అక్షరాలా కోట్లు.. ఆచరణలో తూట్లు!

by Aamani |
అక్షరాలా కోట్లు.. ఆచరణలో తూట్లు!
X

దిశ, వరంగల్‌ టౌన్‌: కోట్లాది రూపాయల పనులు, కొత్తకొత్త వాహనాలు, కొత్తగా ఉద్యోగ నియామకాలు, బిల్లుల చెల్లింపులు పేరిట గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ ఆమోద ముద్ర వేస్తోంది. ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే ఈ సమావేశాల్లో జరుగుతున్న తంతు ఇది. అయితే, ఒక్కో మీటింగ్‌కు కొత్త అజెండాలు, కొత్త కొత్త పనులు, వాహనాలపై దృష్టి సారిస్తున్న పాలనాధీశులు పాత మీటింగ్​లోని అంశాలు, వాటి అమలు తీరును పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. రెండేళ్ల క్రితం జరిగిన ఓ కౌన్సిల్‌ మీటింగ్​లో రూ.68లక్షలతో ఆరు ఆటోలు, ఆరు ఫాగింగ్‌ మిషన్లు కొనుగోలు చేయాలని కౌన్సిల్‌ ఆమోదించింది. ఆ మొత్తాన్ని ముందుగానే ఓ ఏజెన్సీకి అప్పగించింది. అయినా నేటికీ ఆ వాహనాల ముఖం బల్దియా అధికారులు, పాలకులు చూసిన పాపాన పోలేదు.

కనీసం వాటి విషయమై చర్చించేందుకు ఏ ఒక్కరికి కూడా నోరు రావడం లేదు. ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పే స్థాయి కూడా లేని ధైన్యస్థితిలో వరంగల్‌ మహానగర పాలక సంస్థ ఉందంటే ప్రజాపాలన, ప్రజావసరాలపై మేయర్‌ సుధారాణికి, పాలకవర్గానికి ఉన్న నిబద్ధతకు అద్దం పడుతోంది. ఈ వాహనాల పరిస్థితి ఇలా ఉంటే.. 19నెలల క్రితం రూ.2.94 కోట్లు పోసి కొనుగోలు చేసిన హుక్‌ హోల్డర్లు పోతననగర్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌లో మూలుగుతున్నాయి. నిధుల వినియోగంలో అలసత్వానికి నిలువెత్తు సాక్ష్యంగా దర్శనమిస్తున్నాయి. ఇక బల్దియా పరిధిలోని స్వచ్ఛ వాహనాలు, ఇతర వాహనాల మరమ్మతులకు మొన్నటి వరకు దిక్కులేని పరిస్థితి నెలకొంది. చివరకు మీడియాలో కథనాలు, డ్రైవర్లు వినతిపత్రం ఇచ్చిన నేపథ్యంలో మళ్లీ పాత కాంట్రాక్టర్‌కే రిపేర్‌ గ్యారేజ్‌ నిర్వహణను అప్పగించారు. అటు రూ.68 లక్షల వాహనాలు రాకపోగా, ఉన్న వాహనాల మరమ్మతులకు దిక్కులేక పోగా, కొన్న వాహనాలు తప్పు పట్టే పరిస్థితి దాపురిస్తుండగా.. తగుదునమ్మా అంటూ గత కౌన్సిల్‌ మీటింగ్​లో మరికొన్ని కొత్త వాహనాలకు ఆమోదం తెలిపారు. ఏమైందో ఏమో గానీ.. తాజాగా అవే వాహనాలకు కొత్త అంచనాలతో మంగళవారం జరిగే కౌన్సిల్‌ మీటింగ్​లో ఆమోదానికి బల్దియా పాలకవర్గం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

రూ.5 తిండికి కోటి!

బుధవారం బల్దియా కౌన్సిల్‌ మీటింగ్‌ జరగనుంది. ఈ మీటింగుకు పలు అంశాలతో అజెండా రూపొందించారు. అందులో నగరం పరిధిలో రూ.5లకే ఆహారం అందిస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్‌కు ఆగస్టు 1, 2024 నుంచి నవంబర్‌ 30, 2024 నాటికి 99 లక్షలా 27 వేలా 458 రూపాయల చెల్లింపులకు కౌన్సిల్‌ ముందుకు రానుంది. వరంగల్‌ నగరంలోని ఏనుమాముల మార్కెట్‌, వరంగల్‌ బస్టాండ్‌, ఎంజీఎం, వరంగల్‌ సీకేఎం హాస్పిటల్‌, హన్మకొండలోని అదాలత్‌లో ఈ అన్నపూర్ణ సెంటర్లు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సెంటర్లలో భోజనం తినేవారి నుంచి రూ.5లు వసూలు చేస్తుండగా, బల్దియా ఒక్కో ప్లేటుకు రూ.27 వరకు చెల్లిస్తున్నది. ఇదంతా బాగానే ఉన్నా కొన్ని చోట్ల తక్కువ ప్లేట్లు భోజనం పెట్టి ఎక్కువ ప్లేట్లు లెక్కలు చూయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఇప్పటివరకు బల్దియా అధికారులు నోరు విప్పిన పాపాన పోలేదు. కనీసం ఆయా సెంటర్లలో ఆహారం నాణ్యతను పరిశీలించిన దాఖలాలు లేవు. కానీ, ఠంచన్‌గా ప్రతీ కౌన్సిల్‌ మీటింగులో ఈ చెల్లింపులకు ప్రథమ ప్రాధాన్యం కల్పిస్తూ కౌన్సిల్‌ హాల్‌లో చప్పట్లు కొడుతున్నారు. బల్దియా రూపాయి ఖర్చు పెట్టినా అది ప్రజల సొమ్ముగానే భావించి, ప్రజోపయోగానికనే దృష్టితో వ్యవహరించాల్సిన బాధ్యతను గుర్తించాలి.

అక్రమాలు.. అవినీతి!

ఇక బల్దియాలో అజెండాలోని అంశాల ప్రాతిపదికగా ప్రాధాన్యత క్రమంలో పనులు చేపడుతున్నా, బిల్లులు చెల్లిస్తున్నా ఆచరణలో అవకతవకలు, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపణలు పరిపాటిగా మారిపోయింది. పాలకులు, అధికారులు కూడా వీటిపై నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తున్నారని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు బల్దియాలో వెలుగుచూసిన అక్రమాలు, అరెస్టులు, ఉద్యోగుల తొలగింపులే ప్రామాణికం. వీటిపై ఇప్పటివరకు జరిగిన ఏ కౌన్సిల్‌ మీటింగులోని చర్చకు రాలేదు. ఆ ఆనవాయితీ కూడా బల్దియా చరిత్రలో లేదు. కేవలం కమీషన్ల కోసం కొత్త వాహనాల కొనుగోలు, బిల్లుల చెల్లింపులు, పనులకు నిధులంటూ బల్లలు కొట్టి, చప్పట్లు చరచడం తప్ప బల్దియాలో అక్రమాలు, అవినీతిని ఎండగట్టే వారు ప్రతిపక్ష సభ్యుల్లోనూ లేరు. బల్దియా పాలకులు, అధికారుల తీరుపై మీడియాలో, సోషల్‌ మీడియాలో కథలు, కథనాలు వచ్చినా విజిలెన్స్‌ అధికారులు సైతం బల్దియా పాలకులు, అధికారుల కనుసన్నల్లోనే మెలుగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ తీరు మారాలని, అన్నింటిపై కూలంకషంగా చర్చ జరగాలని, ప్రజోపయోగ మైన పనులు మరిన్ని జరగాలనేది నగర ప్రజల ఆకాంక్ష. అది ఈ పాలకవర్గంలో నెరవేరుతుందా? లేదా అనేది మేయర్‌ సుధారాణి నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.

ముందస్తుగానే మంత్రం..!

గత కౌన్సిల్‌ సమావేశం సమయంలో ప్రతిపక్ష కార్పొరేటర్లు పలువురు ధర్నాకు దిగారు. నిధుల కేటాయింపుల్లో వారికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని కౌన్సిల్‌ హాలు ప్రధాన గేటు ఎదుట బైఠాయించారు. చివరకు అందరికీ రూ.30లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో ఆ కౌన్సిల్‌ సమావేశం సాదాసీదాగా సాగింది. అయితే, ఈ సారి మేయర్‌ ముందస్తుగానే మేల్కొన్నట్లు అర్థమవుతోంది. ఏ ఒక్క కార్పొరేటర్‌ ఎలాంటి యాగీ చేయడానికి వీలు లేకుండా వారం రోజుల ముందుగానే అందరికీ తాయిలాలు పంచినట్లు తెలుస్తోంది. ఇటీవలే 66 మంది కార్పొరేటర్లకు ఒక్కొక్కటి రూ.30వేల విలువ చేసే సెల్‌ఫోన్లు కార్పొరేటర్ల ఇంటికే పంపించినట్లు నాలుగు రోజుల క్రితం రోజుగా ప్రచారం జరిగింది. కౌన్సిల్‌ సమావేశాన్ని దృష్టిలో పెట్టుకునే మేయర్‌ చాకచక్యంగా ఈ కానుకల పర్వానికి తెరతీసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సమావేశం గత నెలలోనే జరగాల్సి ఉంది. తేదీ కూడా ఖరారైంది. అయితే, మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌ మృతితో ప్రభుత్వం వారం రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అప్పటి కౌన్సిల్‌ సమావేశం వాయిదాపడింది. తాజాగా, నేడు (బుధవారం) నిర్వహించేందుకు పాలకవర్గం నిర్ణయించింది.

ఆటో ఫాగింగ్ మిషన్ల జాప్యంపై నిలదీస్తా..: 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్లి రవి

నగర ప్రజల ఆరోగ్యరీత్యా దోమల నివారణలో భాగంగా రెండేళ్ల క్రితం 6 ఆటోలు, 6 పెద్ద ఫాగింగ్ మిషన్ల కొనుగోలు కోసం కౌన్సిల్ తీర్మానం జరిగింది. అందుకు రూ. 68 లక్షలు కేటాయించారు. ఆ చెక్కును టీఎస్ ఆగ్రోస్ కంపెనీకి ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఆ వాహనాలు, ఫాగింగ్ మిషన్లు రాలేదు. గత కౌన్సిల్ లో ఆ విషయాన్ని లేవనెత్తితే నా మైక్ కట్ చేశారు. ఈ సారి నిలదీస్తా.

Advertisement

Next Story