T BJP: టీ-బీజేపీలో కోల్డ్ వార్.. ఆ విషయంలో కుదరని ఏకాభిప్రాయం..!

by Shiva |
T BJP: టీ-బీజేపీలో కోల్డ్ వార్.. ఆ విషయంలో కుదరని ఏకాభిప్రాయం..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ జిల్లా అధ్యక్షుల ఎంపికపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. ఎవరికి చాన్స్ ఇవ్వాలనే దానిపై కమలం పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈసారి జిల్లా అధ్యక్ష పదవులకోసం ఆశావహులు భారీగానే ఎదురుచూస్తున్నారు. ఇంకెంత కాలం పదవుల పేరుతో ఊరిస్తారని మరికొందరు పార్టీ నేతలు గరం అవుతున్నారు. ఐదారు రోజుల క్రితమే ఎంపిక పూర్తయినట్లు పార్టీలో టాక్ ఉంది. కానీ, ఐదారు జిల్లాల అధ్యక్షుల ఎంపిక విషయంలో ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలతో పాటు గ్రేటర్​పరిధిలోని 2 జిల్లాల విషయంలో పదవులు ఆశించిన నేతలు ఎంతకీ వెనక్కి తగ్గడం లేదని తెలిసింది. ఈ క్రమంలోనే ముందుగా పోటీ తక్కువ ఉన్న జిల్లాల్లో అభ్యర్థులను ఫైనల్ చేస్తారని పార్టీ నేతలు ఆశించారు. కానీ, కాషాయ పెద్దలు మాత్రం పూర్తిస్థాయి కమిటీని ప్రకటించాలనే ఉద్దేశ్యంతో ఉన్నారని సమాచారం.

అందుకే జిల్లా అధ్యక్షుల పేర్ల ప్రకటనపై జాప్యం చేస్తున్నారని పార్టీలోని కొందరు నేతలు గుసగుసలాడుతున్నట్లు వినికిడి. పార్టీ విధానాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 38 జిల్లాలు ఏర్పాటు చేసుకుని చురుకుగా పనిచేసే వారికి బాధ్యతలు అప్పగించనున్నారు. గతంలో జిల్లా అధ్యక్షులకు పోటీ తక్కువగా ఉండటంతో నాలుగైదు జిల్లాలకు కలిసి జాబితాను విడుదల చేసేవారు. ఈసారి అలా కాకుండా ఒకేసారి విడుదల చేసి పార్టీని బలోపేతం చేసేందుకు కాషాయం పెద్దలు కసరత్తు చేస్తున్నారు. నెలరోజుల నుంచి జిల్లా అధ్యక్షుల ఎంపిక విధానంలో ముందుగా ఐదుగురు పేర్లతో కూడిన జాబితా సిద్ధం చేసి అందులో ముగ్గురు పేర్లతో షార్ట్​లిస్టు చేశాక ఒకరి పేరు ఎంపిక చేసేందుకు ప్లాన్​చేశారు. కానీ, ఐదారు జిల్లాల్లో పోటీ తీవ్రంగా ఉండటంతో అక్కడ ఆశావహులను బుజ్జగించిన తర్వాత ఫైనల్ జాబితా విడుదల చేయనున్నట్లు తెలిసింది.

ఎంపీలు వర్సెస్ ​ఎమ్మెల్యేలు..

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్​జిల్లాలతో పాటు గ్రేటర్​నగరంలో ఒక సీటు గెలుచుకుని, 5 నియోజకవర్గాల్లో ద్వితీయ స్థానంలో నిలిచింది. అదే విధంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చెవేళ్ల, మహబూబ్​నగర్​జిల్లాలో ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది.ఈ సెగ్మెంట్ల పరిధిలోని జిల్లాలకు ఎమ్మెల్యేలు ఒకరి పేరు సూచించగా, ఎంపీలు తనకు అనుకూలమైన నేతల పేర్లు ప్రతిపాదించడంతో ఏకాభిప్రాయం కుదరలేదు. ఇంకొన్ని రోజులు ఆలస్యం చేస్తే ఆ నేతలే దారికొస్తారని భావించి మండలి ఎన్నికలపై అధిష్టానం ఫోకస్​పెట్టింది. పెండింగ్​జిల్లాల్లో్ని నేతలంతా ఒకే నాయకుడి పేరుని సూచించే వరకు ఈ ఆలస్యం తప్పదని టాక్. ఒకవేళ హస్తిన పెద్దల నుంచి ఆదేశాలు వస్తే తప్ప ఇప్పట్లో జిల్లాల అధ్యక్షుల ప్రకటన రావడం కష్టమేనని పార్టీ వర్గాలో చర్చ నడుస్తోంది.

బీసీలకు ప్రాధాన్యత.. ఒప్పుకోని పెద్దలు

పార్టీ హైకమాండ్​తెలంగాణలో బీసీ నినాదంతో ముందుకు వెళుతూ పార్టీ పదవుల్లో వారికే తగిన ప్రాధాన్యత ఇచ్చి తమ విధానమేమిటో చూపించాలని భావించింది. ఇంతకుముందు మండల కమిటీలు వేయగా అందులో 50 శాతం పదవులను బీసీలకే కట్టబెట్టారు. ఈసారి కూడా అలాగే జిల్లా పదవులను బీసీలకే అప్పగించాలని ప్రయత్నిస్తే తమ కులాల పరిస్ధితి ఏమిటని సీనియర్లు ప్రశ్నించినట్లు తెలిసింది. తాము సూచించిన వారికి కూడా జిల్లాల అధ్యక్ష పదవులు ఇవ్వాలని, లేకుంటే గ్రూపు విభేదాలు సృష్టిస్తామని, గత కొన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడమేమిటని నిలదీసినట్లు ప్రచారం సాగుతోంది.

ఢిల్లీ ఎన్నికలు ముగిసాకే స్టేట్ చీఫ్ ప్రకటన?

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని బీజేపీ హైకమాండ్​ఎప్పుడు ప్రకటిస్తుందని రాష్ట్రస్థాయి నేతలు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. బీసీ వర్గానికే కట్టబెడుతారని ఒకవర్గం వాదన ఉండగా, మరోవర్గం మాత్రం అగ్రవర్గాలకు అప్పగిస్తుందని ధీమాగా చెబుతున్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి కాకుండా సీనియర్లకే స్టేట్ చీఫ్ పదవి దక్కుతుందని చర్చ జరుగుతోంది. ఎందుకంటే వారికి హస్తిన పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయని, ఎలాగైనా వారిని ఒప్పించి పదవి తెచ్చుకుంటారని టాక్ ఉంది.కాగా, గత వారం రోజులుగా స్టేట్ చీఫ్ పోస్టు ఎవరికి దక్కుతుందనే విషయంపై జోరుగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story