మున్సిపల్ కార్పొరేషన్‌గా మహబూబ్‌నగర్..మారనున్న పట్టణ రూపురేఖలు

by Aamani |
మున్సిపల్ కార్పొరేషన్‌గా మహబూబ్‌నగర్..మారనున్న పట్టణ రూపురేఖలు
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : మహబూబ్ నగర్ మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మారుస్తూ కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ టీకే శ్రీదేవి జీఓ ఎంఎస్ 42, ఈ నెల 25-01-2025 ప్రకారం ప్రొసీడింగ్స్ నంబర్ 77466-1/2025/ఎఫ్, ఈనెల 27న ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, మంగళవారం మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి ఆ ఉత్తర్వులు అందినట్లు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. జనవరి 26న మున్సిపల్ కౌన్సిల్ రద్దు కాగా, మహబూబ్ నగర్ జిల్లా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్‌ను స్పెషల్ ఆఫీసర్‌గా ప్రభుత్వం నియమించింది. కాగా, సోమవారం ఆయన మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో బాధ్యతలు స్వీకరించారు. రజాకారుల జమానాలో ‘దరోగా సఫాయి’ పేరుతో మొదలై క్రమంగా అంచెలంచెలుగా పెరుగుతూ 1952లో 15 వార్డులతో మహబూబ్ నగర్ మున్సిపాలిటీ గా గుర్తింపు పొందుతూ క్రమంగా 38 వార్డులకు చేరింది. అనంతరం 49 వార్డులకు చేరుకుని గ్రేడ్-1 మున్సిపాలిటీ గా మార్పు చెందింది. కాగా, నేడు కార్పొరేషన్‌గా రూపొందుంతోంది. అయితే మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా రూపొందాలంటే కనీసం 3లక్షల జనాభా కలిగి ఉండాలి. అందుకు పట్టణానికి దగ్గరలో ఉన్న దివిటిపల్లి, జైనల్లిపూర్ గ్రామాలను విలీనం చేయగా ఇప్పుడు 3.40లక్షల జనాభా దాటింది.

ఇప్పుడున్న 49 వార్డుల నుంచి 60 వార్డులుగా విస్తరిస్తూ కార్పొరేషన్‌గా రూపొందనుంది. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలకు వార్డు కౌన్సిలర్ల స్థానంలో 60 మంది కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్ స్థానంలో మేయర్ నగర పాలన కొనసాగిస్తారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారడంతో ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించి త్వరలో మహానగరం రూపొందుతుందని పులువురు వ్యాఖ్యానించారు. అయితే కార్పొరేషన్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రత్యేక వసతులను సమకూర్చడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దడం, పార్కులను సుదరీకరించడం, మంచినీటి సరఫరా వంటి అనేక సౌకర్యాలు కల్పించనున్నారు. ఉద్యోగస్తులకు కార్పొరేషన్ హెచ్ఆర్ఏగా పెంచుతూ వర్తింపజేయడం వంటి అనేక సౌలభ్యాలను కలుగనున్నాయి. నగరం మరింత అభివృద్ధి వైపు దూసుకుపోయి పాలమూరు దశ మారనుందని పట్టణ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే కార్పొరేషన్ కావడంతో ఆస్తి పన్ను పెరుగుదలకు ప్రజలు మానసికంగా సిద్ధపడి కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story