రఫాపై దాడులను ఖండిద్దాం..!

by Ravi |   ( Updated:2024-05-31 00:31:27.0  )
రఫాపై దాడులను ఖండిద్దాం..!
X

గత ఎనిమిది నెలలుగా.. పాలస్తీనాను పూర్తిగా ఆక్రమించుకోవాలనే ఉద్యేశంతో ఇజ్రాయిల్ దేశం పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై దాడులు చేస్తూ వేలమంది ప్రజలను హతమార్చింది. సామ్రాజ్యవాద ప్రాయోజిత దురాక్రమణా యుద్ధంలో అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఈ సంఘటనపై ప్రపంచ దేశాలలోని విద్యార్థులు, ప్రజలు ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తున్నారు. పాలస్తీనాపై యుద్ధం నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం, ఐక్యరాజ్యసమితి పదేపదే యుద్ధం నిలుపుదలకై ఇరు దేశాలను ఆదేశిస్తున్నప్పటికీ బేఖాతరు చేస్తూ మే 26, 27, 28 తేదీలలో పాలస్తీనా శరణార్థులు నివసిస్తున్న రఫా నగరంలోని గుడారాలపై దాడులు చేసి వందలాది మంది మంది చిన్నారుల, విద్యార్థుల, ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. ఇది హేయమైన చర్య. అమెరికా, ఇజ్రాయెల్‌తో అంటకాగుతూ రఫాలో పాలస్తీనా పౌరుల మృతిపై మొసలికన్నీరు కార్చుతున్నది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు పాలస్తీనాను స్వాతంత్ర్య దేశంగా గుర్తిస్తుంటే.. ఇండియా తన వైఖరిని వ్యక్తం చేయకపోగా.. చత్తీస్‌ఘడ్ దండకారణ్యంలోని ఐదవ షెడ్యూల్ ఆదివాసీ ప్రాంతాలలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మిలిటరీని పంపుతూ.. తన సొంత పౌరులపై అంతర్గత యుద్ధం ప్రకటించింది. ఇప్పటికే ఎన్‌కౌంటర్ పేరుతో 118 మందిని చంపేసింది.

ఇండియాలో జరుగుతున్న రాజ్య ప్రేరేపిత హత్యలు- పాలస్తీనా, ఉక్రెయిన్ దేశాలలో జరుగుతున్న పౌరుల హత్యలకు కారణం సామ్రాజ్యవాద దురాక్రమణ కాంక్ష వారి అణచివేత స్వభావమే. ఆయా దేశాల్లోని సహజ వనరులను కొల్లగొట్టి ఆ దేశాలపై ఆర్థిక, రాజకీయ అధికారం నెరపేందుకే ఈ దాడులు, యుద్ధాలు.. వలసవాద కాంక్షను కొల్లగొడుతూ.. అన్ని దేశాల సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని ఎత్తిపట్టాలని విద్యార్థులకు పిలుపునిస్తున్నాం. ఇజ్రాయెల్ వెంటనే యుద్ధం నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం. పాలస్తీనా శరణార్ధులు నివసిస్తున్న శిబిరాలపై దాడులు నిలిపివేయాలని, పాలస్తీనా సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని ఎత్తిపడదాం. అమెరికా, ఇజ్రాయెల్, రష్యా ఇతర సామ్రాజ్యవాద దేశాలు సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాలు వలసవాద, అర్ధ వలసవాద విధానాలను వ్యతిరేకిద్దాం. ఇండియాలోని ఐదవ, ఆరవ షెడ్యూల్ ప్రాంతాలలో.. ఆదివాసీలపై హత్యలు నిలిపివేయాలని డిమాండ్ చేద్దాం.

-ప్రశాంత్ పగిళ్ళ,

స్టూడెంట్స్ ఫర్ ఫీస్ అండ్ లిబర్టీ ఆర్గనైజేషన్, ఓయూ

95812 62429

Advertisement

Next Story