ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌‌లోని నీళ్లు తాగుతున్నారా?.. రిస్కులో పడ్డట్టే !

by Javid Pasha |
ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌‌లోని నీళ్లు తాగుతున్నారా?.. రిస్కులో పడ్డట్టే !
X

దిశ, ఫీచర్స్ : ప్లాస్టిక్ కవర్లు, వాటిలో పెట్టిన ఆహార పదార్థాల వాడకం మంచిది కాదనే విషయం మనకు తెలిసిందే. కానీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లోని నీళ్లు తాగడం కూడా ఆరోగ్యానికి హానికరమని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఎందుకంటే ఒక బాటిల్ వాటర్‌లో మన కంటికి కనిపించని వేలాది సంఖ్యలో నానో ప్లాస్టిక్ కణాలు ఉంటాయని కొలంబియా అండ్ రట్జర్స్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. స్టడీలో భాగంగా వీరు మూడు సాధారణ వాటర్ బాటిల్ బ్రాండ్‌లకు సంబంధించిన బ్రాంచ్‌ల నుంచి ఐదు చొప్పున బాటిల్స్ నుంచి వాటర్ శాంపిల్స్ సేకరించారు. డ్యూయల్ లేజర్స్ టెక్నిక్‌ను యూజ్ చేస్తూ మైక్రోస్కోప్ ద్వారా ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌లోని నీటిని అబ్జర్వ్ చేశారు.

సగటు లీటర్ వాటర్‌ బాటిల్‌లో దాదాపు పావు మిలియన్ కంటే ఎక్కువగా నానోప్లాస్టిక్స్ ఉన్నట్లు గుర్తించారు. అయితే దుకాణాల్లో విక్రయించే వాటర్ బాటిల్స్‌లో హానికరమైన ప్లాస్టిక్ బిట్స్ ఉంటాయనే అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. కానీ రీసెంట్ స్టడీలో మాత్రం అంచనాలకు మించి నానో ప్లాస్టిక్ కణాలు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. బ్రాండ్ల పేరు బహిర్గతం చేయలేదు కానీ, సైంటిస్టులు ఒక్క లీటర్ వాటర్ బాటిల్‌లోని నీటిలో 1,10,000 నుంచి 4,00,000 వరకు నానో ప్లాస్టిక్ కణాలు ఉన్నాయని గుర్తించారు. అందుకే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లోని నీటిని తాగడం మంచిది కాదని సూచిస్తున్నారు. అయితే వాటర్ బాటిల్స్‌లోని నీటిని తాగడంవల్ల ఎటువంటి హానికరమైన ఆరోగ్య ప్రమాదాలు ఉంటాయో తాజా పరిశోధనలో వెల్లడించలేదు. కానీ ప్లాస్టిక్‌కు బహిర్గతం అయితే ఎలాంటి హాని కలుగుతుందో గత అధ్యయనాలు, పరిశోధనలు పేర్కొన్నాయి. ముఖ్యంగా మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి ప్రవేశిస్తే క్యాన్సర్ రావడం, జ్ఞాపకశక్తి మందగించడం, మెంటల్ హెల్త్ ఇష్యూస్ తలెత్తడం, నరాల బలహీనత వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే చాన్స్ ఉంటుంది. అందుకే ప్లాస్టిక్‌కు దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed