ఇంటింటి సర్వే.. పేదల సంజీవని

by Ravi |   ( Updated:2024-10-17 01:00:37.0  )
ఇంటింటి సర్వే.. పేదల సంజీవని
X

ఆధునిక కాలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనకు, పథకాల అమలుకై సర్వేలు ప్రధాన ఆధారం అవుతున్నాయి. అలాంటి సర్వేనే తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కేబినెట్ ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది. దీనిని వెనువెంటనే నిర్వహించాలని గత వారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ సర్వేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్లి (డోర్ టు డోర్) చేయడానికి గాను ఆరవై రోజులు గడువును విధించారు. దీన్ని పర్యవేక్షించడానికి నోడల్ అధికారిని కూడా నియమించారు. రాష్ట్రంలో నూతన జనాభా లెక్కలు అయ్యే వరకు ఈ వివరాలనే రాష్ట్ర సర్కార్ ప్రామాణికంగా తీసుకోనుంది.

భారతదేశంలో అత్యధికులు పేదవారు. దీనికి తెలంగాణ రాష్ట్రమేమీ మినహాయింపు కాదు. దేశంలో 28 శాతం కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నాయని వివిధ సర్వేలు తేల్చి చెప్పాయి. దాదాపు అదే స్థాయిలో పేద కుటుం బాలు రాష్ట్రంలోనూ ఉన్నాయి. అలాంటి వారి వివరాలను సమగ్రంగా తెలుసుకోవడానికి ఇంటింటి సర్వే ఉపయోగపడుతుంది.

ఆరు అంశాలపై సర్వే

రాష్ట్రంలోని పేద కుటుంబాల వివరాలను సమగ్రంగా తెలుసుకోవడానికి ఇంటింటి సర్వే ఉపయోగపడుతుంది. ఇది ఒక రకంగా కులగణనకు ప్రాధాన్యం ఇస్తూనే ప్రతి ఇంటిని (కుటుంబాన్ని) ఒక యూనిట్‌గా చేసుకుని అన్ని అంశాలను సేకరించేలా ప్రణాళికలను రూపొందించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ సర్వే ప్రధానంగా ఐదు అంశాలపై (కులాన్ని కలిపితే ఆరు అంశాలు) దృష్టి పెట్టనున్నది. కుల వివరాలతో పాటుగా ఆయా కుటుంబాలలోని విద్య, ఉపాధి (ఉద్యోగ), సామాజిక, రాజకీయ, ఆర్థిక వెనుకబాటుతనానికి సంబంధించిన విషయాలను నమోదు చేయనున్నది.

ఈ సర్వే ఉపయోగాలు బోలెడు..

పేదల సంక్షేమం, సామాజిక సమానత్వం, అభివృద్ధి, సాధికారత, ఆర్థిక స్వావలంబన వంటి వాటి ప్రాతిపదికన సర్వే జరుగుతుండటం గమనార్హం. ఈ సర్వేలో రాష్ట్ర బీసీ కమిషన్, స్టేట్ ప్లానింగ్ బోర్డులు సంయుక్తంగా అన్ని కులాల వివరాలను సేకరించనున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని బీసీ ఓటర్ల సంఖ్య ఎంత? రాజకీయంగా వారి వెనుకబాటుతనాన్ని అంచనా వేయ డంతో పాటు వారికి కేటాయించాల్సిన వాటాలను నిర్ణయించడానికి ఇది దోహదం చేస్తుంది. సర్వే వివరాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి బిసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్‌లను కమిషన్ ఖరారు చేయనున్నది. రాష్ట్ర ఎస్సీ జనాభా వివరాలు కూడా దీని ద్వారా తేలుతున్నందున ఎస్సీ వర్గీకరణ కోసం కులాలు, ఉప కులాలను గ్రూపుల వారీగా విభజించడానికి, వారికి ఇప్పటివరకు ప్రభుత్వపరంగా లభించిన సౌకర్యాలపైన కూడా సృష్టత రానుంది. ఎస్సీ వర్గీకరణ అమలుకై సర్వే ఫలితాలను వాడుకోవచ్చును. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను మాత్రం 2011నాటి జనాభా లెక్కల ప్రకారం చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. కేవలం స్థానిక సంస్థల్లో బీసీలకు పొలిటికల్ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ ఉపయోగపడేలా మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ఇతర కులాలకు బలహీన వర్గాల వారి పరిస్థితిని బేరీజు వేయడానికి, భవిష్యత్తులో ప్రభుత్వం తరపున వారికి కల్పించాల్సిన అవకాశాలపై నిర్ణయం తీసుకోవడానికి ఇంటింటి సర్వే ఉపయోగపడుతుంది. దీనివల్ల ప్రభుత్వం అందించాల్సిన సంక్షేమ పథకాలు, కొత్తగా ప్రవేశపెట్టే స్కీములు తదితరాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి వీలు అవుతుంది.

సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పేరుతో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పథకాలతో పాటు సంక్షేమరాజ్య లక్షణాలలో ఒకటైన ప్రజా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం హర్షణీయం. దేశం మొత్తంలోనే సంక్షేమరాజ్య లక్ష్యాలను నెరవేర్చడంలో తెలంగాణ ప్రభుత్వం ముందు వరుసలో ఉందనడంలో సందేహం లేదు. అయితే గత ప్రభుత్వాలు సంక్షేమ పథకా లు, అభివృద్ధి పనులు సైతం ప్రవేశపెట్టాయి కానీ వాటి లబ్దిదారులే అనర్హులు. ప్రతి పథకం అవినీతి జాడ్యంలో కూరుకుపోయిందని అనేక నివేదికలు బట్టబయలు చేశాయి. ఈ విషయాలు తెలిసిన ప్రభుత్వాలు ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడం కొసమెరుపు. ప్రతి ఐదేళ్లకొకసారి వచ్చే ఎన్నికల తంతులో భాగంగా ప్రభుత్వాలు మారా యే తప్ప పేద ప్రజలకు ఒరిగేదేమీలేదు. గెలిచిన ప్రతి ప్రభుత్వం కూడా తన మందీమార్బలానికి పథకాలలో వాటాలు కల్పిస్తూ మరింత తూట్లు పొడిచాయే తప్ప, అక్రమార్కులను, అనర్హులను ఏరివేయడంలో శ్రద్ధ పెట్టలేదు. దీంతో కోట్లాది రూపాయల పేదల సొమ్ము అనర్హులు, అవినీతిపరుల జేబుల్లోకి చేరింది. గతంలో పథకాలలోని అవినీతి గురించి ప్రధానమంత్రులు స్వయంగా మాట్లాడుతూ రూపాయిలో పావలా మాత్రమే లబ్దిదారునికి చేరుతుందని ఒకరు ప్రకటిస్తే, మరొకరు కేవలం పదిహేను పైసలే చేరుతున్నాయని ప్రకటించారు. ఇలా అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అవినీతిమయమై అనర్హుల పాలవుతున్నాయి.

అర్హులకు మాత్రమే అమలు చేయాలి!

వీటన్నింటిని గమనించిన పేదల పక్షపాతి, దీక్షా, దక్షత కలిగిన తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలంటే, మ్యానిఫెస్టోను సక్రమంగా అమలు చేయాలంటే ముందుగా అవినీతి అక్రమార్కులను, అనర్హులను ఏరివేస్తేనే నిజమైన పేదవాడికి న్యాయం జరుగుతుందని గుర్తెరిగి ఇంటింటి సర్వే మొదలుపెట్టడం ముదావహం. ప్రస్తుతం వివిధ పథకాల లబ్ధిదారులు ఎవరు? నిజమైన వారికే దక్కుతున్నాయా లేదా? వారి సామాజిక స్థితి, ఆర్థిక, వైద్య సౌకర్యాల పరిస్థితులు ఏమిటి? విద్య సౌకర్యం గతంలో వారు పొందింది ఎంత? ఉపాధి, ఉద్యోగం ఉందా, లభిస్తుందా? వీటిని లబ్ధిపొందగోరేవారు ఎంత మంది? ఇలాంటి అనేక అంశాల సమ్మేళితమే ఇంటింటి సర్వే. అయితే గత ప్రభుత్వం సర్వే జరిపి నివేదికలు రూపొందించినా వాటిని అమలు చేయకుండా బుట్టదాఖలు చేసినట్టు కాకుండా సర్వే ఫలితాల ప్రకారం నూతన సంస్కరణలు, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తేనే నిజమైన లబ్దిదారులకు మేలు జరుగుతుంది. దీనితో బహుజన హితాయ, బహుజన సుఖాయ అనేది సాకారం అవుతుంది. అప్పుడే నిజమైన ప్రజా ప్రభుత్వం అనిపించుకుంటుంది.

డాక్టర్ సందెవేని తిరుపతి

చరిత్ర పరిరక్షణ సమితి

98496 18116

Advertisement

Next Story

Most Viewed