జీవితమే ఉద్యోగం కావద్దు..

by Ravi |   ( Updated:2023-12-02 00:30:52.0  )
జీవితమే ఉద్యోగం కావద్దు..
X

భారతదేశంలోనే పోటీ పరీక్షల్లో అత్యంత కఠినంగా ఉండే పరీక్షల్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ పరీక్షను విజయవంతంగా పూర్తిచేయడానికి అభ్యర్థులు ఎన్నో కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొనవలసి ఉంటుంది. సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల జీవితాలు ఎలా ఉంటాయో తెలిపే వెబ్ సీరీస్ ఈ ఆస్పిరంట్స్ (Aspirants) సీరీస్. ఈ వెబ్ సీరీస్‌ని టీవీఎఫ్ (ద వైరల్ ఫీవర్) అనే నిర్మాణ సంస్థ వారు నిర్మించారు. దీని దర్శకుడు 'అపూర్వ సింగ్ కర్కి' తొలుత రెండేళ్ల కింద తొలి సీజన్ యూట్యూబ్‌లో విడుదల అయ్యి ప్రేక్షకుల మన్ననలు పొందింది. దీనికి కొనసాగింపుగా, ఇటీవల సీజన్- 2 అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుంది.

సివిల్స్ అభ్యర్థుల కష్టాల్ని చూపి

కొన్ని కొన్ని కథలు కొన్ని కొన్ని వర్గాల ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతాయి అయితే ఈ ఆస్పిరంట్స్ అనే వెబ్ సిరీస్ ముఖ్యంగా మన దేశంలో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు, అంతే కాకుండా ఎన్నో ఏళ్లుగా గ్రూప్స్ లాంటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి నిజజీవితంలో ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒకచోట ఎదురయ్యే సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు, ఎటువంటి రొమాన్స్ లేకుండా పిచ్చి పిచ్చి ఫైట్ సీన్లు లేకుండా, లేకి కామెడీ లేకుండా, ఓవర్ యాక్షన్ సీన్స్ లేకుండా, గుండెను పిండేసే బాధలు, ప్రిపరేషన్ సమయంలో కుటుంబం, ఇల్లు, పండుగలు, స్నేహితులు ప్రేమ వంటి బంధాలను దూరంగా ఉంచి కలలు గన్న ఉద్యోగాన్ని సాధించడం కోసం ఎన్నో సంఘర్షణలను ఎదుర్కొని ఎన్నో త్యాగాల్ని చేయాల్సి ఉంటుంది. ఎన్నో ఉద్వేగాలను, మరెన్నో ఉద్విగ్నతలను తట్టుకోవలసి ఉంటుంది. అటువంటి విషయాలను ఈ వెబ్ సిరీస్‌లో మనం చూడవచ్చు.

కన్నీళ్లు పెట్టించే కథ

ఈ సీరిస్ నిత్య జీవితంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల జీవితాన్ని ప్రతిబింబిస్తుంది.. కథలో భాగంగా అభిలాష్, ఎస్కే, గురి అనే ముగ్గురు మిత్రులు ఐఏఎస్ సాధించాలని కాలేజీ రోజుల నుండి అనుకుంటారు. ఢిల్లీలో సివిల్స్ కోచింగ్‌కి ప్రసిద్ధిచెందిన ఓల్డ్ రాజేందర్ నగర్‌లో వీరు కోచింగ్ తీసుకుంటారు. వీరికి సందీప్ అనే సీనియర్ పరిచయం అవుతాడు. అతనికి ముందుసారి ప్రయత్నంలో కేవలం ఒక మార్కుతో సివిల్స్ జాబ్ మిస్ అవుతుంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేక కోచింగ్ తీసుకోకుండా సెల్ఫ్ ప్రిపరేషన్ కొనసాగిస్తూ అభిలాష్ వాళ్ళకి గైడెన్స్ ఇస్తుంటాడు. తనకి ఇష్టమైన ఉద్యోగాన్ని సాధించడం కోసం. కుటుంబాన్ని, ఇష్టపడ్డ అమ్మాయిని అందరినీ దూరం పెట్టి చదువుకుంటూ ఉంటాడు.

సందీప్ ఈ ముగ్గురికి ప్రిపరేషన్ సమయంలో వచ్చే ఇబ్బందుల గురించి మోటివేషన్ చేస్తూ ఉంటాడు. జీవితంలో సివిల్స్ సాధించే ప్రతి ఒక్కరు కేవలం ప్లాన్ 'ఏ' ను మాత్రమే ఉంచుకోవాలని ప్లాన్ 'బి' గురించి లూజర్స్‌ మాత్రమే ఆలోచిస్తారని చెబుతుంటాడు. ఇంతలో అభిలాష్ లైబ్రరీలో ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. కొన్నిరోజులు రిలేషన్‌షిప్‌లో ఉండడం వల్ల సివిల్స్ సాధించలేననే ఉద్దేశంతో ఆ అమ్మాయిని దూరం పెడతాడు. సివిల్స్ నా జీవన్మరణ పోరాటం అని చెప్పి వివరించి ఆమెకు దూరంగా ఉంటాడు.

ఇక, ఆ సంవత్సరమే వారందరికీ సివిల్స్‌లో చివరి ప్రయత్నం. కానీ దురదృష్టవశాత్తు ఆ సంవత్సరం వారిలో ఎవ్వరు కూడా సివిల్ సాధించలేకపోతారు. కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం గడువు అయిపోయిన అభ్యర్థులందరికీ మరో రెండు సంవత్సరాలు అదనంగా గడువును పెంచుతుంది. దీంతో అభిలాష్ సివిల్స్ సాధిస్తాడు. ఎస్.కె, గురీలు సివిల్స్ సాధించలేకపోతారు. ఎస్.కె అక్కడే సివిల్స్ ఫ్యాకల్టీగా చేరి ఎంతోమందిని సివిల్స్ ఆఫీసర్లుగా తీర్చిదిద్దుతాడు. గురీ తన నాన్న వ్యాపారాన్ని చూసుకుంటాడు. ఎస్‌కే, గురీలు ఎప్పుడూ కలుసుకుంటూ ఉన్నా అభిలాష్ మాత్రం వీరిని కలవడానికి ఇష్టపడడు. సీనియర్ సందీప్ కూడా సివిల్స్ సాధించలేక అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఉద్యోగం చేస్తుంటాడు. అనుకోకుండా ఒకరోజు కలెక్టర్ హోదాలో ఉన్న అభిలాష్‌ని సందీప్ కలుస్తాడు. కోచింగ్ నాటి రోజుల్ని అభిలాష్‌కి గుర్తు చేసుకుంటూ మనమెంతో మూర్ఖులమని, కేవలం మన స్వార్ధం కోసం కుటుంబాన్ని, ఇంటిని, ప్రేమని, బంధుత్వాల్ని పక్కన పెట్టామని, తీరా మన కల సాధించాక మనకు ఎవరు మిగిలి ఉండరని చెప్తాడు. అందుకే జీవితంలో ప్లాన్ 'బి' కూడా కచ్చితంగా ఉండాలని అయితే అది లైఫ్‌ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుందని చెబుతాడు.

ముగింపు

జీవితంలో కోరుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం మన అని అనుకునే వాళ్లని దూరం పెట్టడం వల్ల అందర్నీ కోల్పోతాం అనే విషయాన్ని అత్యంత సున్నితంగా పేర్కొన్న ఈ ఆస్పిరెంట్స్ వెబ్ సిరీస్ ప్రతి ఒక్క ఉద్యోగార్థి హృదయాన్ని హత్తుకుంటుంది.

(ఈ వెబ్ సీరీస్ సీజన్- 1 యూట్యూబ్‌, ఆమెజాన్‌ ప్రైమ్‌ లోనూ ఉంది)

నేరడిగొండ సచిన్

87907 47628

Advertisement

Next Story

Most Viewed