోవాలని, యువతరాన్ని ప్రోత్సహిస్తూ, అంకితభావంతో వారు గణనీయమైన ప్రభావాన్ని చూపగలరన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

పర్యావరణ సమస్యలను, ముఖ్యంగా వాయనాడ్ కొండచరియలు విరిగిపడటం, పర్యావరణం, పర్యావరణ పరిరక్షణ తక్షణ అవసరాన్ని ప్రేమచంద్రన్ వివరించారు. రాజకీయ కార్యనిర్వాహకులు అభివృద్ధి పేరుతో పర్యావరణ సమతుల్యతను విస్మరించడం పట్ల ఆయన నిస్పృహ వ్యక్తం చేశారు. రాజకీయ చర్చలో పర్యావరణ సుస్థిరతకు ప్రాధాన్యత ఇవ్వాలని భవిష్యత్తు తరాలను కోరారు. కేరళలో తలెత్తిన కోకా-కోలా ప్లాంట్ వివాదంపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, పర్యావరణ సమస్యలు పారిశ్రామిక ప్రయోజనాల కోసం తరచుగా రాజీ పడటం, ముఖ్యంగా అట్టడుగు వర్గాలను ప్రభావితం చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయాన్ని పణంగా పెట్టి అభివృద్ధి చేయడం తగదని, సమతుల్యత పాటించాలని హితవు పలికారు. రాజకీయాల పట్ల యువతరానికి ఉన్న భ్రమలను ప్రస్తావిస్తూ, వారు దేశానికి సేవ చేసే రంగంగా రాజకీయాలను చూడాలని ప్రేమచంద్రన్ కోరారు. ప్రస్తుత ఓటు బ్యాంకు రాజకీయాలపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాజకీయ సంస్కరణల ఆవశ్యకతను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.

భారతదేశంలో కమ్యూనిజం వైఫల్యం గురించి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, చారిత్రక అవలోకనాన్ని ప్రేమచంద్రన్ అందించారు. ఈ ఉద్యమం భారతదేశ ప్రత్యేక రాజకీయ, సామాజిక, భౌగోళిక సందర్భాన్ని తగినంతగా పరిగణనలోకి తీసుకోలేదన్నారు. మనదేశ చరిత్రలో (క్విట్ ఇండియా ఉద్యమం) కీలక ఘట్టాలలో ప్రధాన స్రవంతి జాతీయ రాజకీయాల నుంచి కమ్యూనిజం వేరు పడడం, దాని ప్రాభవాన్ని కోల్పోవడానికి దారితీసిందన్నారు. కృత్రిమ మేథస్సు, సమాచార సాంకేతికత పెరుగుదలతో సహా మారుతున్న ప్రపంచ దృశ్యానికి అనుగుణంగా మారడంలో కమ్యూనిజం విఫలమైందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ డీ.ఆర్.పీ. చంద్రశేఖర్ సమన్వయంగా చేయగా, గీతం అధ్యక్షుడు, విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు మతుకుమిల్లి శ్రీభరత్ వందన సమర్పణ చేశారు. గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావుతో కలిసి ఆయన అతిథిని సత్కరించారు. కేరళలోని అత్యంత నిజాయితీ గల నాయకులలో ప్రేమచంద్రన్ ఒకరని శ్రీభరత్ కొనియాడారు. ఆయన సుదీర్ఘ సేవ, రాజకీయ వర్గాలలో ఆయనకు లభిస్తున్న గౌరవాలను ఎత్తిచూపారు. విలువైన విషయాలను గీతం విద్యార్థులతో పంచుకోవడానికి సమయం ఇచ్చిన ప్రేమచంద్రన్-కు శ్రీభరత్ కృతజ్జతలు తెలియజేశారు.

Advertisement

Next Story