నగరంలో ఫ్లెక్సీలు, కటౌట్ల రాజకీయం

by Mahesh |
నగరంలో ఫ్లెక్సీలు, కటౌట్ల రాజకీయం
X

దిశ, శేరిలింగంపల్లి : నగరంలో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, అడుగడుగునా కటౌట్లు, పుట్టినరోజు, పండుగలు, మీటింగ్స్, వేడుకలు ఇలా సందర్భం ఏదైనా నగరంలో విచ్చలవిడిగా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ఫ్లెక్సీల ఏర్పాటు అనేది స్టేటస్ సింబల్‌గా మారింది. చాలామంది రాజకీయ నాయకులు ఈ మధ్యకాలంలో భారీ ఎత్తున కటౌట్లు పెడుతూ హడావిడి చేస్తున్నారు. తాజాగా అప్ కమింగ్ లీడర్లు, యువజన నాయకులు కూడా ఫ్లెక్సీలను పెడుతూ తామున్నామని, కాబోయే లీడర్లమని చెప్పుకునేందుకు తహతహలాడుతున్నారు. అయితే వీటిని చూసి సామాన్య జనాలు మాత్రం ఇదెక్కడి హడావుడి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఫ్లెక్సీ లీడర్లు..

కొంతకాలంగా ఫ్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటు సర్వసాధారణంగా మారింది. ఈ పార్టీ, ఆ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల నాయకులు ఈ చిన్న సందర్భం వచ్చినా ఎక్కడపడితే అక్కడ బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టేస్తూ పెద్దపెద్ద కటౌట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకొందరు అయితే మెయిన్ రోడ్డులో సగానికి ఆక్రమించి బ్యానర్లు కడుతున్న పరిస్థితి. దీనివల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని పాదచారులు, వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల యాక్సిడెంట్‌లు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్న వారిలో ఎక్కువగా యువతే ఉండటం గమనార్హం. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకుల పుట్టినరోజుల సందర్భంగా, ఆయా పండుగలను పురస్కరించుకుని భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు పెడుతున్నారు. వాటిని చూసిన వారంతా ఈ ఫ్లెక్సీ లీడర్ల గోలేంటి అని చర్చించుకుంటున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్..

ఫ్లెక్సీలతో హడావుడి చేస్తున్న యూత్ లీడర్లంతా రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలనే టార్గెట్‌గా పెట్టుకుంటున్నారని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగానే ఇప్పటి నుంచి హడావిడి చేస్తున్నారని, ఎవరు ఏ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారో ఆ పార్టీ నాయకుల బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని, అయితే ఈ ధోరణి బాగా శృతిమించుతుందని మండిపడుతున్నారు. తమను తాము లీడర్‌గా క్రియేట్ చేసుకునేందుకు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, నాయకులుగా ప్రమోట్ అయ్యేందుకు ఈ తరహా ప్రచారం మంచిది కాదని, ప్రజలకు మంచి చేస్తూ.. ప్రజా నాయకులుగా ఎదిగితే మంచిదని సీనియర్లు సలహా ఇస్తున్నారు.

వీరేం నాయకులు..

ఈ మధ్యకాలంలో యూత్ లీడర్లు అంటూ ఎక్కడపడితే అక్కడ, సర్కిళ్లలో పలువురు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే వీరిలో కొంతమందికి రాత్రికి రాత్రే లీడర్లుగా ప్రమోట్ చేసుకునేందుకు యత్నిస్తున్నారు. కానీ బ్యాక్ గ్రౌండ్‌‌లో వారి పూర్వాపరాలు తెలిసిన వారు మాత్రం ఈయన కూడా లీడర్ అయిపోయాడా..? ఎలా ఉండేవారు ఎలా అయిపోయారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వారు రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తారో అంటూ పెదవి విరుస్తున్నారు. కానీ అప్ కమింగ్ లీడర్లు మాత్రం జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో తామూ ఉన్నామని గట్టిగానే సంకేతాలు ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయా పార్టీల నుంచి తీవ్ర స్థాయిలో పోటీ ఉండనున్నట్లు కనిపిస్తుంది. మరి సీనియర్ లీడర్లు, ఇన్నాళ్లు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారు కొత్త వారు ఎలా ఎంకరేజ్ చేస్తారో చూడాలి.

Advertisement

Next Story