- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సంతకం పెట్టి వెళ్లిపోతున్న హెడ్‌మాస్టర్.. స్కూళ్లో దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు

దిశ, కొత్తగూడెం: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ విద్య పటిష్టంగా ఉండాలని పలు రకాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, సన్న బియ్యం తో భోజనాన్ని కూడా అందిస్తున్నది. ఇంత చేస్తున్నా గిరిజన ప్రాంతంలోని కొంతమంది ఉపాధ్యాయుల తీరు వలన జిల్లా విద్యాశాఖ ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోలేకపోతోంది. తద్వారా గిరిజన ప్రాంతంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని ద్రాక్షగా మిగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని పాత చింతకుంట పాఠశాలలో గురువారం విద్యార్థులను వదిలిపెట్టి ప్రధాన ఉపాధ్యాయుడు తన సొంత పనిమీద వెళ్లిపోయాడు. ఈ పాఠశాలలో ఒక ప్రధానోపాధ్యాయుడు, ఒక ఉపాధ్యాయురాలు ఉండగా, ఉపాధ్యాయురాలు సెలవులో ఉన్నారు. ప్రధానోపాధ్యాయుడు రిజిస్టర్‌లో సంతకం పెట్టి వెళ్లిపోయాడు. జిల్లా కేంద్రానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో కొండల మధ్య ఉన్న గిరిజన గ్రామం పాత చింతకుంట. ఈ పాఠశాలకు ఉపాధ్యాయులు సక్రమంగా రావట్లేదని విద్యార్థులు చెప్తున్నారు.
పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన HM
మైలారం కాంప్లెక్స్‌లోని పాతచింతకుంట ప్రాథమిక పాఠశాలలో 12 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గురువారం ఐదుగురు హాజరయ్యారు. పాఠశాలకు వచ్చిన ప్రధానోపాధ్యాయుడు సంతకం పెట్టి వెళ్లిపోయాడని విద్యార్థులు చెప్తున్నారు. వచ్చి వెళ్ళిపోతారని, ఇలా చాలాసార్లు జరిగినట్లు విద్యార్థులు తెలిపారు. పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయుడు వచ్చిన రోజు, ఉపాధ్యాయురాలు రాదని, ఉపాధ్యాయురాలు వచ్చిన రోజు ప్రధానోపాధ్యాయుడు రాడని పాఠశాలలోని విద్యార్థులు స్వయంగా తెలిపారు. ‘దిశ’ విలేఖరి పాఠశాలకు వచ్చాడని తెలుసుకున్న ప్రధానోపాధ్యాయుడు ఫోన్ చేసి తొలత ప్రజలోభాలకు గురి చేశాడు. వినకపోయేసరికి బెదిరింపు ధోరణిలో మాట్లాడాడు. తాను కాంప్లెక్స్ హెచ్ఎం వద్ద పర్మిషన్ తీసుకున్నానని, మీరు ఏం చేసుకున్నా.. నాకేం ఇబ్బంది కాదని, వార్త రాసుకుంటే రాసుకోండి అని బెదిరింపు ధోరణిలో మాట్లాడాడు. యూనియన్ల అండతోనే కొందరు ఉపాధ్యాయులు పాఠశాలకు సక్రమంగా హాజరు కాకపోగా, ప్రశ్నించిన వాళ్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.
అయ్యేదేం లేదు, పర్మిషన్ తీసుకున్న: ప్రధానోపాధ్యాయుడు
విద్యార్థులను పాఠశాలలోనే వదిలిపెట్టి వెళ్లిపోయిన ప్రధానోపాధ్యాయుడు, తాను కాంప్లెక్స్ HM వద్ద పర్మిషన్ తీసుకుని బయటికి వెళ్లాను అని చెప్పడం గమనార్హం. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలకు వచ్చి పాత చింతకుంట HM సంతకం పెట్టి వెళ్లిపోయాడని తెలుస్తోంది. నాలుగో తరగతి, ఐదో తరగతి చదివే విద్యార్థులు, బడి నుంచి బయటికి వెళ్లి ఏమన్నా జరిగితే బాధ్యత ఎవరిదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై మైలారం కాంప్లెక్స్ స్కూల్ HM ని వివరణ కోరగా విద్యాశాఖకు సంబంధించిన పత్రాలను తనకు ఇచ్చేందుకు పాఠశాల ముగిసే సమయానికి అర్థగంట ముందు మాత్రమే మైలారం స్కూల్‌కి రావాలని అనుమతి ఇచ్చినట్టు తెలిపారు.