- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
A Journey to Kashi Movie Review : మరువకూడని పురాజ్ఞాపకం.. ‘ఎ జర్నీ టు కాశీ’
ఒకటిన్నర సంవత్సరం క్రితమే థియేటర్లలో విడుదలై కూడా కనీస ప్రచారానికి నోచుకోకుండా మరుగున పడిపోయి చాలా లేటుగా అమెజాన్ ప్రైమ్(Amazon Prime)లో ఇటీవలే ఓటీటీ (OTT) లోకి వచ్చిన సినిమా 'ఎ జర్నీ టు కాశీ' (A Journey to kasi). దాన్ని ఎలాగోలా పట్టుకుని ఒక్కో డైలాగ్, ఒక్కో సీన్ చూస్తూ ఇది తెలుగు సినిమానేనా అని షాక్‌కి గురవడం జరిగింది. దాదాపు 35 సంవత్సరాల క్రితం తిరుపతిలో ఏపీసీఎల్‌సీలో పనిచేసిన నాటి మిత్రుడు మునికృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం. ఇటీవలే నా నంబర్ కనుక్కుని ఫోన్ చేసి తాను తీసిన ఈ సినిమా తప్పక చూసి కాస్త పరిచయం చేయమని అడగటం యాధృచ్చికమే కావచ్చు. తాను చెప్పింతర్వాత ఈ సినిమా చూడడం, నా మిత్రుడు ఈ సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడేమో కానీ మనసు కాల్చుకోలేదని అభిప్రాయానికి వచ్చేశాను.
'అనుకోని పరిస్తితుల్లో ఇద్దరు అపరిచితులు కాశీలో కలుసుకుని ఒకరినొకరు గుర్తు పడతారు. ఒకరు వేశ్య! ఇంకొకరు సన్యాసులలో కలిసిన ఆమె తండ్రి! ఇది ఒక వేశ్య (prostitute) ఆధ్యాత్మిక ప్రయాణం!! యిది వొక తండ్రి స్పిరిచ్యువల్ ప్రాస్టిట్యూషన్(Spiritual Prostitution)!! వొకప్పుడు భారతదేశాన్ని చెర పట్టిన పాపం నుంచి యీ తరంలో ప్రాయశ్చిత్తం చేసుకోడానికి యీ వేశ్య ఆశీర్వాదం కోసం ప్రయత్నించే వొక బ్రిటిష్ జాతి లవర్ బోయ్!! అతడి దృష్టిలో ఆమె Mother India! “ఎ జర్నీ టు కాశీ” తెలుగు సినిమాలో పాత్రలు యివి! యిప్పుడే చూశా అమెజాన్ ప్రైమ్‌లో'
- సౌదాఅరుణ
"మునికిష్ణ సత్యాన్ని దర్శనం చేసే శక్తి గల దర్శకుడు. మనం కూడా జర్నీ చేద్దాం నిజం కాశీకి"
- రాణి శివశంకర శర్మ, లాస్ట్ బ్రాహ్మిన్ రచయిత
మూడు ముక్కల్లో చెబితే ఎ జర్నీ టు కాశీ సినిమా కథ ఇంతే.. 2023 జనవరి 6 న థియేటర్లలో విడుదల అయ్యి జాతీయ అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాలలో తొమ్మిది అవార్డులు పొంది మన్ననలు పొందిన ఈ సినిమా కథ ఇంతేనా అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో మ్యాజిక్ ఏదో దాగి ఉంది. మలయాళ చిత్రపరిశ్రమ కూడా ఈ సినిమాను వారి భాషలో తీయాలనిపించినంత మ్యాజిక్ ఉంది మరి. సైలెంటుగా థియేటర్లలోకి వచ్చి సంవత్సరన్నర తర్వాత సైలెంటుగానే అమెజాన్ ప్రైమ్ (రెంటల్) ఓటిటీలోకి వచ్చేసిన వినూత్నమైన సినిమా ఎ జర్నీ టు కాశీ. ఈ సినిమాలో ఆ ప్రత్యేకత ఏంటో చూద్దాం.
ఒక కాంట్రాక్టర్ తన బిల్లు క్లియరెన్స్ కోసం శ్వేత అనే సెక్స్ వర్కర్‌ని ఎరగా వేస్తాడు. ఆమె లోపలకి వెళ్లి పని ముగించుకుని బయటకు రాగానే కాయా పండా అని అడుగుతాడు. హూ.. దిస్ ఈజ్ శ్వేత అంటుందామె. థ్యాక్ గాడ్. అమ్మయ్యా గాడ్ ఈజ్ గ్రేట్, పనయింది అంటాడతడు. హు. శ్వేత జేసింది. గాడ్ కాదు. అంటుందామే. '20 లక్షలు ఆఫర్ చేశాను. పని కాలే. పిల్లను పంపితే నా కొడుకు.. నాది పెట్టుబడితో చేసే వ్యాపారం. నీది దేవుడు ఊరికే ఇచ్చిందాంతో చేసిన వ్యాపారం. దీంతో పనయింది' అని అతగాడు నిట్టూరుస్తాడు. పని అయ్యేంతవరకు ఆమె అతనికి మెసెంజర్ ఆఫ్ గాడ్. పని అయ్యాక వేశ్య.. వట్టి flesh మాత్రమే.. తర్వాత ఎంత వారలైనా.. కాంతాదాసులే అంటూ కీర్తన మొదలెడుతుందామె.. 'ఏంటీ కీర్తనలు పాడుతున్నావ్. ఏం చదువుకున్నావేంటి' అని అడుగుతాడు. చదువు ఇంతే, జీవితం గింత అని చేతులు సాపుతుందామె. సినిమా నడక ఎలా సాగుతుందో తొలి సీనులోనే అర్థమవుతుంది. తెలుగు చిత్రపరిశ్రమలో వచ్చిన అతికొద్ది తాత్విక సినిమాలలో ఎ జర్నీ టు కాశీ ఒకటని గర్వంగా చెప్పవచ్చు మనం.
ఇక్కడి నుంచి కథా పరిచయం
పేరు వినగానే కాశీపై తీసిన తీర్థయాత్రా సంబంధిత సినిమాగా అనుమానం రావచ్చు. ఇది మనందరం నమ్మే సినిమా ప్రమాణాలతో పోల్చి చూస్తే ప్రత్యామ్నాయ సినిమా కోవలోకి రాకపోవచ్చు. కానీ జీవితంలో జరిగే ఆకస్మిక మలుపులు ఒక కుటుంబాన్ని, ఒక చిన్నారిని ఎలాంటి అనూహ్య సంఘర్షణల వైపు కొట్టుకుపోయేలా చేస్తాయో సహజంగా చిత్రించిన సినిమా ఇది.
సెక్స్ వర్కర్ ప్రధాన పాత్రలో...
మూడు ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే ఈ సినిమా కథకు ఒక సెక్స్ వర్కర్ కేంద్ర బిందువు కావడం ఆశ్చర్యం, విశేషం కూడా. ఒక పాశ్చాత్యుడి ఆధ్యాత్మిక చింతనా యాత్రను చిత్రించిన ఈ సినిమా దానితో పాటు సెక్స్‌వర్కర్‌గా మారిన యువతి జీవితానుభవాలను బలంగా చూపిస్తుంది. చిత్తూరు జిల్లాలో శ్వేత అనే బాలిక బాల్యం ఎలా గడిచింది? అనుకోని స్థితిలో కుటుంబం మొత్తం కాశీ సందర్శనకు వెళ్లినప్పుడు ఆ తల్లిదండ్రుల జీవితంలో జరిగిన ఆకస్మిక మార్పులు ఆ చిన్నారి జీవితాన్ని ఎలా మలుపులు తిప్పించాయి? ఈ క్రమంలో ఆమె హైదరాబాద్ ఎలా వచ్చింది? అక్కడ కూడా తల్లి, తాత ప్రమాదంలో మరణించినప్పడు ఆమె జీవితం మలుపు తిరిగి సెక్స్ వర్క్‌ని ఎలా ఆలంబన చేసుకుంది? ఆ క్రమంలోనే అద్వైత సిద్ధాంతం గురించి అధ్యయనం చేస్తూ, తనపై ప్రభావం చూపిన గురుదర్శనం కోసం కాశీ సందర్శనలో ఉన్న జాక్ వెబర్ అనే శ్వేతజాతీయుడితో శ్వేతకు ఎలా పరిచయం కల్గింది? అతడితో మరోసారి కాశీ యాత్రకు వెళ్లినప్పుడు తన బాల్యంలోనే అదే కాశీలో కుటుంబాన్ని వదిలి సన్యాసిగా మారిపోయిన కన్నతండ్రి అదే గురూజీగా పరిచయమై జీవితాన్ని కొత్తగా శ్వేతకు ఎలా దర్శింపజేశాడు? ఇదీ 'ఎ జర్నీ టు కాశీ' కథ.
జీవితమా... మెట్ట వేదాంతమా?
ఆధ్యాత్మికతను, వేదాంతాన్ని మనం ఏమేరకు ఇష్టపడతాం, వ్యతిరేకిస్తాం అనేది మనకు వ్యక్తిగతమైంది. కానీ తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి ప్రత్యేకమైన సబ్జెక్టు, ప్రగాఢమైన ఆలోచనలతో కూడిన చిత్రీకరణను మనం చాలా అరుదుగానే చూసి ఉంటాం. హిందూమతంపై ఆసక్తితో, అద్వైతాన్ని బోధించే గురువు అన్వేషణలో జాక్ వెబర్ అనే విదేశీయుడు చేసే కాశీయాత్ర, డబ్బు కోసం అతనికి తోడుగా ఉంటూ జీవిత పుటలను తిరగేస్తూ శ్వేత రెండోసారి చేసే కాశీ యాత్ర, బియ్యం మిల్లులో గుమాస్తాగా పనిచేసే శివానంద కాశీలో మొదలెట్టిన ఆధ్యాత్మిక యాత్ర…ఈ మూడూ చివరకు దేని దగ్గర కలుసుకుంటాయో, విడిపోతాయో ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అద్వైత తత్వం, వాస్తవజీవిత పాఠాలు, కాశీలో శంకర దర్శన భ్రాంతితో భవబంధాలను త్యజించి కుటుంబానికి కనబడకుండా పోయిన వ్యక్తి ఆధ్యాత్మిక జీవన యాత్ర ముప్పేటగా కలిసిపోయిన నిసర్గ సౌందర్య చిత్రం ఇది.
చిత్తూరు యాసకు జీవం పోసిన చిత్రం
శ్వేతతో సహా ఈ సినిమాకు ప్రాణం పోసింది ప్రధాన పాత్రధారులు కాగా మునికృష్ణ రాసుకున్న స్క్రిప్ట్, మాటలు ఈ సినిమాకు మరో సగం బలం. చిత్తూరు జిల్లా యాసకు జీవం పోసిన సినిమాల్లో ఇదొకటి. . రాసిందీ, తీసింది చిత్తూరు వాడే కాబట్టి ఒక్కచోట కూడా కృతకంగా కనిపించని చిత్తూరు యాస సహజత్వాన్ని చూడాలంటే ఎ జర్నీ టు కాశీని మించిన సినిమా ఉండదేమో మరి. ప్రారంభం లోనే 'ఏం బా..' అనే డైలాగు వినగానే అబ్బా అనిపించింది. ఇంకా అనిపించినాది, తిట్టినాడు, చేసినాడు, వచ్చినాడు, పెన్షనా పాడా నన్ను మతించేకి, కూచ్చోన్నాది... చిత్తూరు పల్లె పదాలను ఇలా సినిమాలో వినడం దూరమైపోయిన ఒక పురా జ్ఞాపకాన్ని మళ్లీ కళ్లముందు నిలబెట్టినట్లనిపించింది.
మామా నాదే తప్పు.. ఏదో యాష్టపోయినా రండి.. (కోడలు పశ్చాత్తాపం)
నువ్వు చిన్నగున్నప్పడు వయసు, కయ్యలు చేతిలో ఉన్నప్పుడు అప్పుడేమీ చేయలా.. ఇప్పుడు మాత్రం పరిగెత్తుకొచ్చినవ్. కాశీ అంటూ.
ఓ పెద్దాయనా.. సరసరమని యాడికి బోతాండావ్..
ఏట్లో దూకి చావడానికి పోతాన్నా.. నువ్వొస్తావా, రా...
ఏమ్మే చేతులూరుకోనుండవా.
మొదలుపెట్టేస్తివా. ఇంకోసారి అడిగినావనుకో.. ఇక్కడే ఎవరికో ఒకరికి అమ్మేసి పోతాం నిన్ను... (పసిపాపకు తల్లి బెదిరింపు)
కాకరకాయ అడ్డమొచ్చింది. దాన్ని వదిలేశా... అని కాశీలో మామ అంటే, ఏంది మామా.. దేవుడికే బిస్కెట్టా... ఇష్టమైంది కదా వదలాల (కోడలు చెణుకు)
నేనిక చావాల్సిందే.. అన్నీ ఉన్నప్పడు దేవుడూ, దయ్యమూ కనబడలేదు. కొడుకుతో సహా అందరినీ మోసం చేశా...నాలాంటోడు బతక్కూడదు. (చివరలో మామ అంతర్మథనం)
ఇక వెతకవద్దు. నాన్న సన్నాసులలో కల్సిపోయుంటాడు.
ఇలా చిత్తూరు భాషకు కేతనమెత్తిన సినిమా ఇది.
తెలంగాణ యాసనూ దింపేసిన సినిమా
సీన్ మారగానే జీవం ఉట్టిపడే తెలంగాణ యాస పదాలు..గదే ఇల్లు, గదే ఆకాసం, గదే బతుకు, గింత మంచిది..మాండలికం పవర్ చూపడానికే పనిగట్టుకుని ఈ రెండు భాషలు వాడారా అనిపిస్తుంది. మచ్చుకు ఈ సినిమాలోని కొన్ని తెలంగాణ డైలాగులు చూద్దాం.
బిరియానీ తినేటప్పుడు నాకేటన్నా తెలుసా. పండబెడ్తదని..
నీళ్లూ, ఆకాశం. అన్నీ స్వచ్ఛంగా ఉన్నాయి. మనమే గలీజు గాళ్లం..
అడవిలో జనం కల్లు లాంటిది తాగమని ఇస్తే తాగి డబ్బు ఇవ్వబోతే వారనే మాటలు...
'ఏ షహర్ నహీ మేడం. జంగిల్. జంగిల్ మే ఫైసల్ నై.. ఫ్రీ'
నా కొంగు తగిల్నోడు ఎవ్వడైనా దేక్కుంటా రావాల్సిందే..
ఎక్కిస్తా.. నీకూ ఎక్కిస్తా.. పిచ్చెక్కిస్తా..
ప్రయాణం మధ్యలో విరామ సమయంలో శ్వేత.. ఆధ్యాత్మిక చింతన అలవర్చుకున్న శ్వేతజాతీయుడితో అనే మాటలు...
న్యూడ్ బీచ్‌లో పెరిగినోడు స్వామీజీ కాక ఇంకేమవుతాడు..
ఈ మడీ గుడీ అంతా ఫేక్ బావా.. చీకట్లో నువ్వు కూడా కీచకుడివే..
ఫిలాసఫీ ఉంది.. అందుకే ఇండియాలో బొచ్చెడన్ని ఆశ్రమాలు..
హీరోయిన్ నా ముత్తాత.. కంగొంది జమీందారు. అప్పట్లో మద్రాసు కెళ్లి ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో సినిమాలు తీసి దివాలా తీసిండు.
నమ్మేసినావా.. ఇలాంటి కథలు వంద జెప్పుతా కస్టమర్ల తాన టిప్పులు తీసుకోటాన్కి...
స్వర్గంలో కూడా బ్రాండ్ ఉంటదిరా.. ఆ.. సోమరసం..
హీరోయిన్ శ్వేత తాగేసి కైపెక్కి కర్ర పట్టుకుని శ్వేతజాతి పురుషుడితో అంటుంది.
'రేయ్ రూథర్ ఫర్డ్, నువ్వే గదరా మా అల్లూరి సీతారామరాజును చంపేసింది. మా కోహినూర్ డైమండ్‌ను దొబ్బేసింది. మమ్మల్ని దొబ్బి దొబ్బీ మల్లొచ్చినావురా.. నీ కాల్మొక్తా బాంచెన్..'
నన్ను పక్కన పెట్టుకోని సన్నాసోడిని ఎతుకుతానావేందిరా..
శ్వేత బాల్యజీవితం గడిపిన చిత్తూరు, తదనంతరం గడపాల్సి వచ్చిన హైదరాబాద్ జీవితం క్రమాన్ని అటు చిత్తూరు మాండలికంతో, ఇటు తెలంగాణ మాండలికంతో ముడివేయడంలో దర్శకుడి కృషి అమోఘమనే చెప్పాలి. సినిమా ఇలా కూడా తీయొచ్చా. ఆడ మగ అలా నడుచుకుంటూ, మాట్లాడుకుంటూ పోతుంటారు. ఇంకే జిమ్మిక్కులూ లేవు. మనకు తెలిసిన ఊళ్లు, మనం చూసిన నదులు, మనం చూడని గుళ్లు, తీర్థయాత్రను నవనూతనంగా మల్చి ఒక పోయిటిక్ ఈస్తటిక్స్‌ని అనుభూతి చెందించిన సినిమా ఇది.
ఒక మధురవాణి, ఒక లాలస = ఒక శ్వేత
సినిమా పొడవునా సిగిరెట్ తాగే సెక్స్ వర్కర్ హీరోయిన్.. తన ప్రతి మాటా, ప్రతి అడుగూ జీవన స్వేచ్చగా భావించే తత్వం. ఈమెని చూస్తే చలం 'జీవితాదర్శం' నవలలో లాలస స్వేచ్ఛా జీవితం గుర్తుకొస్తుంది. గురజాడ కన్యాశుల్కంలో మధురవాణి పాత్రను ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. అటు రామప్పంతులను, ఇటు గిరీశాన్ని ఆటాడించడంలో ఆమె పలికే లొఠిపిఠ పలుకులను కానీ, గిరీశం ఏ మంచం కింద దూరి దాగి ఉన్నాడో అసలు విషయాన్ని రహస్యంగా పూటకూళ్లమ్మకు సంజ్ఞ చేస్తూ ఆమె నవ్వే నవ్వు కానీ మర్చిపోగలమా... సానిదాన్నయితేనేమి.. అంటూ ప్లీడర్ సౌజన్య రావు పంతులు వద్ద ఆమె సంధించే పలుకులు స్వేచ్ఛా వర్తనకు ప్రతీకలుగా నిలుస్తాయి. (శ్రీకృష్ణుడు సానిదానితో కూడా స్నేహం కడతాడా?… శ్రీకృష్ణుడు యాంటీనాచ్ కాడా అండీ?” అని మధురవాణి వేసిన ప్రశ్న.. ఆ ‘యాంటీనాచ్’ సౌజన్యారావు పంతులుకే షాక్ తెప్పిస్తుంది.) శ్వేత పాత్రకు సంభాషణలు రాసేటప్పుడు చిత్రదర్శకుడికి లాలస, మధురవాణి పాత్రలు రెండూ గుర్తుకొచ్చే ఉంటాయనిపిస్తుంది.
'ఓం నమశ్సివాయా.. ఓం నమశ్సివాయా..
మనసు మర్మమే కాశీ,. మనిషి ధర్మమే కాశీ'
కాశీ నగరంపై సినిమాలో వినిపించే పాట ఆధ్యాత్మిక వాసనలను పీలుస్తూనే మనిషి పురా జ్ఞాపకాల వలపోతను తలపిస్తుంది. సినిమా మొత్తం మార్మిక సంగీతం. ఎక్కడో దేన్నో సుదీర్ఘ లోతుల్లోంచి వెతుకుతున్నట్లు జలదరింపజేసే సంగీతం. భర్త పాత్రలో చైతన్య రావు. తన దరిదాపులకు కూడా ఎవరూ రాలేరన్నంతగా తన పాత్రకు జీవం పోశాడు. కళ్లముందే కేన్సర్ నాలుగో దశలో ఉన్న పెద్దాయన కళ్లుమూస్తే అతనెవరో తనకు తెలీకపోయినా అంత్యక్రియలు చేయడం. శంకరుడు పిలుస్తున్నాడు.. తయార్ హో అంటూ ఎక్కడినుంచో వాయిస్ వినిపించడం. 'ఉన్నింది చాలు ఇక పోయేదే' అంటూ ఊరుకెళ్లాలని కుటుంబానికి చెప్పడం. 'గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకురావడం ఎంత బాధ కలిగిస్తుందో నాకు తెలిసింది. కాశీలో నాకు శివుడి పిలుపు అందింది, నా శంకరుడు పిలుస్తున్నాడు. కుటుంబమనే పంజరం పగిలిపోయింది. సన్యాసం స్వీకరిస్తున్నాను' అని చైతన్య మాట్లాడుతూ వెళ్లిపోవడం.. మనిషి కట్టెదుట కనబడకుండా వెళ్లిపోయినప్పుడు ఆ భార్య, ఆ తండ్రి వెదుకులాట. జజ్జా మనల్ని వదిలి వెళ్లిపోయాడు, మనమిక తనతో మాట్లాడొద్దు అని పాప అంటూంటే తల్లి అలా చూస్తూండిపోవడం. ఇది నటన కాదు. మనుషులు ఉలాగ్గా అలా మాట్లాడేసుకోవడమే ఈ సినిమాకు ఆయువునిచ్చింది.
ఇవన్నీ ఒకెత్తైతే...
దొంగలాగా ఇల్లు వదిలి వెళ్లాల్సిందేనా నాన్నా!
చివరకు తాము కలవాలనుకుంటున్న శంకర తీర్థ స్వామి సాక్షాత్తూ తన తండ్రే అని గ్రహిస్తుంది శ్వేత. 'మగాడి తప్పుకు బలయ్యేది ఆడదే. ఈ న్యాయం ఎందుకు. నువ్వు కనిపించకుండా పోయాక అమ్మా నేనూ, తాత ఎన్ని కష్టాలు, అవమానాలు పడ్డామో తెలుసా.. సత్యాన్వేషణకూ, దైవాన్వేషణకూ బుద్ధుడైనా, రామానుజుడైనా... నువ్వయినా అర్ధరాత్రి దొంగలాగా ఇల్లు వదిలి వెళ్లాల్సిందేనా' అంటూ శ్వేత సంధించిన ప్రశ్న షాక్ కలిగిస్తుంది. 'ఒక్క క్షణంలో మమ్మల్నందరినీ అలా వదిలిపెట్టి వెళ్లిపోతే మిమ్మల్ని ద్వేషించి వదలిపెట్టాలో, ప్రేమించి గుర్తుపెట్టుకోవాలో.. తండ్రి లేకుండా. అండ లేకుండా..' అంటూ విలపిస్తుంది శ్వేత... దానికి కన్నతండ్రి ఇచ్చిన జవాబు అందరినీ నిరుత్తరులను చేస్తుంది.
నాన్నకు, స్వామికి అభేదమే...
'మీ నాన్న శివానంద కాశీలో మరణించి ఉంటే నువ్వు ద్వేషించేదానివా.. చావును అర్థం చేసుకుని, శవదహనం చేసి గుండెరాయి చేసుకుని వెళ్లేదానివి. మీ నాన్న శివానందం పారిపోలేదు.. జన్మజన్మల బంధాన్ని పదులుకోలేక, ఉండిపోలేక సునామీ లాంటి సంక్షోభంలో చిక్కుకుని భౌతికంగా బతికే ఉన్నా ఆధ్యాత్మికంగా వేరొక జన్మను ఎత్తాడు. గొంగళిపురుగు సీతాకోక చిలుక అయింది,. రెండోది లేదు అంతా ఒకటే. మీ నాన్న మరణించి వేరొక జన్మ ఎత్తాడు' అంటూ శివానంద అలియాస్ శంకర్ తీర్థ స్వామి అద్వైత బోధ చేస్తాడు. తనను వెతుక్కుంటా దేశమంతా తిరిగి కాశీ వచ్చిన జాక్‌ని ఉద్దేశించి... 'మీరొక గొప్ప జ్ఞానాన్వేషి. బయట వెతకొద్దు. అన్నీ లోపలే దొరుకుతాయి. లోపలే వెతకండి.. శంభో శివ శంకర...' అంటూ వెళ్లిపోవడం. చివరకు జాక్, శ్వేత ఒకటిగా మిగిలిపోవడం. గురువు జ్ఞాన బోధ చేశాక, దాన్ని విన్నాక ముగింపులో శ్మశాన శాంతి ఏర్పడడంతో సినిమా ముగుస్తుంది.
సినిమా మొత్తం కావ్య సదృశ సౌందర్య స్పృహను స్పర్శింపజేస్తుంది. సెక్స్ వర్కర్ల జీవిత బీభత్సాన్ని చూపిస్తూనే గత్యంతరంలేక ఆ వృత్తి చేపట్టిన శ్వేత తనకెదురయ్యే కష్టనష్టాలను, బాధలను ఎంత ఆత్మస్థైర్యంతో భరిస్తుందో.. సినిమా మొత్తంగా చూసి మనం కూడా అనుభూతి చెందాల్సిందే. పల్లెటూరిలో సగటు జీవితం. మహా శ్మశానమై మంటలు ఆరని మణికర్ణికా ఘాట్, పురాతనమైనదే అయినప్పటికీ నిత్య చలనశీలమైన కాశీనగరం, అక్కడే బంగుపీల్చే సన్యాసులు, వీటిమధ్యే ఒక మధ్యతరగతి కుటుంబ జీవితం క్రక్కదిలిపోవడం. 2023 జనవరి 6న విడుదలయ్యాక ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఓటీటీలో పలకరించిన మనదైన సినిమాను ఇప్పటికైనా మిస్ కావద్దు.
చైతన్య రావ్, అలెగ్జాండర్ సాల్నికోవ్, ప్రియా పాల్వాయి, క్యాతిలీన్ గౌడ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఎ జర్నీ టు కాశీ’. ఈ చిత్రాన్ని వారణాసి క్రియేషన్స్ పతాకంపై దొరడ్ల బాలాజీ, శ్రీధర్ వారణాసి సంయుక్తంగా నిర్మించారు. మునికృష్ణ దర్శకుడు. పనోరమా ఫిల్మ్ ఫెస్టివల్‌లో టాప్ 25 లిస్ట్‌లో నిలిచిన ఈ సినిమా ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితమై గుర్తింపు పొందడం విశేషం. ఈ సినిమా ఆధారంగా మలయాళంలో ఒక సినిమా తీయడానికి పూనుకుంటున్నారని తెలుస్తోంది. ఇది ప్రత్యామ్నాయ సినిమా అవునో కాదో చర్చ తర్వాత.. కానీ ఇది మామూలు సినిమా కాదని గ్రహిద్దాం.
2023 జనవరి 6న థియేటర్లలో విడుదల అయిన 'ఎ జర్నీ టు కాశీ' జాతీయ అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాలలో తొమ్మిది అవార్డులు పొంది మన్ననలు పొందింది. అమెజాన్ ప్రైమ్ రెంటల్ లో 2024 జులై 20 నుంచి ప్రసారం అవుతూ ప్రేక్షకులు, వెబ్ విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది.
లభ్యం
ఎ జర్నీ టు కాశీ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. దీన్ని ఇటీవలే కొన్ని ధర్డ్ పార్టీ సైట్లలో కూడా పెట్టేశారు. ఎవరికైనా దొరుకుతుంది. తంగలాన్ సినిమా మూడు తరాల దళితుల జీవన బీభత్సాన్ని విజువల్ వండర్‌గా చూపిస్తే, ఎ జర్నీ టు కాశీ సినిమా ఎలాంటి తళుకుబెళుకులు లేని జీవిత సౌదర్యాన్ని ఈస్తటిక్ సెన్స్‌తో మన కళ్లముందు పరిచి చూపుతుంది. హృదయాలను పిండేసే డైలాగులు వినాలన్నా, కమర్షియల్ మసాలాలు పెట్టే అవకాశం ఉన్నా వాటికి దూరంగా ఉండిపోయిన అసాధారణమైన దర్శకత్వ, సాంకేతిక ప్రదర్శనను చూడాలన్నా మీరు తప్పక ఈ సినిమాను చూడాలి. రకరకాల భావాలతో, ముద్రలతో మడిగట్టుకోకుండా సినిమాను చూస్తే ఈ కాశీయాత్ర సౌందర్యం జిగేల్ మంటూ కళ్లముందు మెరుస్తుంది.
ఎ జర్నీ టు కాశీ సినిమా చూశాక పద్మావతి బోడపాటి గారు 1994లో ఆమె రాసుకున్న కవిత గుర్తొచ్చి దర్శకుడికి పోస్ట్ చేశారు.
నాన్న వదిలి వెళ్ళిపోయాడు
చీలికలు పేలికలైన అమ్మ దేహానికి వేళ్ళాడే
నాలుగు కన్నీటి చుక్కల్లా మమ్మల్నోదిలి
నాన్న వెళ్ళిపోయాడు
నమ్మిన తన గుండె చుట్టూ కట్టుకున్న కలలగూడుని
తనచేతుల్తో తనే చిదిమి
రెక్కలురాని మమ్మల్ని రెక్కలుచాలని
అమ్మకాపుకింద వదిలి నాన్న వెళ్ళిపోయాడు
సగం ఆత్మని దేహానికీ , సగం దేహాన్ని తాగుడికీ
సగం దేహాన్ని లోకానికీ ,
సగం ఆత్మను పరువుమర్యాదలకీ అమ్ముకుని
మా పాలనవ్వు బుడగల్ని చిట్లించి
సోకగీతాలమై మేమెంట బడనంతదూరం వెళ్ళిపోయాడు
ఆకలికీ , అవమానాలకూ , అమ్మకూ మమ్మల్నప్పగించి
నాన్న వదిలివెళ్లిపోయాడు
తన్నగలిగినందుకూ , తప్పులెంచచగలిగినందుకూ
తనతిండి తను సంపాదించుకోగలిగినందుకే కదా
నాన్న వదిలి వెళ్ళిపోయింది
నాన్నకీ ప్రపంచమింత విశాలమైనందుకే కదా
నమ్మిన గుండెలమీంచి నడుచుకుంటూ వెళ్లినా
నాన్నకీ ప్రపంచంలో ఇంత చోటుండబట్టే కదా
సర్వసంగ పరిత్యాగిలా , బుద్ధుడిలా
తన శోకానికి తనే కారణాలెతుక్కుంటూ వెళ్ళిపోయింది
నాన్నలే కదా వెళ్ళిపొగలిగేది
తను సృస్థించిన శోక గుండంలో గిరగిర తిరిగే
ఆకును చేసి , అమ్మను నాన్న వదిలివెళ్లిపోయాడు
...............
- రాజశేఖరరాజు
73964 94557