Etala rajender: ‘ప్రజల కన్నీళ్లు చూసినవాడు ఎప్పుడూ బాగుపడడు’

by karthikeya |
Etala rajender: ‘ప్రజల కన్నీళ్లు చూసినవాడు ఎప్పుడూ బాగుపడడు’
X

దిశ, వెబ్‌డెస్క్: కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు కొడంగల్ నియోజకవర్గ రైతుల పరిస్థితి ఉందని బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వ అవసరాల కోసం భూములు తీసుకోవడం వేరని, కానీ రైతుల భూములు లాక్కుని వాటిని బడా బాబుల కంపెనీలకు కట్టబెట్టడం ఏంటని ప్రశ్నించారు. సంగారెడ్డి జైలులో వున్న లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన వారి వద్దకు సోమవారం వెళ్లిన ఈటల రాజేందర్ వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాధితులకు ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పి వారిని విడుదల చేయాలని, దుర్మార్గంగా ప్రవర్తించి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా కాంగ్రెస్ వాళ్లే ఈ ఘటనకు స్కెచ్ వేశారని, దాడులు చేయించారని సంచలన ఆరోపణలు చేసిన ఈటల.. స్థానికంగా 144 సెక్షన్ అమలు చేస్తూ ప్రజాప్రతినిధులను రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. దీనిపై పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్ వేస్తామని, రైతులకు అండగా నిలుస్తామని మాటిచ్చారు. రైతుకు సంకెళ్లు వేయడం, వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణమని, ప్రజల కన్నీళ్లు చూసినవాడు ఎప్పుడు బాగుపడడని మండిపడ్డారు. గతంలో ఖమ్మం రైతులకు సంకెళ్లు వేసిన వారికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికీ పడుతుందని జోస్యం చెప్పిన ఈటల.. నియోజకవర్గంలో సీఎం రేవంత్ సోదరుడి అరాచకాలు ఎక్కువయ్యాయని, నియంతలకు సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ సమాజం బుద్ధి చెబుతుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed