మత్తు.. యువత చిత్తు..సరదాగా మొదలై.. వ్యసనంగా మారి..

by Aamani |
మత్తు.. యువత చిత్తు..సరదాగా మొదలై.. వ్యసనంగా మారి..
X

దిశ,భిక్కనూరు : డ్రగ్స్, గంజా మత్తుకు అలవాటు పడిన చాలామంది యూత్, చెడు వ్యసనాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. బాగా చదువుకుని ప్రయోజకుడవుతాడని భావించిన తల్లిదండ్రుల ఆశలు అడియాసలు చేస్తూ, గాలి తిరుగుళ్ళు తిరుగుతూ గంజాయి మత్తులో తూగుతున్నారు. వదలని మత్తులో జోగుతున్న వీరు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిలో గట్టిగా మాట్లాడడం, ఎవరైనా నచ్చజెప్పే ప్రయత్నం చేయబోతే.. నువ్వేంది నాకు చెప్పేదంటూ, ఎదుటి వారిని బెదిరిస్తూ, స్థాయిని మించి మాట్లాడడం, కొన్ని సందర్భాల్లో చేతికి అందిన వస్తువులతో వారిపై దాడులకు దిగడం రివాజ్ గా మారింది. ముఖ్యంగా కొందరు యూత్ అయితే ఏదో చిన్న విషయమై గొడవపడి, సినిమా ను తలపించే స్టైల్ లో ఘర్షణకు దిగుతున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయి. డ్రగ్స్ కు అలవాటు పడ్డ చాలామంది యూత్, ఈ మధ్యలో రెచ్చిపోయి కత్తులు కటారాలతో దాడులకు దిగడమే కాకుండా హత్యలు కూడా చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

కోళ్లు మేకలను హలాల్ చేసే మాదిరిగా....

జిల్లాలోని భిక్కనూరు మండలం మల్లు పల్లి గ్రామానికి చెందిన బీజేపీ అధ్యక్షుడు మాలె నారాయణను, సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం పల్పనూరు శివారులో దారుణంగా హత్య చేసి సంచిలో మూట కట్టి రోడ్డు పక్కన పడేశారు. అయితే నారాయణను హతమార్చింది సీస కమ్మరోళ్ల దగ్గర దొరికే చాకులతో, గొంతును రెండు మూడు చోట్ల కోసి హతమార్చినట్లు తెలుస్తోంది. బాగా మత్తులో ఉన్న యూత్, బరితెగించి ఈ మర్డర్ కు పాల్పడ్డారని తెలియడంతో ఇక్కడి పోలీసులు సైతం షాక్ కు గురవుతున్నారు. మంచి భవిష్యత్తు ఉన్న వీరు, చిన్న ఏజ్ లోనే క్రిమినల్స్ గా పోలీస్ రికార్డుల కెక్కడంతోపాటు, జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితికి తెచ్చుకున్నారు. మృతుని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వాడిదే చిన్న వయసు అనుకుంటే, అంతకంటే చిన్న వయసులో ఉన్నవారు ఈ మర్డర్ కేసులో ఇరుక్కోవడం, వారి తల్లిదండ్రులను తలెత్తుకోకుండా చేసినట్లయింది. ఏ మొహం పెట్టుకొని బయట తిరగాలన్న మనస్థాపంతో ఇండ్లకే పరిమితం కావలసిన పరిస్థితి ఏర్పడింది. గంజాయి, డ్రగ్స్ ను ఇకనైనా కంట్రోల్ చేయలేకపోతే ఇటువంటి ఘటనలు మరిన్ని రిపీట్ అవుతాయోనన్న భయం చాలామంది తల్లిదండ్రులను పట్టిపీడిస్తోంది.

విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి..

ఇటీవల గంజాయి చాలా విచ్చలవిడిగా దొరుకుతున్నట్లు సమాచారం. పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల నుంచి యువత ఇటీవల తరచూ జిల్లాలో చాలా చోట్ల సేవిస్తూ పట్టుబడుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. కామారెడ్డి జిల్లా సరిహద్దు మండలమైన భిక్కనూరును గంజాయి హబ్ గా మార్చారన్న ఆరోపణలు సైలెంట్ గా సాగుతున్నాయి. జిల్లా నలుమూలల తో పాటుగా మెదక్, సిద్దిపేట జిల్లాలకు కొందరు ముఠా సభ్యులు ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నట్లు వినికిడి. పాఠశాల పిల్లలకు చాకెట్ల రూపంలో, యూత్ కు సిగరెట్ల తో పాటుగా పొడి లాంటి పదార్థాన్ని గంజా ముఠా సభ్యులు విక్రయిస్తున్నట్లు సమాచారం. భిక్కనూరు తో పాటుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో సైతం విరివిగా ఈ గంజాయి లభిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో గంజాయి పట్టు పడుతుండడంతో పలువురు యూత్ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement

Next Story