రాబర్ట్ వాద్రా వాంగ్మూలం రికార్డు

by Sumithra |   ( Updated:2021-01-04 06:03:33.0  )
రాబర్ట్ వాద్రా వాంగ్మూలం రికార్డు
X

న్యూఢిల్లీ : పన్ను ఎగవేత ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా వాంగ్మూలాన్ని సోమవారం ఆదాయపు పన్నుశాఖ అధికారులు రికార్డు చేశారు. ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ నుంచి యూకేలో ఆస్తులను కొనుగోలు చేశారన్న ఆరోపణలపై వాద్రాపై కేసు నమోదైంది. 2009లో పెట్రోలియం ఒప్పందాల ద్వారా అక్రమంగా పొందిన నగదుతో ఆస్తులను కొనుగోలు చేసినట్లు రాబర్ట్ వాద్రాపై ఆరోపణలు ఉన్నాయి. 2018లో నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసులో ఆయన ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించింది.

సోమవారం మధ్యాహ్నం ఐటీ బృందాలు తూర్పు ఢిల్లీలోని సుఖ్‌దేవ్ విహార్‌లో గల రాబర్ట్ వాద్రా కార్యాలయానికి చేరుకుని ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశాయి. విచారణకు హాజరుకావలని ఐటీ శాఖ సమన్లు జారీ చేయగా కరోనా వైరస్ నేపథ్యంలో గడువు కావాలని రాబర్ట్ వాద్రా కోరారు. యూకేలో రాబర్ట్ వాద్రా అక్రమంగా ఆస్తులను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈడీ సమాచారం ప్రకారం ఆయన పేరిట లండన్‌లో రూ.17.77కోట్లు విలువ చేసే బ్రిస్టన్ స్క్వైర్‌తోపాటు రూ.37.42కోట్లు, రూ.46.77కోట్లు విలువ చేసే రెండు ఆస్తులు ఉన్నాయి. ఇవేకాకుండా మరో ఆరు ప్లాట్లు కూడా రాబర్ట్ వాద్రా కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆస్తులను 2005-2010 మధ్యకాలంలో కొనుగోలు చేసినట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed