గ్రామానికి కీడు... ఊరంతా ఖాళీ..

by Sumithra |
గ్రామానికి కీడు... ఊరంతా ఖాళీ..
X

దిశ, వేములపల్లి : ఊరికి కీడు వచ్చిందంటూ ఊర్లో జనాలందరూ గురువారం తెల్లవారేసరికి వనభోజనాలకు వెళ్లారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో గత కొన్ని రోజుల నుండి గ్రామంలోని ప్రజలు కొంతమంది అనారోగ్యంతో, మరి కొంతమంది రోడ్డు ప్రమాదంలో, ఇంకొకరు వయసు అయిపోవడంతో ఇలా ఏదో ఒక కారణంతో గ్రామంలోని పలువురు మృతి చెందారు. దీంతో భయాందోళనకు గురవుతున్న గ్రామ ప్రజలు పలుమార్లు గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు.

ప్రతి ఏట వనభోజనాలు గురువారం వెళ్లాల్సి ఉండగా ఈ ఏడాది ఆదివారం వెళ్లడంతో అపచారం జరిగిందని, దీంతో గ్రామంలోని ఒక్కొక్కరు చనిపోతున్నారని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సమస్య పరిష్కారమయ్యే విధంగా గ్రామంలోని ప్రజలు గురువారం రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే ఆరుబయట కలాపి కూడా చల్లకుండా, పొయ్యి ముట్టించకుండా అందరూ తమ పంట పొలాలకు, గ్రామ పొలిమేర అవతల తరలివెళ్లి అక్కడే వంట వార్పు చేసుకొని తిని సూర్యాస్తమయం తర్వాత గ్రామానికి చేరుకోవాలని పెద్ద మనుషులు నిర్ణయించి గ్రామంలో టంక వేయించారు. దీంతో ఉదయాన్నే ప్రజలు మొత్తం ఊరి అవతలికి తరలి వెళ్లారు. కొంతమంది గ్రామ ప్రజలు కీడు లేదు ఏమి లేదని కొట్టిపారేస్తుండడం గమనార్హం.

Advertisement

Next Story