బాబర్‌ను టెన్షన్ పెడుతున్న గిల్.. వన్డేల్లో నం.1 బ్యాటర్ దిశగా భారత్ ఆటగాడు

by Harish |
బాబర్‌ను టెన్షన్ పెడుతున్న గిల్.. వన్డేల్లో నం.1 బ్యాటర్ దిశగా భారత్ ఆటగాడు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ వన్డేల్లో నం.1 బ్యాటర్ దిశగా దూసుకెళ్తున్నాడు. ఐసీసీ గురువారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌‌లో అతను 2వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో గిల్ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఓ సెంచరీతోపాటు రెండు అర్ధ శతకాలు బాది సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో గిల్ తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నాడు. ఒక్క స్థానం ఎగబాకి 781 రేటింగ్ పాయింట్లతో 2వ స్థానానికి వెళ్లాడు. పాక్ బ్యాటర్ బాబర్ ఆజామ్ 786 రేటింగ్ పాయింట్లతో టాప్ పొజిషన్‌లో ఉన్నారు. బాబర్‌తో పోలిస్తే గిల్ కేవలం 5 పాయింట్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. భీకర ఫామ్‌లో ఉన్న గిల్ చాంపియన్స్ ట్రోఫీలోనూ అదే జోరు కొనసాగిస్తే నం.1 బ్యాటర్‌గా అవతరించనున్నాడు. ఇతర భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ కూడా తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నాడు. ఒక్కడుగు ముందుకేసి టాప్-10లో చోటు సంపాదించాడు. 669 రేటింగ్ పాయింట్లతో 10వ స్థానంలో నిలిచాడు. ఇక, కెప్టెన్ రోహిత్ ఒక్క స్థానాన్ని కోల్పోయి 3వ ర్యాంక్‌కు, విరాట్ కోహ్లీ రెండు స్థానాలు కోల్పోయి 6వ ర్యాంక్‌కు పడిపోయారు. కేఎల్ రాహుల్ మూడు స్థానాలు దిగజారి 16వ స్థానానికి పరిమితమయ్యాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్లు తమ ర్యాంక్‌లను మెరుగుపర్చుకోలేదు. స్పిన్నర్ కుల్దీప్ మూడు స్థానాలు, సిరాజ్ నాలుగు స్థానాలు కోల్పోయి 5వ, 10వ స్థానాల్లో నిలిచారు. జడేజా, షమీ 11వ, 13వ స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక, ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో అక్షర్ పటేల్ సత్తాచాటాడు. ఏకంగా 15 స్థానాలు ఎగబాకి 40వ ర్యాంక్‌‌కు చేరుకున్నాడు.




Next Story