కష్టాలే పాఠాలు.. ఇంజనీర్లుగా మారి అద్భుత వంతెన నిర్మించుకున్న ఆదివాసీలు

by karthikeya |
కష్టాలే పాఠాలు.. ఇంజనీర్లుగా మారి అద్భుత వంతెన నిర్మించుకున్న ఆదివాసీలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదుకోవాలని అధికారులను అడిగి-అడిగి అలసిపోయారేపో.. అండగా ఉండాలని, అభివృద్ధి చేయాలని వేడుకుని విసుగుచెందారేమో.. ఇక ఎవ్వరినీ చేతులు జాచి అడగకూడదని నిర్ణయించుకున్నారేమో.. ఆ ఆదివాసీలు స్వయంగా ఓ వాగుపై వంతెన నిర్మించుకున్నారు. మావోయిస్టులకు నిలయమైన చత్తీస్‌గఢ్​ దండకారణ్యంలో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు ఆదివాసీలు. దంతెవాడ–-బీజాపూర్​ జిల్లాల బార్డర్‌లోని మంగనార్​- తులార్,​గుఫా గ్రామాల మధ్య ఇంద్రావతి నది ప్రవహిస్తుంటుంది. మావోయిస్టులు తిరిగే ప్రాంతం కావడంతో అధికారులు కూడా అక్కడకు వెళ్లడానికి ఇష్టపడరు. దీంతో వర్షాకాలంలో నది పొంగి గామాలు నది ప్రవాహంలో చిక్కుకుని రాకపోకలు నిలిచిపోతుంటాయి. దీంతో నానా అవస్థలు పడుతుంటారు ఆదివాసీలు.

సాధారణంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే ఈ గ్రామాల్లో ఎవరికైనా రోగమొచ్చినా, పురిటి నొప్పులు వచ్చినా.. ప్రాణంపోయినట్లే. ఇక వరద సమయాల్లో అయితే అనుక్షణం చావు భయంతో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిందే. అందుకే తమ సమస్యకు తామే పరిష్కారం వెతుక్కున్నారు ఈ గ్రామాల రైతులు, యువకులు. అడవుల నుంచి పెద్ద కర్రలను తీసుకొచ్చి వాటిని తీగజాతి నారతో చుట్టి పిల్లర్లలా నీటిలో లోతుకు పాతి నదికి అడ్డంగా ముందుగా పునాదులు వేశారు. వాటి మధ్యలో ఖాళీల్లో రాళ్లు నిండపంతో పునాదులు బలంగా తయారయ్యాయి. వాటిపై గ్రామాల్లో పాడై పోయిన సిమెంట్​ విద్యుత్ స్తంభాలతో పాటు, అడవి నుంచి తెచ్చిన భారీ కర్రలు, మొద్దులను పిల్లర్లపై ఉంచి, పట్టుకుని నడవడానికి వీలుగా తాడు కట్టారు. ప్రస్తుతం పండించుకున్న ధాన్యాన్ని ఈ వంతెన ద్వారానే గ్రామాలు దాటించి కొనుగోలు కేంద్రాల వరకు తీసుకెళ్లి అమ్ముకుని ఓ రూపాయి సంపాదించుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా ఈ వంతెన 20 గ్రామాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోందని ఆదివాసీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed